బెట్టింగ్‌ బంగార్రాజు | betting heat in nandyal by poll | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ బంగార్రాజు

Published Thu, Aug 24 2017 2:43 AM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

బెట్టింగ్‌ బంగార్రాజు - Sakshi

బెట్టింగ్‌ బంగార్రాజు

అనంతలో నంద్యాల హీట్‌
- ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగ్‌
- రంగంలోకి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు వ్యాపారులు
- గెలుపోటములపై ఎవరి లెక్కలు వారికి
- పోలింగ్‌ శాతం పెరుగుదలతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆనందం
- ఈ నెల 27 వరకు తర్జనభర్జనలే.. 28న భవితవ్యం


బెట్టింగ్‌.. బెట్టింగ్‌.. బెట్టింగ్‌. టీ కేఫ్‌లు.. డాబాలు.. బార్ అండ్‌ రెస్టారెంట్లు.. లాడ్జీల్లో బెట్టింగ్‌ బంగార్రాజుల హడావుడి కనిపిస్తోంది. ఇండియా.. శ్రీలంక వన్డే మ్యాచ్‌లకు తోడు, నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగ్‌ హోరందుకుంది. అధికార.. ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నిక చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారేసుకుంటుండగా.. బెట్టింగ్‌రాయుళ్లు తెరపైకి రావడంతో ఫలితం హీటెక్కుతోంది.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ మ్యాచ్‌ ఎవరు గెలుస్తారు? నంద్యాలపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్‌ టాపిక్‌. పోలింగ్‌ సరళి ఆధారంగా బెట్టింగ్‌రాయుళ్లు పందెం కాస్తూ ఫలితానికి ముందే రాజకీయ సునామీ సృష్టించారు. ఇప్పటికే వేళ్లూనుకున్న క్రికెట్‌ బెట్టింగ్‌ను నిలువరించేందుకు అష్టకష్టాలు పడుతున్న పోలీసు శాఖకు.. తాజాగా నంద్యాల ఫలితంపై విచ్చలవిడిగా సాగుతున్న బెట్టింగ్‌ రూపంలో సరికొత్త సవాల్‌ ఎదురవుతోంది. ఈనెల 28న ఎన్నికల కౌంటింగ్‌ ఉండగా.. ఈ లోపు ఈ బెట్టింగ్‌ ఫీవర్‌ మరింతే ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో బుధవారం నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం భారీగా పెరిగింది.

80శాతం పైగా పోలింగ్‌ నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల తరఫున ‘అనంత’కు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ద్వితీయ,  తృతీయ శ్రేణి నేతలు పాల్పంచుకున్నారు. దీంతో ఎన్నికల సరళి, ఫలితాలపై కర్నూలు జిల్లా నేతలకు ఏస్థాయిలో అవగాహన ఉందో.. ఇంచుమించు అదేస్థాయిలో అనంత నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఫలితంగా పోలింగ్‌కు మూడురోజుల ముందు నుంచే ఎన్నికలపై పందేలు కాసేందుకు నేతలతో పాటు అనుచరులు సిద్ధమయ్యారు. బుధవారం పోలింగ్‌ ముగిసిన తర్వాత బెట్టింగ్‌ కాస్తా ఊపందుకుంది. ఉప ఎన్నికను ఇరుపార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ ‘నంద్యాల అప్‌డేట్స్‌’ను ఆసక్తిగా తెలుసుకున్నారు. వీరిలో బెట్టింగ్‌కాసే వారు కూడా అభ్యర్థుల విజయావకాశాలపై తమ పరిధిలోని వారందరితో మాట్లాడి ఓ అభిప్రాయానికి వచ్చి పందెం కాస్తుండటం గమనార్హం.

ఎవరి లెక్క వారిది
నంద్యాల ఉప ఎన్నికలో భారీ పోలింగ్‌ నమోదు కావడం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు తావిస్తోంది. భారీ పోలింగ్‌ వెనుక ప్రభుత్వ వ్యతిరేకత ఉందని.. ఇదే శిల్పా గెలుపును ఖాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు 10-15వేల మెజార్టీతో గెలుపొందవచ్చనే చర్చ జరుగుతోంది. ఆ మేరకు 1ః1 లెక్కన పందెం కాస్తున్నారు. 5-10వేల మధ్య మెజార్టీ ఉంటుందనే అంశంపైనా 1ః1 బెట్టింగ్‌ సాగింది. అదేవిధంగా మెజార్టీతో సంబంధం లేకుండా శిల్పా గెలుపుపై 1ః2 లెక్కన పందెం పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తారని కూడా టీడీపీ నేతలతో పాటు కొందరు వ్యాపారులు కూడా పందెం కాస్తున్నారు. బ్రహ్మానందరెడ్డిపై పందెం కాసేవారంతా గెలుస్తారని 1ః1 లెక్కన బెట్టింగ్‌ కాస్తున్నారు. మెజార్టీపై ఎవ్వరూ బెటింగ్‌ నిర్వహించడం లేదు.

మరో ఐదు రోజులు భారీ బెట్టింగ్‌
ఉప ఎన్నిక ఫలితం 28న వెలువడనుంది. ఈ ఐదు రోజుల్లో బెట్టింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా డబ్బు వెనకేసుకున్న ఓ ఎమ్మెల్యే ఆ పార్టీ గెలుస్తుందని.. ఎంతమంది బెట్టింగ్‌ కాసినా తీసుకోండని ఓ టీంను సిద్ధం చేశారు. అలాగే ఓ మంత్రి సమీప బంధువు శిల్పా మోహన్‌రెడ్డి గెలుస్తాడని పందేలు తీసుకుంటున్నారు. అనంతపురం కార్పొరేషన్‌ పరిధిలోని కొందరు కాంట్రాక్టర్లు కూడా ఇరుపార్టీల అభ్యర్థులపై బెట్టింగ్‌ కాస్తున్నారు. వీరు అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా వాసులతోనూ పందేలు కాస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల మేర బెట్టింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది. 28వ తేదీ నాటికి ఈ మొత్తం రూ.60–70కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement