betting heat
-
బెట్టింగ్ బంగార్రాజు
అనంతలో నంద్యాల హీట్ - ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగ్ - రంగంలోకి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు వ్యాపారులు - గెలుపోటములపై ఎవరి లెక్కలు వారికి - పోలింగ్ శాతం పెరుగుదలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆనందం - ఈ నెల 27 వరకు తర్జనభర్జనలే.. 28న భవితవ్యం బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్. టీ కేఫ్‌లు.. డాబాలు.. బార్ అండ్ రెస్టారెంట్లు.. లాడ్జీల్లో బెట్టింగ్ బంగార్రాజుల హడావుడి కనిపిస్తోంది. ఇండియా.. శ్రీలంక వన్డే మ్యాచ్‌లకు తోడు, నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగ్ హోరందుకుంది. అధికార.. ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నిక చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారేసుకుంటుండగా.. బెట్టింగ్‌రాయుళ్లు తెరపైకి రావడంతో ఫలితం హీటెక్కుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నంద్యాలపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలింగ్ సరళి ఆధారంగా బెట్టింగ్‌రాయుళ్లు పందెం కాస్తూ ఫలితానికి ముందే రాజకీయ సునామీ సృష్టించారు. ఇప్పటికే వేళ్లూనుకున్న క్రికెట్ బెట్టింగ్‌ను నిలువరించేందుకు అష్టకష్టాలు పడుతున్న పోలీసు శాఖకు.. తాజాగా నంద్యాల ఫలితంపై విచ్చలవిడిగా సాగుతున్న బెట్టింగ్ రూపంలో సరికొత్త సవాల్ ఎదురవుతోంది. ఈనెల 28న ఎన్నికల కౌంటింగ్ ఉండగా.. ఈ లోపు ఈ బెట్టింగ్ ఫీవర్ మరింతే ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో బుధవారం నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 80శాతం పైగా పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల తరఫున ‘అనంత’కు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పాల్పంచుకున్నారు. దీంతో ఎన్నికల సరళి, ఫలితాలపై కర్నూలు జిల్లా నేతలకు ఏస్థాయిలో అవగాహన ఉందో.. ఇంచుమించు అదేస్థాయిలో అనంత నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఫలితంగా పోలింగ్‌కు మూడురోజుల ముందు నుంచే ఎన్నికలపై పందేలు కాసేందుకు నేతలతో పాటు అనుచరులు సిద్ధమయ్యారు. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత బెట్టింగ్ కాస్తా ఊపందుకుంది. ఉప ఎన్నికను ఇరుపార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ ‘నంద్యాల అప్డేట్స్’ను ఆసక్తిగా తెలుసుకున్నారు. వీరిలో బెట్టింగ్‌కాసే వారు కూడా అభ్యర్థుల విజయావకాశాలపై తమ పరిధిలోని వారందరితో మాట్లాడి ఓ అభిప్రాయానికి వచ్చి పందెం కాస్తుండటం గమనార్హం. ఎవరి లెక్క వారిది నంద్యాల ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు తావిస్తోంది. భారీ పోలింగ్ వెనుక ప్రభుత్వ వ్యతిరేకత ఉందని.. ఇదే శిల్పా గెలుపును ఖాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు 10-15వేల మెజార్టీతో గెలుపొందవచ్చనే చర్చ జరుగుతోంది. ఆ మేరకు 1ః1 లెక్కన పందెం కాస్తున్నారు. 5-10వేల మధ్య మెజార్టీ ఉంటుందనే అంశంపైనా 1ః1 బెట్టింగ్ సాగింది. అదేవిధంగా మెజార్టీతో సంబంధం లేకుండా శిల్పా గెలుపుపై 1ః2 లెక్కన పందెం పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తారని కూడా టీడీపీ నేతలతో పాటు కొందరు వ్యాపారులు కూడా పందెం కాస్తున్నారు. బ్రహ్మానందరెడ్డిపై పందెం కాసేవారంతా గెలుస్తారని 1ః1 లెక్కన బెట్టింగ్ కాస్తున్నారు. మెజార్టీపై ఎవ్వరూ బెటింగ్ నిర్వహించడం లేదు. మరో ఐదు రోజులు భారీ బెట్టింగ్ ఉప ఎన్నిక ఫలితం 28న వెలువడనుంది. ఈ ఐదు రోజుల్లో బెట్టింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా డబ్బు వెనకేసుకున్న ఓ ఎమ్మెల్యే ఆ పార్టీ గెలుస్తుందని.. ఎంతమంది బెట్టింగ్ కాసినా తీసుకోండని ఓ టీంను సిద్ధం చేశారు. అలాగే ఓ మంత్రి సమీప బంధువు శిల్పా మోహన్‌రెడ్డి గెలుస్తాడని పందేలు తీసుకుంటున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని కొందరు కాంట్రాక్టర్లు కూడా ఇరుపార్టీల అభ్యర్థులపై బెట్టింగ్ కాస్తున్నారు. వీరు అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా వాసులతోనూ పందేలు కాస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 28వ తేదీ నాటికి ఈ మొత్తం రూ.60–70కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
బతుకులు..బౌల్డ్
– జోరుగా క్రికెట్ బెట్టింగ్ – ఇప్పటి వరకూ రూ.100 కోట్ల మేర పందేలు – మే 21 వరకూ కొనసాగే అవకాశం – బెట్టింగ్ నివారణలో పోలీసుల వైఫల్యం - అడపాదడపా అరెస్టులతో సరి (సాక్షి ప్రతినిధి, అనంతపురం) - తాడిపత్రిలో బెట్టింగ్‌కు దిగిన ఓ వ్యక్తి ఐపీఎల్ సీజన్ మొదలైన పది రోజులకే రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. పోయిన డబ్బును తిరిగి సంపాదించేందుకు మరో రూ.3 లక్షలు అప్పు చేశాడు. అదీ పోయింది. అతని తండ్రి రెండేళ్ల కిందటే చనిపోయాడు. దీంతో అప్పులోళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక తండ్రి పేరుతో ఉన్న 2.5 ఎకరాల పొలాన్ని అమ్మేందుకు ఆ బెట్టింగ్‌రాయుడు సిద్ధమయ్యాడు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. ఐపీఎల్ సీజన్ సగం ముగియడంతో ఇప్పటికే చాలామంది బెట్టింగ్ రాయుళ్ల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఐపీఎల్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్లపై భారీగా పందేలు కాశారు. ఆ జట్లు అత్యంత పేలవంగా ఆడటంతో ‘బెట్టింగ్’ లెక్కలు తారుమారయ్యాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ లయన్స్, పూణే వారియర్స్ సూపర్ జెయింట్స్‌పై పందేలు కాసిన వారు దారుణంగా దెబ్బతిన్నారు. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, ధర్మవరం లాంటి ప్రధాన పట్టణాలతో పాటు పల్లెవాసులూ ఇప్పటికే భారీగా నష్టపోయారు. ఐపీఎల్–10 సీజన్లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో బెట్టింగ్ సాగుతోంది. ఏప్రిల్ 5న మొదలైన ఐపీఎల్ ఈ నెల 21న ముగుస్తుంది. ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ బెట్టింగ్‌లో చేతులు కాల్చుకున్న వారంతా ఈ 18 రోజుల్లో పోయినంతా సంపాదించాలనే ఆత్రుతతో అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. గుత్తిలో బెట్టింగ్ నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి, బుకీకి మధ్య రెగ్యులర్‌గా లావాదేవీలు నడిచేవి. ఈ సీజన్లో ఈ వ్యక్తి నుంచి బుకీకి రూ.4.5 కోట్ల మేర డబ్బులందాయి. రూ.24 లక్షల విషయంలో ఇద్దరికీ తేడా వచ్చింది. ఇందులో రూ.21 లక్షలను బుకీకి ఇచ్చాడు. తక్కిన రూ.3 లక్షల కోసం బుకీ తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆ డబ్బు ఇచ్చేది లేదని, మరీ ఒత్తిడి చేస్తే నీ చరిత్ర మొత్తం లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఆ వ్యక్తి.. బుకీని బెదిరించాడు. దీంతో అతను నిమ్మకుండిపోయాడు. గుత్తికి చెందిన ఒక వ్యక్తి నుంచే రూ.4.5 కోట్ల లావాదేవీలు నడిచాయంటే, జిల్లా మొత్తం ఏస్థాయిలో బెట్టింగ్ సాగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కనీసం రూ.80–100 కోట్ల మేర బెట్టింగ్ సాగి ఉంటుందని అంచనా. అనంతపురం నగరంలో కూడా ఓ ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి బెంగళూరు జట్టుపై పందెం కాసి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. హాస్టళ్లలోని చాలామంది విద్యార్థులు కూడా బెట్టింగ్ కాస్తున్నారు. 10–20 మంది స్నేహితుల గదుల్లో గుంపుగా చేరి మ్యాచ్ జరుగుతున్న సమయంలో ‘బాల్ టు బాల్ బెట్టింగ్’ వేస్తున్నారు. తల్లిదండ్రులు ఫీజులు, ఖర్చుల నిమిత్తం ఇచ్చిన డబ్బును ఇలా తగలేసి..మళ్లీ వారిని డబ్బు కోసం వేధిస్తున్నారు. పోలీసుల చర్యలు అంతంత మాత్రమే బెట్టింగ్ నివారణలో పోలీసులు చురుకైన పాత్ర పోషించడం లేదు. అక్కడక్కడ అడపాదడపా తనిఖీలు నిర్వహించడం మినహా పూర్తిగా అరికడదామనే తరహాలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం లేదు. ఏప్రిల్ 21న హిందూపురంలో బెట్టింగ్ నిర్వహిస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.62,200 స్వాధీనం చేసుకున్నారు. 30న యాడికిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మినహా పెద్దగా చర్యలు లేవు. అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కదిరిలో రోజూ రూ.కోట్లలో బెట్టింగ్ సాగుతోంది. మొబైల్ ఫోన్లలోనే పని కానిచ్చేస్తున్నారు. ఏ మ్యాచ్‌కు ఎవరిపై ఎంత కాయాలనేది ఫోన్ల ద్వారానే ఖరారు చేసుకుని.. ఓ ప్రాంతంలో కలిసి డబ్బు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇది కాకుండా బాల్ టు బాల్ బెట్టింగ్ కూడా లాడ్జీలు, బ్యాచ్లర్స్ గదుల్లో సాగుతోంది. కనీసం వీటిపై కూడా పోలీసులు చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్ గురించి పోలీసులకు తెలుసని, అయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రత్యేక బృందాలను నియమించి.. బెట్టింగ్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది.