బతుకులు..బౌల్డ్‌ | betting heat in ipl 10 season | Sakshi
Sakshi News home page

బతుకులు..బౌల్డ్‌

Published Wed, May 3 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

బతుకులు..బౌల్డ్‌

బతుకులు..బౌల్డ్‌

– జోరుగా క్రికెట్‌ బెట్టింగ్‌
– ఇప్పటి వరకూ రూ.100 కోట్ల మేర పందేలు
– మే 21 వరకూ కొనసాగే అవకాశం
– బెట్టింగ్‌ నివారణలో పోలీసుల వైఫల్యం
- అడపాదడపా అరెస్టులతో సరి


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
- తాడిపత్రిలో బెట్టింగ్‌కు దిగిన ఓ వ్యక్తి ఐపీఎల్‌ సీజన్‌ మొదలైన పది రోజులకే రూ.4 లక్షలు పోగొట్టుకున్నాడు. పోయిన డబ్బును తిరిగి సంపాదించేందుకు మరో రూ.3 లక్షలు అప్పు చేశాడు. అదీ పోయింది. అతని తండ్రి రెండేళ్ల కిందటే చనిపోయాడు. దీంతో అప్పులోళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేక తండ్రి పేరుతో ఉన్న 2.5 ఎకరాల పొలాన్ని అమ్మేందుకు ఆ బెట్టింగ్‌రాయుడు సిద్ధమయ్యాడు.

జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా నడుస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ సగం ముగియడంతో ఇప్పటికే చాలామంది బెట్టింగ్‌ రాయుళ్ల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఐపీఎల్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన జట్లపై భారీగా పందేలు కాశారు. ఆ జట్లు  అత్యంత పేలవంగా ఆడటంతో ‘బెట్టింగ్‌’ లెక్కలు తారుమారయ్యాయి. ముఖ్యంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్, పూణే వారియర్స్‌ సూపర్‌ జెయింట్స్‌పై పందేలు కాసిన వారు దారుణంగా దెబ్బతిన్నారు. అనంతపురం, హిందూపురం, గుంతకల్లు, కదిరి, తాడిపత్రి, ధర్మవరం లాంటి ప్రధాన పట్టణాలతో పాటు పల్లెవాసులూ ఇప్పటికే భారీగా నష్టపోయారు.  

        ఐపీఎల్‌–10 సీజన్‌లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో బెట్టింగ్‌ సాగుతోంది. ఏప్రిల్‌ 5న మొదలైన ఐపీఎల్‌ ఈ నెల 21న ముగుస్తుంది. ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ బెట్టింగ్‌లో చేతులు కాల్చుకున్న వారంతా ఈ 18 రోజుల్లో పోయినంతా సంపాదించాలనే ఆత్రుతతో అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. గుత్తిలో బెట్టింగ్‌ నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి, బుకీకి మధ్య రెగ్యులర్‌గా లావాదేవీలు నడిచేవి. ఈ సీజన్‌లో ఈ వ్యక్తి నుంచి బుకీకి రూ.4.5 కోట్ల మేర డబ్బులందాయి. రూ.24 లక్షల విషయంలో ఇద్దరికీ తేడా వచ్చింది. ఇందులో రూ.21 లక్షలను బుకీకి ఇచ్చాడు. తక్కిన రూ.3 లక్షల కోసం బుకీ తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆ డబ్బు ఇచ్చేది లేదని, మరీ ఒత్తిడి చేస్తే నీ చరిత్ర మొత్తం లేఖలో రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఆ వ్యక్తి.. బుకీని బెదిరించాడు. దీంతో అతను నిమ్మకుండిపోయాడు. గుత్తికి చెందిన ఒక వ్యక్తి నుంచే రూ.4.5 కోట్ల లావాదేవీలు నడిచాయంటే, జిల్లా మొత్తం ఏస్థాయిలో బెట్టింగ్‌ సాగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ కనీసం రూ.80–100 కోట్ల మేర బెట్టింగ్‌ సాగి ఉంటుందని అంచనా. అనంతపురం నగరంలో కూడా ఓ ఎలక్ట్రికల్‌ షోరూం వ్యక్తి బెంగళూరు జట్టుపై పందెం కాసి రూ.11 లక్షలు పోగొట్టుకున్నాడు. హాస్టళ్లలోని చాలామంది విద్యార్థులు కూడా బెట్టింగ్‌ కాస్తున్నారు. 10–20 మంది స్నేహితుల గదుల్లో గుంపుగా చేరి మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ‘బాల్‌ టు బాల్‌ బెట్టింగ్‌’ వేస్తున్నారు. తల్లిదండ్రులు ఫీజులు, ఖర్చుల నిమిత్తం ఇచ్చిన డబ్బును ఇలా తగలేసి..మళ్లీ వారిని డబ్బు కోసం వేధిస్తున్నారు.

పోలీసుల చర్యలు అంతంత మాత్రమే
     బెట్టింగ్‌ నివారణలో పోలీసులు చురుకైన పాత్ర పోషించడం లేదు. అక్కడక్కడ అడపాదడపా తనిఖీలు నిర్వహించడం మినహా పూర్తిగా అరికడదామనే తరహాలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం లేదు. ఏప్రిల్‌ 21న హిందూపురంలో బెట్టింగ్‌ నిర్వహిస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.62,200 స్వాధీనం చేసుకున్నారు. 30న యాడికిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.60వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మినహా పెద్దగా చర్యలు లేవు.

అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, ధర్మవరం, కదిరిలో రోజూ రూ.కోట్లలో బెట్టింగ్‌ సాగుతోంది. మొబైల్‌ ఫోన్లలోనే పని కానిచ్చేస్తున్నారు. ఏ మ్యాచ్‌కు ఎవరిపై ఎంత కాయాలనేది ఫోన్ల ద్వారానే ఖరారు చేసుకుని.. ఓ ప్రాంతంలో కలిసి డబ్బు  ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇది కాకుండా బాల్‌ టు బాల్‌ బెట్టింగ్‌ కూడా లాడ్జీలు, బ్యాచ్‌లర్స్‌ గదుల్లో సాగుతోంది. కనీసం వీటిపై కూడా పోలీసులు చర్యలకు ఉపక్రమించడం లేదు. ఈ ప్రాంతాల్లో జరిగే బెట్టింగ్‌ గురించి పోలీసులకు తెలుసని, అయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రత్యేక బృందాలను నియమించి.. బెట్టింగ్‌కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement