విభిన్న ప్రతిభలకు వేదిక
-రావులపాలెంలో భరత్ టాలెంట్ టెస్ట్
-దేశం నలుమూలల నుంచి కళాకారులు
-ముక్కుతో వాయిద్యాల వాదనలో రికార్డు సృష్టించిన సోహమ్
రావులపాలెం : స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్ శనివారం నిర్వహించిన భరత్ టాలెంట్ ఫెస్ట్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విభిన్న వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న కళాకారులు హాజరయ్యారు. వీరికి భరత్ శిరోమణి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా వారిలో కొందరిని ‘సాక్షి’ పలకరించింది. కోల్‌కతా సమీపంలోని బర్ధమాన్ పట్టణానికి చెందిన సోహమ్ ముఖోపాధ్యాయ పదేళ్ళ వయసు నుంచి ముక్కుతో మౌత్ ఆర్గన్‌ను వాయించడంపై దృష్టి పెట్టారు. ప్రసుతం కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆయన మౌత్‌ఆర్గన్‌ను ముక్కుతో ఏకధాటిగా 20 నిమిషాల 20 సెకన్ల వాయిస్తూ ప్రపంచ రికార్డు సాధించారు. సోహమ్ తాజాగా మెలోడికా, ప్లూట్ సంగీత వాయిద్యాలను కూడా ముక్కుతో వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. మెలోడికాను 30 నిమిషాల 22 సెకన్లు, ప్లూట్‌ను 6 నిమిషాల 9 సెకన్లు వాయించడంలో ప్రపంచ రికార్డులు సాధించారు. ప్రపంచంలో ఈ మూడింటిని ముక్కుతో వాయించే ఏకైక వ్యక్తిని తానేనని సోహమ్ తెలిపారు.
ఆయన పత్రికల్నే చిత్రిస్తారు..
హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన డాక్టర్ దార్ల నాగేశ్వరరావు దినపత్రికలను అచ్చుగుద్దినట్టుగా చిత్రీకరిస్తూ అబ్బుర పరుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ ప్రెస్‌లో ఆర్టిస్టుగా పని చేస్తున్న ఆయన రిప్లికా ఆర్ట్‌లో ప్రావీణ్యుడు. దేశంలోని 14 భాషలతోపాటు మరో నాలుగు విదేశీ భాషల్లోని 45 దినపత్రికలనుచిత్రీకరించి ఔరా అని పిస్తున్నారు. దినపత్రికలోని మొదటి పేజీలను అసలుకు ఏమాత్రం తగ్గకుండా అచ్చుగుద్దినట్టుగా చేతితో వివిధ రంగుల పెన్నులతో చిత్రాలు వేయడం విశేషం. ఫొటోలనుమాత్రం వేరే పత్రిక నుండి సేకరించి అతికిస్తానని, మిగిలినవన్నీ పెన్నులతో చిత్రీకరిస్తానని ఒక పేజీకి 15 నుండి 30 రోజుల సమయం పడుతుందని తెలిపారు. నయా క్యాలెండర్ పేరుతో 2001 నుంచి 2120 సంవత్సరం వరకూ 120 సంవత్సరాల క్యాలెండర్‌ను తయారు చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులను సాధించారు.
చెట్టు నాణేల సేకరణ ఆయన ప్రత్యేకత
భూమిపై చెట్టు, నీరు, జీవరాశుల ఆవశ్యకతను తెలియజేపుతూ వివిధ దేశాలు రూపొందించిన నాణేల సేకరణతో ఆకట్టుకొంటున్నారు కాజులూరు మండలం శీలలంక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతిన వెంకట నారాయణ. ఆయన ప్రత్యేకంగా చెట్టు చిత్రంతో ఉన్న 130 దేశాల 450 నాణేలు సేకరించి ఎన్నో అవార్డులు పొందారు. ఆయన సేకరించిన ప్రతి నాణెంపై చెట్టు లేదా పర్యావరణ నినాదం ఉంటాయి. ఈ నాణేల సేకరణతో ఆయన కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మిత్ర అవార్డును, 2009, 2015 రాష్ట్రస్థాయి నాణేల ప్రదర్శనలో బంగారు పతకాల్ని సాధించారు. 2016లో బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనకు హజరయ్యారు.