భవానీ దీక్షలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి : భవానీ దీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మండలం పాటు దీక్షలను ఆచరించే భక్తులు గురువారం తెల్లవారుజామున పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలను ఆచరించి, ఎరుపు రంగు దుస్తులు ధరించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భవానీలు.. గురు భవానీలు, ఆలయ అర్చకుల చేతులమీదుగా దీక్ష స్వీకరించారు. 14వ తేదీ కార్తీక పౌర్ణమి వరకు మండల దీక్షలను స్వీకరించే వీలుందని ఆలయ అర్చకులు తెలిపారు. తొలుత అంతరాలయంలో మూలవిరాట్‌కు పూజలుచేసి పగడాల మాల అలంకరించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించి మహామండపంలోని ఆరో అంతస్తులో ఆర్జిత సేవలు నిర్వహించే ప్రాంగణానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య మాలధారణ చేసి, అఖండ జ్యోతి ప్రజ్వలన చేశారు. దీంతో భవానీ దీక్షలు లాంఛనంగా ప్రారంభం కాగా, దీక్షలు స్వీకరించేందుకు విచ్చేసిన భవానీలకు ఆలయ అర్చకులు, గురు భవానీలు మాలధారణ చేశారు. మహామండపం సమీపంలోని యాగశాలలో గురువారం దుర్గా సప్తశతి హోమం నిర్వహించారు. దీక్షలు స్వీకరించిన భవానీలు, భవానీ భక్తులు హోమాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు.