
భోగాపురం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత
విజయనగరం : భోగాపురం ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాల్లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. తూడెం ఎయిర్పోర్ట్ నోటిఫై భూముల్లోరైట్స్ సంస్థ సర్వేరాళ్లు పాతింది. తూడెం, గిద్దలపాలెంలో భారీ బందోబస్తు చేపట్టడమే కాకుండా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు టీడీపీ ఎంపీటీసీ పైల రాము భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. తమ భూముల్లో అనుమతి లేకుండా సర్వేరాళ్లు వేయటంపై నిరసన తెలిపారు.
కాగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు.
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటిస్తారని సుజయ్ కృష్ణరంగారావు తెలిపారు. ఆయా గ్రామాల్లో సుజయ్ రంగారావు, జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు నిన్న పర్యటించారు.