శ్రీత్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవాలు
సత్తెనపల్లి: పట్టణంలోని ఫిరోజీ మందిరం వెనుక గల శ్రీత్రిశక్తి దుర్గాపీఠంలో దశమ వార్షిక బ్రహ్మో త్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిశక్తి స్వరూపిణీలైన మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి లక్ష నాగవల్లి పత్రాలతో విఘ్నేశ్వరపూజ, ప్రసన్నాంజనేయస్వామి పూజలు నిర్వహించారు. త్రిపురమల్లు రవిచంద్రకుమార్, సునీత దంపతులు ఇంటి నుంచి అమ్మవార్లకు ప్రభ ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాసకుమారి ఆధ్వర్యంలో ముఖ్యశిష్యులు ∙గురుపూజ చేపట్టారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని పట్టెం వెంకటేశ్వర్లు, లలితకుమారి దంపతులు ప్రారంభించారు. వివిధ దేవతా మూర్తుల రూపాలతో కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆహుతులను అలరింప చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ పీఠాధిపతులు వెలిదండ్ల హనుమంత రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.