Brahmotsavas
-
కమనీయం.. గణనాథుని కల్యాణం
యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్ స్వామి, సుబ్బారావు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు. -
విశ్వకర్మ నిర్మించిన ఆలయం ఇప్పటికీ తిరుమలలో ఉందా ...?
-
నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.40 లక్షల బడ్జెట్‌తో వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బాలాలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో ముస్తాబు చేస్తున్నారు. రామాయణం మహాభారతం, భాగవతం, చతుర్వేద పారాయణాలు పఠించడానికి సుమారు 50 మంది రుత్విక్కులను ఆహ్వానించారు. హనుమంత, గజ, గరుడ, కల్పవృక్షం వంటి వివిధ వాహనాలను సేవలకు సిద్ధం చేశారు. ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా రోజూ 1,000 మందికి, ముఖ్యమైన మూడు రోజుల్లో 1,500 మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండపై ప్రత్యేక క్యూౖ లెన్లు, వికలాంగులకు, వీఐపీలకు, సామాన్య భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్.. - శనివారం ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంకాలం 6:30 మృత్సంగ్రహణం, అంకురార్పణం - 18 ఉదయం : 11 గంటలకు ధ్వజారోహణం, సాయంకాలం 6:00 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం - 19 ఉదయం 11 గంటలకు మత్య్సావతార అలంకార సేవ, వేద పారాయణాలు ప్రారంభం, రాత్రి 9:00 శేష వాహన సేవ - 20 ఉదయం 11 గంటలకు శ్రీ కృష్ణాలంకారం, రాత్రి 9 గంటలకు హంస వాహనసేవ - 21 ఉదయం 11 గంటలకు వటపత్ర శాయి అలంకారసేవ, రాత్రి 9:00 గంటలకు పొన్న వాహనసేవ - 22 ఉదయం 11గంటలకు గోవర్ధన గిరిధారి అలంకారసేవ, రాత్రి 9:00 సింహ వాహనసేవ - 23 ఉదయం 11గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9:00 గంటలకు అశ్వవాహన సేవ, బాలాలయంలో స్వామి, అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవం - 24 ఉదయం 10 గంటలకు శ్రీ రామాలంకారం సేవ, హనుమంత సేవ, 11గంటలకు గజ వాహన సేవ బాలాలయంలో తిరుకల్యాణం, రాత్రి 8 గంటలకు భక్తుల సౌకర్యార్థం కొండకింద హైస్కూల్ మైదానంలో స్వామి, అమ్మవారి వారి కల్యాణం - 25 ఉదయం మహావిష్ణు అలంకారం సేవ, గరుడవాహన సేవ, బాలాలయంలో రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు విమాన రథోత్సవం, కొండ కింద 8 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి దివ్యవిమాన రథోత్సవం ప్రచార రథం ఊరేగింపు ఉంటుంది. - 26 ఉదయం 10:30 గంటలకు మహా పూర్ణాహుతి, శ్రీ చక్ర తీర్థస్నానం, సాయంత్రం 6:00 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం - 27 ఉదయం 10:00 గంటలకు శ్రీ స్వామివారి అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఉత్సవాల సమాప్తి. -
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల: అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13 నుండి 21 వరకు వార్షిక, అక్టోబర్ 10 నుండి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెండు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రెండు బ్రహ్మోత్సవాలెందుకు? వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ∙సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసంవల్ల ప్రతీ మూడేళ్లకోసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయం. -
24 నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనున్నాయి. 24న అంకురార్పణ, 26న స్వామివారి ఎదుర్కోలు, 27న తిరుకల్యాణ మహోత్సవం, 28న దివ్య విమాన రథోత్సవం ఉంటాయని ఈవో గీతారెడ్డి తెలిపారు. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రంగులు, సున్నాలు, చలువ పందిళ్లు వేస్తున్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేత ఈ నెల 31న చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నామని ఈవో వెల్లడించారు. ఆలయాన్ని ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసివేస్తున్నట్లు చెప్పారు. -
కొంగు బంగారం... మత్మ్యాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మత్మ్యాద్రి ఆలయం (వేములకొండ గుట్ట) భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నాలుగు కొండల మధ్యనున్న గుట్ట మీద బండరాయిపై స్వయంభూగా వెలిశాడు లక్ష్మీనరసింహస్వామి. మత్సా్వవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుండడంతో మత్స్యగిరి ఆలయంగా పేరొందింది. కొలిచిన వారికి కొండంత అండగా, భక్తుల కొంగు బంగారంగా పేరొందిన ఆలయ బ్రహ్మోత్సవాలు గత నెల 30న ఆరంభమైనాయి. ఈ నెల 4వ తేదీ వరకు జరుగుతాయి. క్షేత్ర ప్రాశస్త్యం వలిగొండ మండల కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది మత్సా్యద్రి ఆలయం. మొదట్లో ఆలయాన్ని వేములకొండ గుట్టగా పిలిచేవారు. మత్స్యగిరిగుట్ట సమీపంలోని పొట్టిగుట్టపై చూస్తే స్వామి వారు వెలిసిన గుట్ట చేప రూపంలో దర్శనం ఇవ్వడం, గుట్ట మీదకు వెళ్తుంటే సగ భాగం వద్ద శిలద్వారానికి చేప శిల్పం చెక్కి ఉండడంతో మత్స్యగిరిగుట్టకు ఆ పేరొచ్చింది. కాగా నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం పేర్లు కలిగిన మూడు గుండాల కలయికతో కొలను ఏర్పడింది. కొలనులో నీరు ఏ కాలంలోనైనా అదే స్థాయిలో ఉండటం, కొలనులోని చేపలన్నీ ఒకే పరిమాణంలో ఉండటం, గర్భగుడి ముందుండే కొలనులోని చేపలు నామాలు కలిగి ఉండడం ఆలయ ప్రత్యేకత. స్వామివారు మత్స్య రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ఖ్యాతికెక్కింది. మహిమాన్వితమైన తీర్థజలం స్వామి వారి ఆలయం ముందున్న కొలనులోని నీటిని పంట చేలలో చల్లుకుంటే పంటలను ఆశిస్తున్న చీడపీడలు దూరమై దిగుబడి పెరుగుతుందని నమ్మకం. వ్యాపార సంస్థలలో ఆ నీటిని చల్లితే వ్యాపారాలు అభివృద్ధిలో నడుస్తాయని ప్రతీతి. అందుకే భక్తులు కొలనులోని నీటిని తీసుకెళ్తారు. ఇక అనారోగ్యం పాలైన వారు స్వామివారి ఆలయ సన్నిధిలో నిద్ర చేస్తే స్వామివారు కలలోకి వచ్చి ఆయా రుగ్మతలను నయం చేస్తారని నమ్మకం. దీంతో భక్తులు గుట్టపై నిద్ర చేస్తారు. గుట్టపైకి మూడు ఘాట్ రోడ్లు స్వామివారిని దర్శించుకోవడానికి గుట్టపైకి అప్పట్లో నడిచి వెళ్లేవారు. వేములకొండకు చెందిన ఒక భక్తుడు సొంత నిధులతో గుట్ట మీదికి తారు రోడ్డు, సీసీ రోడ్డు వేయించాడు. వలిగొండ, మోత్కూరు రోడ్డులో ఆరూరు పరిధిలో వెంచర్ చేసిన సంస్థ గుట్టపైకి వెళ్లడానికి మరో ఘాట్‌రోడ్డు నిర్మించింది. రెండు వైపులా ఘాట్‌రోడ్లు ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు ఘాట్ రోడ్డు మార్గం వైపు నుంచే రాకపోకలు సాగిస్తుండడంతో మెట్ల మార్గం వైపు ఉన్న చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ వ్యాపారులతోపాటు మరికొందరు దాతల సహకారంతో మెట్ల మార్గం పక్కనుంచి మరో ఘాట్‌రోడ్ నిర్మించారు. ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయు స్వామి కావడంతో స్వామి వారి దర్శనానంతరం భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఇతర దర్శనీయ స్థలాలు వలిగొండ పట్టణంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే ఆలయంలో కొలువైన ఇష్టకామేశ్వరస్వామి త్రిశక్తి ఆలయం ఉంది. ఈ ఆలయ సముదాయంలో 9 ఆలయాలు ఉన్నాయి. సంగెం వద్ద భీమలింగం కత్వ వద్ద భారీ శివలింగం ఉంటుంది. దీనిని భీముడు ప్రతిష్టించడంతో భీమలింగంగా పేరొందిందని ప్రతీతి. అలాగే సుంకిశాలలో యాదాద్రి దత్తత ఆలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం ఉంది. – వాసా శ్రీధర్, సాక్షి, వలిగొండ నైవేద్యం ఆరగించడానికి వస్తున్న చేప -
బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం ద్వారా అంకుర్పారణ జరిగింది. ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారాకనాథాచార్యులు అధ్వర్యంలో వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహా మంగళహారతి, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడిని ప్రత్యేక పల్లకీలో కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు.శాంతిహోమం, ప్రాకారోత్సవ కార్యక్రమాలు వేదపండితుల సమక్షంలో నిర్వహించారు. ఈఓ రమేష్‌బాబు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్ఆర్ కన్‌స్ర్టక్షన్స్ అధినేత ఆమిలినేని సురేంద్ర సహకారంతో ఆలయం చుట్టూ మట్టితో చదును చేయించామన్నారు. -
ఏప్రిల్ 4 నుంచి రాములోరి బ్రహ్మోత్సవాలు
వైఎస్సార్ జిల్లా: రెండో అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు టీటీడీ నిర్వహించనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్ధానం షెడ్యూల్‌ను రూపకల్పన చేసింది. ఏప్రిల్ 4 అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 5 న ధ్వజరోహణ, 8న హనుమంత సేవ, 9న గరుడ వాహనం ఊరేగింపు, 10న సీతారామ కళ్యాణం, 11న రధోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 25, 26 బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పనులు పూర్తి అయ్యేలా ఈఓ, జేఈఓలు దృష్టి సారించనున్నారు. టీటీడీ పరంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించనున్నారు. -
మహానందిలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మహానంది: మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి అంకురార్పణ పూజలు చేశారు. మహానంది దేవస్థానం పాలక మండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ బి.శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, శాంతారాంభట్.. విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, చండీశ్వరపూజ, దీక్షాధారణ, అఖండస్థాపనములు, తిరుమంజనము జరిపారు. రాత్రి అగ్నిప్రతిష్ఠాపన, కలశస్థాపన, వాస్తుపూజా హోమం, భేరిపూజ, ధ్వజారోహణం, బలిహరణం, వేదశాస్త్ర సమర్పణం గావించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం సూపరింటెండెంట్ ఈశ్వర్‌రెడ్డి, కళ్యాణోత్సవ దాత లక్కనబోయిన ప్రసాదు, ఆలయ ధర్మకర్తలు బాలరాజు, రామకృష్ణ, మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘పుష్కర’ స్ఫూర్తితో బ్రహ్మోత్సవ దీప్తి
- కృష్ణా పుష్కరాల తరహాలో శివరాత్రి ఉత్సవాలు - పాదయాత్రికులకు ప్రథమ చికిత్స కేంద్రాలు - అటవీ మార్గంలో అన్నదాన శిబిరాలు - శ్రీశైలానికి తిరగనున్న 150 ప్రత్యేక బస్సులు - అధికారులతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ సమీక్ష శ్రీశైలం: కృష్ణా పుష్కరాల తరహాలో విధులు నిర్వహించి శ్రీశైలంలో ఈ నెల 17నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం.. దేవస్థానం పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఈఓ నారాయణ భరత్ గుప్త, ఎస్పీ రవికృష్ణ, ఓఎస్డి రవిప్రకాశ్, డీఎఫ్ఓ శర్వణన్, ఆర్డీఓ హుసేన్సాహెబ్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత ఏడాది కృష్ణా పుష్కరాల్లో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేసి.. జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అదే స్థాయిలో నిర్వహించారనే పేరు తీసుకురావాలని కోరారు. ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు ఏర్పాటు చేసిన 25 స్పీడు బ్రేకర్లకు జీబ్రాలైన్స్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. పాదయాత్రతో వచ్చే భక్తులకు ప్రథమ చికిత్స కేంద్రాలను చేయాలని సూచించారు. అటవీ మార్గంలో నాలుగు అన్నదాత శిబిరాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇందుకు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సహకరిస్తారన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాత్కాలిక వసతి కోసం 2 వేల మంది భక్తులు సేదతీరేలా రెండు డార్మెంటరీలను ఏర్పాటు చేశామని ఈఓ భరత్ గుప్త వివరించారు. ఈ నెల 17 నుంచి శివదీక్షా శిబిరాల వద్ద భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు ఎక్సైజ్ చెక్‌పోస్టులు.. శ్రీశైలానికి వచ్చే రోడ్డుమార్గంలో మూడు ఎక్సైజ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణా నుంచి సున్నిపెంటకు వచ్చే మార్గం, దోర్నాల నుంచి శ్రీశైలం, క్షేత్ర పరిధిలోకి వచ్చే ముందు ఇలా మూడు ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో మద్యం దుకాణాలు మూసి వేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. భారీ బందోబస్తు.. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత కోసం 2వేల మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని.. 200 మంది మఫ్టీ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా పుష్కరాల తరహాలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించి వారి వేలిముద్రల ద్వారా నేరచరిత్రను కనుగొని అదుపులోకి తీసుకుంటామని.. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. శివ స్వాములకు ప్రత్యేక క్యూలు.. శివ స్వాములందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి ఈ ఏడాది చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసినట్లు ఈఓ భరత్ గుప్త తెలిపారు. మంచినీటి సౌకర్యంతోపాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక ప్రసారాలను అందజేస్తామని పేర్కొన్నారు. దేవస్థానం కొత్తగా కొన్న రెండు బస్సులను భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఉచితంగా తిప్పుతామని ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నిర్వస్తున్నామని, ఇందుకు ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ స్పష్టం చేశారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
బుక్కపట్నం : కొత్తచెరువు మండలం చెన్నకేశవపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ధర్మకర్తలు ఉషారాణి, చెన్నారెడ్డి.. స్వామికి పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అంతకుముందు గణపతి, లక్ష్మీదేవి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం గంగపూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయం వేద పండితుల మంత్రోచ్చారణలతో మార్మోగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. ఆలయంలో ఉదయం 8 గంటలకు ధ్వజారోహణ, అంకురార్పణ, పూజ, సాయంత్రం 4 గంటలకు మహాభిషేకం నిర్వహించారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు, హోమాలు, సాయంత్రం 4 గంటలకు సుదర్శన హోమం, గరుడ వాహనసేవ, ఆదివారం ఉదయం 4 గంటలకు ద్వారక ప్రవేశం, 8 గంటలకు హోమాలు, పూర్ణాహుతి, నూతన కల్యాణ వేదిక ప్రారంభోత్సవం, కల్యాణ మహోత్సవం, సాయంత్ర 4 గంటలకు చక్రస్నానం, ధ్వజారోహణ, శ్రీవారి ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రేపు చెన్నకేశవపురం రానున్న డాక్టర్ శోభారాజు బుక్కపట్నం : అన్మమయ్య కీర్తనలను తన గాత్రంతో భక్తులను మైమరపింపజేసే ప్రఖ్యాత గాయని అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు ఆదివారం చెన్నకేశవపురం విచ్చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు శ్రీమతి ఉషారాణి, చెన్నారెడ్డి దంపతులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో ఆమె కీర్తనలు ఆలపిస్తారన్నారు. -
ఘనంగా కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు
నార్పల : గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం కుళ్లాయిస్వామికి నిత్యపూజ నివేదన ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వేకువజామున ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప స్వామివారి చావిడిలో ఫాతెహాæ పూజలు జరిపారు. ఆలయ అనవాయితి ప్రకారం స్వామివారి కాపులైన తిరుమల కొండారెడ్డి వంశీకులు, ముజావర్లు ప్రత్యేక పూజలు చేశారు. తహశీల్దార్ విజయలక్ష్మి గూగూడును సందర్శించి ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి ఐదవ సరిగెత్తు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ అక్కిరెడ్డి తెలిపారు. -
శ్రీత్రిశక్తి దుర్గాపీఠం బ్రహ్మోత్సవాలు
సత్తెనపల్లి: పట్టణంలోని ఫిరోజీ మందిరం వెనుక గల శ్రీత్రిశక్తి దుర్గాపీఠంలో దశమ వార్షిక బ్రహ్మో త్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. శ్రీ త్రిశక్తి స్వరూపిణీలైన మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి లక్ష నాగవల్లి పత్రాలతో విఘ్నేశ్వరపూజ, ప్రసన్నాంజనేయస్వామి పూజలు నిర్వహించారు. త్రిపురమల్లు రవిచంద్రకుమార్, సునీత దంపతులు ఇంటి నుంచి అమ్మవార్లకు ప్రభ ఊరేగింపు నిర్వహించారు. శ్రీనివాసకుమారి ఆధ్వర్యంలో ముఖ్యశిష్యులు ∙గురుపూజ చేపట్టారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని పట్టెం వెంకటేశ్వర్లు, లలితకుమారి దంపతులు ప్రారంభించారు. వివిధ దేవతా మూర్తుల రూపాలతో కళాకారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆహుతులను అలరింప చేశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఆలయ పీఠాధిపతులు వెలిదండ్ల హనుమంత రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై తనిఖీలు
తిరుమల: తిరుమలలో సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో.. ఆదివారం టీటీడీ ఈవో సాంబశివరావు తనిఖీలు నిర్వహించారు. సీవీఎస్వో నాగేంద్రకుమార్, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డితో కలిసి శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేశారు. రద్దీ పెరిగిన సందర్భాల్లో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం క్యూలు కదిలే తీరును, లోటుపాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయం వెలుపల అఖిలాండం నుంచి మహారథం వరకు బ్రహ్మోత్సవ వాహన సమయాల్లో భక్తులు వేచి ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. అనంతరం ఎస్వీ మ్యూజియాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. -
నేటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్ (రంగారెడ్డి): చిలుకూరులోని బాలాజీ బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సాయంత్రం పుట్టమన్ను తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆలయ అర్చకులు పూర్తి చేశారు. శేష, హనుమంత, సూర్యప్రభ, గరుడ, గజ, పల్లకీ, అశ్వ వాహనాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానంలేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని.. ప్రసాదం స్వీకరించే మహిళలు ఉదయం 8 గంటలకే చిలుకూరు ఆలయానికి చేరుకోవాలని అర్చకుడు రంగరాజన్ తెలిపారు.