టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
సాక్షి, తిరుమల: అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 13 నుండి 21 వరకు వార్షిక, అక్టోబర్ 10 నుండి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెండు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
రెండు బ్రహ్మోత్సవాలెందుకు?
వేంకటాచల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుడిని పిలిచి జగత్కల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల అవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధిపొందాయి. దసరా నవరాత్రులు, కన్యామాసం (ఆశ్వయుజం)లో వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణా నక్షత్రం శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించటం అనాదిగా వస్తున్న ఆచారం. ∙సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసంవల్ల ప్రతీ మూడేళ్లకోసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయం.
Comments
Please login to add a commentAdd a comment