
దేదీప్యమానంగా యాదాద్రి ఆలయం
యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానంలో శనివారం నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ.40 లక్షల బడ్జెట్‌తో వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. బాలాలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో ముస్తాబు చేస్తున్నారు. రామాయణం మహాభారతం, భాగవతం, చతుర్వేద పారాయణాలు పఠించడానికి సుమారు 50 మంది రుత్విక్కులను ఆహ్వానించారు. హనుమంత, గజ, గరుడ, కల్పవృక్షం వంటి వివిధ వాహనాలను సేవలకు సిద్ధం చేశారు. ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా రోజూ 1,000 మందికి, ముఖ్యమైన మూడు రోజుల్లో 1,500 మందికి అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండపై ప్రత్యేక క్యూౖ లెన్లు, వికలాంగులకు, వీఐపీలకు, సామాన్య భక్తులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పా టు చేశారు. ఉదయం 10 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
బ్రహ్మోత్సవాల షెడ్యూల్..
- శనివారం ఉదయం 10 గంటలకు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధన, సాయంకాలం 6:30 మృత్సంగ్రహణం, అంకురార్పణం
- 18 ఉదయం : 11 గంటలకు ధ్వజారోహణం, సాయంకాలం 6:00 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం
- 19 ఉదయం 11 గంటలకు మత్య్సావతార అలంకార సేవ, వేద పారాయణాలు ప్రారంభం, రాత్రి 9:00 శేష వాహన సేవ
- 20 ఉదయం 11 గంటలకు శ్రీ కృష్ణాలంకారం, రాత్రి 9 గంటలకు హంస వాహనసేవ
- 21 ఉదయం 11 గంటలకు వటపత్ర శాయి అలంకారసేవ, రాత్రి 9:00 గంటలకు పొన్న వాహనసేవ
- 22 ఉదయం 11గంటలకు గోవర్ధన గిరిధారి అలంకారసేవ, రాత్రి 9:00 సింహ వాహనసేవ
- 23 ఉదయం 11గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9:00 గంటలకు అశ్వవాహన సేవ, బాలాలయంలో స్వామి, అమ్మవారి ఎదుర్కోలు మహోత్సవం
- 24 ఉదయం 10 గంటలకు శ్రీ రామాలంకారం సేవ, హనుమంత సేవ, 11గంటలకు గజ వాహన సేవ బాలాలయంలో తిరుకల్యాణం, రాత్రి 8 గంటలకు భక్తుల సౌకర్యార్థం కొండకింద హైస్కూల్ మైదానంలో స్వామి, అమ్మవారి వారి కల్యాణం
- 25 ఉదయం మహావిష్ణు అలంకారం సేవ, గరుడవాహన సేవ, బాలాలయంలో రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు విమాన రథోత్సవం, కొండ కింద 8 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి దివ్యవిమాన రథోత్సవం ప్రచార రథం ఊరేగింపు ఉంటుంది.
- 26 ఉదయం 10:30 గంటలకు మహా పూర్ణాహుతి, శ్రీ చక్ర తీర్థస్నానం, సాయంత్రం 6:00 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం
- 27 ఉదయం 10:00 గంటలకు శ్రీ స్వామివారి అష్టోత్తర శత ఘటాభిషేకంతో ఉత్సవాల సమాప్తి.
Comments
Please login to add a commentAdd a comment