‘పుష్కర’ స్ఫూర్తితో బ్రహ్మోత్సవ దీప్తి
‘పుష్కర’ స్ఫూర్తితో బ్రహ్మోత్సవ దీప్తి
Published Fri, Feb 10 2017 9:24 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- కృష్ణా పుష్కరాల తరహాలో
శివరాత్రి ఉత్సవాలు
- పాదయాత్రికులకు
ప్రథమ చికిత్స కేంద్రాలు
- అటవీ మార్గంలో
అన్నదాన శిబిరాలు
- శ్రీశైలానికి తిరగనున్న
150 ప్రత్యేక బస్సులు
- అధికారులతో జిల్లా కలెక్టర్
విజయమోహన్ సమీక్ష
శ్రీశైలం: కృష్ణా పుష్కరాల తరహాలో విధులు నిర్వహించి శ్రీశైలంలో ఈ నెల 17నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ పిలుపునిచ్చారు. శుక్రవారం.. దేవస్థానం పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈఓ నారాయణ భరత్ గుప్త, ఎస్పీ రవికృష్ణ, ఓఎస్‌డి రవిప్రకాశ్, డీఎఫ్‌ఓ శర్వణన్, ఆర్డీఓ హుసేన్‌సాహెబ్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
గత ఏడాది కృష్ణా పుష్కరాల్లో అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేసి.. జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపామన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అదే స్థాయిలో నిర్వహించారనే పేరు తీసుకురావాలని కోరారు. ఆత్మకూరు నుంచి దోర్నాల వరకు ఏర్పాటు చేసిన 25 స్పీడు బ్రేకర్లకు జీబ్రాలైన్స్, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆదేశించారు. పాదయాత్రతో వచ్చే భక్తులకు ప్రథమ చికిత్స కేంద్రాలను చేయాలని సూచించారు. అటవీ మార్గంలో నాలుగు అన్నదాత శిబిరాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామన్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఇందుకు డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సహకరిస్తారన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తాత్కాలిక వసతి కోసం 2 వేల మంది భక్తులు సేదతీరేలా రెండు డార్మెంటరీలను ఏర్పాటు చేశామని ఈఓ భరత్ గుప్త వివరించారు. ఈ నెల 17 నుంచి శివదీక్షా శిబిరాల వద్ద భక్తులకు అన్నదాన సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మూడు ఎక్సైజ్ చెక్‌పోస్టులు..
శ్రీశైలానికి వచ్చే రోడ్డుమార్గంలో మూడు ఎక్సైజ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణా నుంచి సున్నిపెంటకు వచ్చే మార్గం, దోర్నాల నుంచి శ్రీశైలం, క్షేత్ర పరిధిలోకి వచ్చే ముందు ఇలా మూడు ఎక్సైజ్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో మద్యం దుకాణాలు మూసి వేసేవిధంగా ఆదేశాలు జారీ చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
భారీ బందోబస్తు..
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత కోసం 2వేల మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ తెలిపారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామని.. 200 మంది మఫ్టీ పోలీసులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా పుష్కరాల తరహాలో పకడ్బందీగా బందోబస్తు నిర్వహిస్తామన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించి వారి వేలిముద్రల ద్వారా నేరచరిత్రను కనుగొని అదుపులోకి తీసుకుంటామని.. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
శివ స్వాములకు ప్రత్యేక క్యూలు..
శివ స్వాములందరికీ మల్లన్న దర్శనభాగ్యం కల్పించడానికి ఈ ఏడాది చంద్రావతి కల్యాణమండపంలో ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసినట్లు ఈఓ భరత్ గుప్త తెలిపారు. మంచినీటి సౌకర్యంతోపాటు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక ప్రసారాలను అందజేస్తామని పేర్కొన్నారు. దేవస్థానం కొత్తగా కొన్న రెండు బస్సులను భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఉచితంగా తిప్పుతామని ప్రకటించారు. మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నిర్వస్తున్నామని, ఇందుకు ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ఈఓ స్పష్టం చేశారు.
Advertisement
Advertisement