యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్ స్వామి, సుబ్బారావు నిర్వహించారు.
అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు.
నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment