somasekhar
-
కమనీయం.. గణనాథుని కల్యాణం
యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదారుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్ స్వామి, సుబ్బారావు నిర్వహించారు. అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు. నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు. -
యువతిపై టీడీపీ నాయకుడు లైంగికదాడి
రాయదుర్గం: కుమార్తె వయసు కలిగిన ఓ యువతిపై టీడీపీ నాయకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి అతనికి బాధిత యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హులికల్లులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... హులికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు ప్రధాన అనుచరుడైన బోయ సోమశేఖర్ (45) వరుసకు కోడలైన 20 ఏళ్ల యువతిపై ఎప్పటినుంచో కన్నేశాడు. అమ్మాయిని ఎలాగైనా లోబర్చుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఏదో ఒక కారణంతో తరచూ ఆమె ఇంటి వద్దకు వెళ్లి గంటల తరబడి కాలక్షేపం చేసేవాడు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన సోమశేఖర్ ఆమె ఇంట్లోకి చొరబడి అస్యభకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటిస్తున్నప్పటికీ బలవంతంగా లైంగికదాడి చేశాడు. అనంతరం చెప్పులు అక్కడే వదిలి పారిపోయాడు. యువతి ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత యువతి తండ్రి ఇంటికి రావడంతో జరిగిన దారుణం గురించి తెలియజేసి కన్నీటిపర్యంతమైంది. అదే సమయంలో చెప్పుల కోసం తిరిగి యువతి ఇంటి వద్దకు వచ్చిన సోమశేఖర్‌ను గుర్తించిన బాధితురాలి తండ్రి, బంధువులు చితకబాదారు. అనంతరం తన తల్లిదండ్రులతో కలిసి బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన రూరల్ సీఐ యుగంధర్ మంగళవారం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద (రేప్) కేసు నమోదుచేసి అరెస్ట్ చేశారు. నిందితుడు సోమశేఖర్‌ను కళ్యాణదుర్గం జూనియర్ సివిల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించారు. -
ఐఏఎస్‌ల మధ్య రగడ: మంత్రి ‘రాజీ’ చర్చలు
మైసూరు: జిల్లాధికారి రోహిణి సింధూరిపై ఆరోపణలు చేసి తన ఉద్యోగానికి రాజీనామ చేసిన మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ శుక్రవారం సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్‌తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని, ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్‌కు మంత్రి సూచించారు. కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్‌కు మనవి చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్టీ సోమశేఖర్ తెలిపారు. నీతి, నిజాయతీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. పాలికె కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దని కోరుతూ శుక్రవారం పాలికె కార్యాలయం వద్ద సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోహిణి సింధూరిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా) ఆలోచించే రాజీనామా చేశా: శిల్పానాగ్ తాను బాగా ఆలోచించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూరు మహానగర పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తోందని చెప్పారు. సీఎస్ఆర్ ఫండ్స్‌కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకుని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. నిధుల వివరాలు అడగడం తప్పా? : కలెక్టర్ సీఎస్ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన రూ.12 కోట్ల గురించి వివరాలు అడగడం తప్పా అంటూ జిల్లాధికారిణి రోహిణి సింధూరి ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ వారం గ్రామాలకు వైద్యులు అనే కార్యక్రమానికి సీఎస్ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సీఎస్ఆర్ ఫండ్స్‌ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరగా మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ ఇప్పటివరకు బదులు ఇవ్వలేదన్నారు. తనపై అసంతృప్తి ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఒక పద్ధతి, వ్యవస్థ ఉంటుందని, దాన్ని అనుసరించి వ్యవహరించాలని సూచించారు. ఈ విషయాలన్నింటి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తానని ఆమె తెలిపారు. మైసూర్లో శిల్పా నాగ్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్న ఉద్యోగులు -
నీళ్లింకని నేల
‘క్యాంప్ వెళ్ళే ముందు హాస్పటల్‌కు ఒకసారి వెళ్లి మీ నాన్నను పలుకరించి వెళ్ళండి. చాలా ఫీల్ అవుతా ఉన్నారు’’ అన్నది కవిత. ‘‘టైం ఎక్కడుంది. నేను చేస్తున్నది ప్రయివేటు కంపెనీలో. చూస్తూనే ఉన్నావుగా తీరికెక్కడ ఉంది? అన్నీ తెలిసీ నీవు అలా వేధించడం ఏమిటి?’’ విసుగుతో అన్నాడు సోమశేఖర్.‘‘అది కాదండి. నాన్నగారికి అవన్నీ తెలీవుగా. పని ఎప్పటికీ ఉన్నదే! కాస్తంత వీలు చూసుకుని వెళ్లి అలాగే వెళ్ళిపోండి. పది నిమిషాలు గడిపితే ఆయన సంతోషపడతారు’’ అర్థిస్తూ అన్నది కవిత. ‘‘నాకైనా వెళ్లాలని ఉండదా? నా పని ఒత్తిడి ఎవరూ అర్థం చేసుకోరు. ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. నియోజకవర్గాల వారిగా వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ అంట. ’’ అని నిష్టూర పోతూ అన్నాడు సోమశేఖర్.‘‘మీకు టైం లేకపోతే నేను ఎలాగూ వెళతాను కదా! మావయ్యతో చెబుతాలే అంది’’ కవిత. సోమశేఖర్ కొంత కోపం తగ్గించాడు.‘‘సర్లే చూస్తా! మేము ఎలాగూ కర్నూల్‌కు పోతావుండాము. కర్నూలుకు పోయే దార్లోనేగా హాస్పటల్. ఓ పది నిమిషాలు చూసి వెళతాలే.’’ అన్నాడు సోమశేఖర్ రాజీ ధోరణిలో.‘‘వెళితే బావుంటుందని, అంతకు మించి ఏమీ లేదు. పది గంటలకు క్యారేజీతో ఎలాగూ నేను వెళతానుగా’’ సర్ది చెబుతూ అంది కవిత. సోమశేఖర్ తన కొలీగ్ శివకు ఫోన్ చేశాడు. ‘‘శివా! నీవు ఆటో పట్టుకుని మెహదీపట్నం వచ్చేయ్! మానాన్న ఉన్న ఆస్పత్రి నీకు తెలుసు కదా, అక్కడకు వచ్చేయ్! నాన్న మాట్లాడాలని కలవరిస్తున్నాడంట. ఓ పది నిమిషాలు ఆయనతో మాట్లాడాలి. నీవు ఆటోలో రాగలిగితే నిన్ను పికప్ చేసుకునే సమయం మిగిలి అక్కడ గడపొచ్చు. ప్లీజ్’’ అని అభ్యర్థించాడు సోమశేఖర్. ‘‘అలాగే సర్! తప్పకుండా’’ అవతల వైపు నుండి శివ.సోమశేఖర్ హైదరాబాదులో ఒక ప్రయివేటు టివి ఛానల్లో పని చేస్తున్నాడు. నాన్న ఆంజనేయులు గవర్నమెంట్ టీచర్. అమ్మ గృహిణి. సోమశేఖర్‌కు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. నాన్నకు ఇటీవల హార్ట్ ప్రాబ్లెమ్ వలన ఆస్పత్రిలో చేర్చారు. నాన్నకు ఇ.హెచ్.ఎస్ ఉంది. పెన్షన్ వస్తోంది. ఆర్థికంగా నాన్న, అమ్మలు సోమ శేఖర్‌కు భారం కాదు కాని సమయమే వారి గురించి కేటాయించ లేకపొతున్నాడు. సోమశేఖర్ ఆస్పత్రిని చేరుకొని నాన్న రూమ్‌కు వెళ్ళాడు. అమ్మ నాన్నకు బ్రష్ చేయించినట్లుంది. నాన్న టవల్‌తో ముఖం తుడుచుకుంటున్నాడు . ‘‘ఎలా వుంది నాన్నా’’ అంటూ రూములోకి ప్రవేశించాడు సోమశేఖర్.‘‘బావుందిరా! మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారురా ’’ కొడుకు వచ్చాడన్న ఉత్సాహంతో అన్నాడు ఆంజినేయులు.‘‘అమ్మా! కవిత పది గంటల లోపు వస్తుందంట’’ అని అమ్మ సావిత్రమ్మతో సోమశేఖర్ అన్నారు. ‘‘అవున్రా ఫోన్ చేసి చెప్పింది. సోమశేఖర్ ఆస్పత్రికే బయలు దేరాడని చెప్పింది. మీ నాయన నీకోసమే ఎదురు చూస్తా ఉండాడు’’ అంది సావిత్రమ్మ.‘‘కాదుమా! ఈయప్ప నన్ని ఇంత టెన్షన్ పెడితే ఎట్టా! నాకేమి రాకూడదని ఉంటదా. నా తిప్పలు మీకేమి తెలుసు. ఇరవై రోజులైంది. ఒక్క రోజు రెస్ట్ లేకుండా దోకిస్తా ఉన్నారు. మా! నాను చేస్తా ఉండేది ప్రవేటు ఉద్యోగం. నాయనకు తెలియంది ఏముంది? సూడల్ల, సూడల్ల అని సతాయిస్తే ఎట్టా! ఈడొచ్చి నాతాన ఉండమంటే రారు. పల్లె ఇడిసి రామంటారు. పన్నెండు ఏండ్లు పనిచేసి దాన్నే ఈయప్ప సొంతూరుఅనుకుంటాండు. ఆడ మన తాతలు సంపాదించిన భూములేమన్న ఉన్నాయా?. నా తిప్పలు నాకైతే ఈయప్ప దొకటి’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు సోమశేఖర్. ‘‘సర్లేరా ! పోయిరాపో! ఏంటోరా నిన్ను సూడాలనిపిస్తాది. రావాలంటాను. అంతే’’ అన్నాడు ఆంజనేయులు నోచ్చుకొంటూ. ‘‘మా! ఇడ్లీ తీసుకొచ్చా. తినిపించు’’ అన్నాడు సోమశేఖర్. సావిత్రమ్మ ఆంజనేయులు ముందు ఇడ్లీ పెట్టింది. ఆంజనేయులు ఇడ్లీ తింటూ సోమశేఖర్ తో మాట్లాడసాగాడు. ‘‘క్యాంపు ఎక్కడికి పోతావున్నారా?’’ అని సోమశేఖర్‌ను ప్రశ్నించాడు ఆంజినేయులు. ‘‘ఏమ్మిగనూరుకు నాన్నా!’’ అని సోమశేఖర్ అనగానే ఒక్కసారిగా ఆంజనేయులు మొఖం వెలిగిపోయింది. తను ఉంటున్న ప్రాంతమే. ‘‘నాను ఈడకు వచ్చి వారం రోజులైంది. ధనుంజయ సారు నీకు తెలుసుకదా ? మొన్న రాత్రి బాత్రూములో కాలు జారి పడినాడంట. వాడి కొడకు ఫోన్ చేసి ఉండే. వీలైతే ఎమ్మిగనూరులో ధనుంజయ సార్ ను కలిసి రారా.’’ అంటుండగా ఒక్కసారిగా దగ్గు వచ్చింది. ఆ దగ్గుతొ నోట్లో నములుతున్న ముద్దగా వున్న ఇడ్లి తుంపరలుగా వచ్చి సోమశేఖర్ మీద పడింది. షర్టు పై పడిన ఇడ్లిను దులుపుకొంటూ ఒక్కసారిగా ఇంతెత్తు లేచాడు సోమశేఖర్. ‘‘తినేటప్పుడు మాట్లాడొద్దు అంటే ఇనిపించుకోవు. మా! ఇంతగూడా ఈయప్పకు బుద్దిరాల్యా! నేనే బుద్ది తక్కువై వచ్చా. మా! ఎట్లా ఎగుతావో ఏమో నాకు తెల్దు. నే పోతున్నా! నాల్గు దినాలు రాను సూడు! ఊరికే ఫోన్ చేసి సతాయించొద్దండి ‘‘ అంటూ విసవిస వెళ్ళిపోయాడు సోమశేఖర్.నాన్న కళ్ళ నుండి కన్నీరు చెంపలపైకి చేరింది. అమ్మ కొంగుతో కళ్ళు అద్దుకుంది. సోమశేఖర్ ఆస్పత్రి నుండి బయటకి రాగానే శివ స్కార్పియో దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ‘‘శివ ఎంత సేపయింది వచ్చి?’’ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా ‘‘ పోదాం పదా’’ అన్నాడు సోమశేఖర్. ‘‘సరే సర్’’ అంటూ కదిలాడు శివ.డ్రైవర్ కాశన్న ‘‘సార్ ఎక్కడైనా టీ తాగుదాం?’’ అన్నాడు. సోమశేఖర్ ‘‘నేను కూడా టిఫిన్ చేయాలి. ఏదైనా హోటల్ ఉంటే ఆపు’’ అన్నాడు.‘‘అవునవును నేను కూడా దమ్ము కొట్టాలి’’ అన్నాడు శివ.స్కార్పియో ఒక డాబా ముందు ఆగింది. నలుగురూ దిగారు. సోమశేఖర్ టిఫిన్‌కు ఆర్డరిచ్చాడు . శివ, కాశన్నలు టీ కి ఆర్డరిచ్చి టేబుల్ ముందు కూర్చున్నారు. డ్రైవర్ కాశన్న పక్కటేబుల్ దగ్గర కూర్చుని టీ కోసం ఎదురు చూస్తున్నాడు. సోమశేఖర్ శివతో మాట కలుపుతూ...‘‘నా చదువంతా ఎమ్మిగనూరు చుట్టు పక్కల, ఎమ్మిగనూరులో సాగింది శివా! తర్వాత పీజిడియంసి యానిమేషన్ కోర్సులకై బెంగళూరు పోతిని. అది అయిపోయినాక ఈ ఛానల్లో చేరి ఇట్లా తిప్పలు పడుకుంటా ఉండా. రేపటి మన ప్రోగ్రామ్ ఎమ్మిగనూర్‌లో వుండేది. మనం కర్నూలు వెళ్లి అక్కడి నుంచి ఎమ్మిగనూరు వెళ్ళాలి. కర్నూలుకు డెబ్బై కి.మీ. దూరంలో ఉంటాది ఎమ్మిగనూరు. మా నాయన ఎమ్మిగనూరు దగ్గర్లోనే నాగలదిన్నె అనే ఊర్లో పన్నెండు ఏండ్లు టీచరుగా పని చేసి రిటైర్ అయినాడు. రిటైరైనాక కూడా ఆడనే ఉండాడు. హైదరాబాద్ రాకముందు నేను కూడా ఆడనే ఉండినాను. పదైదు దినాల కింద గుండెలో నొప్పి వస్తే హైదరాబాద్‌కు పిలిపించి ఆస్పత్రిలో చూపిస్తి. ఏం సమస్య లేదు. టాబ్లెట్స్ వాడాలన్నారు డాక్టర్లు. రోజూ తనతో ఆస్పత్రికి పోయి మాట్లాడాలంటాడు. మనకి అయితాదా? నీవే సూస్తుండావు కదా!!’’ అన్నాడు. ‘‘అవును సర్ ! మీ నాయన మిమ్ములను సూడాలని సతాయిస్తుండాడు. మా నాయన నన్ని సూడకుండా సతాయిస్తుండాడు. ఎప్పుడైనా నేనే ఫోన్ చేయాలి.నెల దినాలైనా చేయడు. ఫోన్‌చేస్తే ఎత్తడు. ఏమి నాయనోల్లో ఏమో! ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ’’ అంటూ శివ కాశన్న వైపు తిరిగి ‘‘ఏం కాశన్నా! అంతే గదా’’ అన్నాడు. ‘‘ఏమో సార్.. నాకైతే మా నాయన సిన్నప్పుడే సచ్చిపోయినాడంటా. మా యమ్మది సోమశేఖర్ సార్ వాళ్ళ నాయన కతే! మాది కూడా కర్నూలు దగ్గర నిడ్జూరు. ఇంటికాడ వొక్కతే ఉంటాదని ఫోన్ కొనిచ్చినాను. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తా ఉంటాది. మనకేమో ఈ ఫోన్ తీయడం కాదు.. ఈ ముసలోల్లతో వచ్చింది సావు’’ అన్నాడు కాశన్న.దాబాలో సప్లయర్ చినిగి పోయిన బనియన్ వేస్కొని బక్క పల్చగా ఉన్నాడు. కళ్ళు లోపలి పోయివున్నాయి. బహుశా రాత్రంతా మేల్కొని ఉన్నట్లున్నాడు. మొఖం పీక్క పోయిఉంది.వీళ్ళ సంభాషణ వింటున్న సప్లయర్ ‘‘సార్ మీరు కర్నూలుకు పోతున్నారా?’’ అని అడిగాడు. సోమశేఖర్ ‘‘అవును’’ అన్నాడు. ‘‘సార్ ఆ రోడ్డు మీద ఆయన్ను చూడండి !’’ అంటూ రోడ్డు వైపు చూపించాడు.పైకి కట్టుకున్న మాసిన లుంగీ, వారాలుగా ఉతకకున్న షర్టు, చిందరవందరగా ఉన్న జుట్టు, మాసిపోయిన గడ్డం, ఒక చేతిలో సంచి పట్టుకుని ఉండాడు. ఇంకొక చేతితో భుజంపైన కుండను పట్టుకుని ఉండాడు. కుండకు పాత గుడ్డ కట్టి దాని చుట్టూ సన్నని తాడు కట్టి వుంది. చేతిలోని సంచిలో వంట గిన్నెలు ఉన్నట్లున్నాయి.కదిలినపుడంతా లోపలి గిన్నెలు శబ్దాలు చేస్తున్నాయి.సోమశేఖర్ ఆసక్తిగా ‘‘ ఎవరు అతను? పోతున్న బండ్లన్నిటిని ఆపమని అడుగుతున్నట్లున్నాడు’’ అని అడిగాడు. ‘‘సార్. ఎక్కడినుండి నడుచుకుంటూ వచ్చాడో తెలియదు. పొద్దుటి నుండి కర్నూలు వైపు పోయే వెహికల్స్‌ను ఆపి కర్నూలుకు వస్తా .. అని అడుగుతావుండాడు. ఏ వెహికల్ ఆగడం లేదు. ఒకటి రెండు జీపులు ఆగినాయి. ఇతను నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. వాళ్ళు ఎగాదిగా చూసి వెళ్ళిపోతున్నారు. పాపం అనిపిస్తా వుంది సార్. నేనే బన్ను టీ తీసుకు పోయి తినమంటే వద్దు అన్నాడు. మీకు పుణ్యం వుంటాది. మీ బండి వెనక సీటు ఖాళీగున్నట్లు ఉంది. కొంచెం ఎక్కించుకుని పొండి సార్. నాకే బాధ అయితా ఉంది’’ అని అర్థించాడు.కర్నూలు అనే పేరు వినగానే సోమశేఖర్ అయితే ‘‘పిలు అతడిని’’ అన్నాడు. సప్లయర్ పరిగెత్తుకుంటూ ఆ మనిషి దగ్గరికి వెళ్లి గట్టిగా ‘‘సారోల్లు కర్నూలుకు పోతుండారంట. బండి ఎక్కమన్నారు. పో .. బండి ఎక్కు’’ అని చెప్పాడు.‘‘నా దగ్గర దుడ్లు లేవు అని సెప్పినావా?’’ అని అనుమానంగా అడిగాడు అతను.‘‘చెప్పినా లే! రా.. ముందు నీవు ఎక్కి కూర్సో’’ అంటూ సప్లయర్ బండి వెనకాల డోర్ తీశాడు. అతను కుండను జాగ్రత్తగా పట్టుకుని సీటు మీద పెట్టి లోపలి ఎక్కాడు. సప్లయర్ సంచిని తీసి అందించాడు. గళ గళ శబ్దం చేస్తున్న సంచిలోంచి సత్తు గ్లాసులు రెండు కింద పడినాయి. సప్లయర్ వాటిని తీసి సంచిలోకి వేసి సంచిని అతనికి అందించగా అతను సంచిని లోపలి తీసుకున్నాడు. అతను సీటు పైన కూర్చుని పైన గుడ్డను కట్టిన కుండను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. సోమశేఖర్, శివలు వచ్చి బండి ఎక్కారు. డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. టైం పదిన్నర. శివ ముందు సీట్లో, సోమశేఖర్ మద్య సీట్లో కూర్చున్నారు.శివ వెనకాల కూర్చున్న వ్యక్తిని చూస్తూ, ‘‘టీ తాగాల్సింది’’ అని పలకరింపుగా అన్నాడు . ‘‘ వొద్దు సారూ’’ అన్నాడతను. ‘‘ఏముంది ఆ కుండలో అంత భద్రంగా ఒళ్లో పెట్టుకుని కూసుండావు. కోడిపెట్ట తన పిల్లల్ని రెక్కలకింద జాగ్రత్తగా అదిమి పెట్టుకొన్నట్లు’’ అని అతణ్ణి ప్రశ్నించాడు. అతను ఏమి పలకలేదు. చూపులు ఎదుటి కిటికీ నుండి బయటకు చూస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం లోనే లేడన్నట్లుగాఉన్నాడు.‘‘ఏం సామీ ఏం పలకకున్నావు. కొంపదీసి ఆ కుండలో నిధి ఏమీ లేదు గదా! మేమేం అడగంలే. ఏముండాది ఆ కుండలో.. ఏమి సేప్పకున్నావు’’ అన్నాడు శివ.తనను గాదేమో అన్నట్లు అవే చూపులు. సోమశేఖర్ ‘‘వదిలేయ్ శివా! అతన్తో మనకెందుకు’’ అన్నాడు.బండి ఫోర్ లైనర్‌లో పోతా ఉంది. ఆలంపూరు చౌరస్తా వచ్చింది. టైం ఒకటిన్నర.శివ ‘‘సార్ భోం చేద్దామా?’’ అని అదిగాడు.సోమశేఖర్ ‘‘సరే పద! కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు పోయే దారిలో హోటళ్ళు కూడా ఏమీ లేవు. ఇక్కడే తినిపోదాం’’ అన్నాడు.డ్రైవర్ దాబాను చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు.వెనకాలతను ‘‘సార్! ఎమ్మిగనూరుకు పోతారా?’’ అని అడిగాడు.సోమశేఖర్ ‘‘అవును. నీవు కర్నూలు వరకే కదా!’’ అని అడిగాడు.‘‘సార్ నాదీ ఎమ్మిగనూరు దగ్గరే! గువ్వలదొడ్డి. కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు పోయే రోడ్డులో ఎర్రకోట వస్తాది. ఆటికి మావూరు ఒక మైలు వుంటాది. నాను ఆడ దిగుతా సార్!. మీకు పుణ్యం ఉంటాది. ఆడ ఆపండి సారూ!’’ అని వేడుకున్నాడు.సోమశేఖర్ ‘‘నీది గువ్వలదొడ్డినా ? అవున్లే .. ఎర్రకోట నుండి పోతారు గదా? .. సర్లే దింపుతాంలే ‘‘ అని అన్నాడు. డ్రైవర్ ఆలంపూరు ఫ్లై ఓవర్ దాటిన తరువాత ఒక డాబా వద్ద బండి ఆపాడు.అందరూ దిగారు. సోమశేఖర్ బండి వెనకాల కూర్చున్న వ్యక్తీ వైపు తిరిగి ‘‘నీ పేరేమన్నావ్!’’ అని ప్రశ్నించాడు. అతను శక్తినంతా కూడగట్టుకుని తడి ఆరిపొయిన పెదవులను నాలుకతో తడిచేసుకొంటూ ‘‘గిడ్డయ్య సారూ’’ అని చెప్పాడు.\‘‘దిగు గిడ్డయ్యా ! .. అన్నం తిందువు కాని’’ అన్నాడు.గిడ్డయ్య ‘‘వద్దులే సారూ..’’ అని అన్నాడు.‘‘డబ్బులు మేమిస్తాంలే ! నీవేం ఇవ్వొద్దు.. పోద్దట్నించి ఏమి తినలేదంట కదా! ఆ డాబాలో సప్లయర్ చెప్పాడు. తిందురా. ఆ కుండ సీటు మీద పెట్టు. నీ నిధిని ఎవ్వరూ ఎత్తుక పొర్లే .. రా..’’ అని అడిగాడు. ‘‘వొద్దులే సారూ.. నాకి ఆకలి లేదు. మీరు తిని రండి.. నాను ఈడనే కూసోని ఉంటాను’’ అన్నాడు.‘‘నీ ఖర్మ! మేం ఏమీ చేయలేము. మేం తినొస్తాం. అయితే ఈడనే వుండు’’ అంటూ సోమశేఖర్ బండి దిగాడు.ముగ్గురూ వెళ్లి అరగంటలో తిని వచ్చారు. బండి మరలా బయలు దేరింది.తన బాల్యం ఎమ్మిగనూరు ప్రాంతంలో సాగడం వలన గిడ్డయ్య మౌనం అనేక అనుమానాలు కలిగిస్తా ఉంది. ఏమి తినలే. ఏమీ తాగలే. ప్రతీదీ వద్దంటాడు. గిడ్డయ్యది ఎమ్మిగనూరు ప్రాంతమే. ఎందుకో సోమశేఖర్‌కు గిడ్డయ్యతో మాట్లాడాలని ఉంది. తనూ అదే ప్రాంతం వాడు కావడం వలన ప్రాంతీయ అభిమానంకావచ్చు.సోమశేఖర్ ‘‘గిడ్డయ్యా! గువ్వలదొడ్డి అన్నావ్ కదా! హైదరాబాద్ ఎందుకొచ్చావు?’’ అని ప్రశ్నించాడు. ‘‘సారూ... ! బతకనీక వొచ్చింటిమి’’ అంటూ నీరసంగా మాట్లాడడం ప్రారంభించాడు గిడ్డయ్య.‘‘మా నాయన పేరు ఉళ్ళక్కి, మాయమ్మ సోమక్క. మాకి మూడు ఎకరాలు వరిమడి ఉండ్య. మాకి బాయి ఉండ్య. మా వూరికి కాల్వ ఉండ్య. ఎండా కాలం కాల్వ నీళ్ళు పారుతా ఉండ్య. వానా కాలం వానకే వడ్లు పండిస్తాంటిమి. మానాయన మోటతో (కపిల) నీళ్ళు పారిస్తా ఉండ్య. మా నాయన నన్ని సదువిడిపిచ్చి సేని పనికి పిలుసుక పోబట్ట్యా! మూడు ఎకరాలు వరిమడి పెట్టుకొని మనకి సదువెంటికిలే? అంటాండ్య. నాను కూడా బడి ఇడిసి పెట్టి మానాయనతో కల్సి సేనికి పోతాంటి సార్. నాయన మెత్తగాయ. మాయమ్మ మెత్తగాయ. నాకి పెండ్లి సేసిరి. బాయి ఎండిపాయ. మోట మూలాన పడ్య. సేను బీడు అయిపాయ. మానాయన ఎప్పుడు సూసినా నా కొడుకుని సదవొద్దని వాని గొంతు గోసిడిస్తిని అని పలమతాండ్య. ఇంట్ల తిండికి జరగక పాయే. ఇంగ ఇట్ల కాదని నాను నా పెండ్లాం హైదరాబాద్ కి బతకనీక వస్తిమి. సెడి పట్నం సేరాలనేర్య పెద్దలు. అట్లా వచ్చిడిస్తిమి సారూ. రోవొన్ని దినాలు మట్టి పనికి పోతిమి. నా పెండ్లాముకి బరువులుమోసి మోకాళ్ళ నొప్పులు రాబట్య. మట్టి పని చేయాల్యాక పాయ. నాను మట్టి పనికి పోతుంటే తాను గుడిసె కాడనే వుంటుండ్యా. ఇంగ ఇట్లా కాదని పక్క గుడిసె ముసిలోళ్ళు డంప్ యార్డుకాడికి ఇనుప ముక్కలేరుకోనీక్య పోతుంటే తానూ కూడా పోబట్య. ఇనుప ముక్కలు ఏరుకొని గుజిరీకి అమ్ముతుండ్య . దినామూ నూరు, నూటాయావై రూపాయలోస్తాండ్య. ఒక దినుము నాకు ప్రాణం బాగా ల్యాక కొట్టంకాడ ఉంటి. పక్క కొట్టం ముసిలోల్లతో కలిసి దినుమూ మాదిరే ఇనుము ముక్కలేరుకోనేకి డంప్‌యార్డు కాటికి పాయే. పైటాలప్పుడు ముసిలోల్లు ఉరుక్కుంట మా గుడిసె కాటికొచ్చి గిడ్డయ్యా! నీ పెండ్లాం మీద అంటబెట్టిన చెత్త పడిడిసేద్య. ఆయమ్మ దాంట్లోనే మునిగి పోయ. బెరీన రా ! అన్రి. నాను ఉరుక్కుంటూ పోతి. పెద్ద దిబ్బ పైన కాలుతుంటే నా పెండ్లాము కింద ఉండేనట. అదికాలి కాసి కిందకి పొర్లి పడిపోయేద్య.నాను ఏడ్సుకుంట కసువు తీసేసేకి సూస్తిని. ఆడున్నోల్లు పట్టుకునిడిసిరి. నాను ఏడ్సుకుంట ఏమి సేతురా దేవుడా అనుకుంటా ఉంటి. అదేదో టీవి లోన సెప్పిరంట. ప్రోక్లయిను వచ్చి నుగ్గ తవ్వి సూసేగాని ఆయమ్మ మాత్రము దొరకల్యా! డ్రైవోరు నాదగ్గరున్న వేయి రూపాయలూ డిజిల్ కని తీసుకోనిడిస్య! అందురూ అగ్గిలో బూడిదై పోయింటాది అనబట్రి. నా పెండ్లాముని ఎట్లన్న తీసియండి. అయమ్మ పీనిగినన్న తీస్కోని వూరికి పోతా! మా నాయనకి మా యమ్మకి నాను మొగమెట్ల సూపియ్యాలంటి. వాళ్ళే అంత గుంపు కట్టుకుని కూసున్న కాడ బూడిదని తీసిరి. పీనిగి దొరకల్యా! ఎముకలు దొరికితే అవే ఆయమ్మవని ఈ కుండల పెట్టిచ్చిరి. ఈ కుండలో సచ్చిపోయిన నా పెండ్లాము ఎముకలుండాయి. మన్ను చేసేకి మా ఊరికి తీసకపోతున్నా. మా యత్తకి, మామకి నా నేమని సెప్పాల! మాము నామదార్లం. మన్ను అయ్యేంత వరకు ఏమీ ముట్టము సారూ. దానికే నాను టీ నీళ్ళు కూడా తాగ కుండా ఉండేది. పుణ్యాత్ములు మీరు నాకి దొరికితిరి. ఎట్లన్నా గాని ఎర్రకోట కాడ దింపండి సారూ’’ అంటూ కన్నీరు పెట్టుకొన్నాడు గిడ్డయ్య. సోమశేఖరుకు నోట మాట రాలేదు. కళ్ళలో అందరకూ నీళ్ళు తొణికిస లాడాయి. తన చిన్నతనంలో ఎమ్మిగనూరులో చుట్టూ ఎక్కడ చూసినా నీళ్ళుఉండేవి. ఆ నీళ్లన్నీ ఎక్కడికి పోయాయి...? తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ క్రింద వేసవి కాలములో గూడ నీళ్ళు వచ్చేవి. ఈ కాలువ క్రింద పండే పొలాలలో పని చేయడానికి ఎంతోమంది ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి వంటి ప్రాంతాలనుండి సుగ్గికి వచ్చేవారు. తను వదలిపెట్టిన పన్నెండు ఏళ్ళలోనే ఎంత మార్పు వచ్చింది కదా అని ఆలోచిస్తూ ఉండగా గిడ్డయ్యా, ‘‘సారూ ఆడ కనిపించేదే ఎర్రగోట. ఊరుముందే ఆపండి. నాను దిగుతాను’’ అని సంచి చేతిలోకి తీసుకుంటూ అన్నాడు గిడ్డయ్య.రోడ్డు పక్కన స్కార్పియో ఆపారు. డ్రైవర్ కాశన్న దిగి వెనకాల వచ్చి డోరు తీశాడు. సంచిని చేతిలోకి తీసుకొని సామాన్లు కింద పెట్టాడు. గిడ్డయ్య కుండని గుండెలకు హత్తుకుని జాగ్రత్తగా కిందకు దిగి ‘‘సారూ! శానా సాయం సేస్తిరి. సచ్చి మీ కడుపున పుడతాను తండ్రీ! మీరు మడసంగా పోయి రాండి ’’ అంటూ కుండను భుజం మీద పెట్టుకుని సత్తు గిన్నెల సంచిని చేత పట్టుకుని మట్టి రోడ్డు వైపు బయలు దేరాడు.కాశన్న బండి ఎక్కి ముందుకు పోనిచ్చాడు. అందరూ గంభీరంగా ఉన్నారు. సోమశేఖర్ కల్పించుకుని ‘‘కాశాన్నా! బండి తిప్పు! గిడ్డయ్యను వారూర్లో దింపోద్దాం. పోద్దన్నుంచి ఏమి తినలే. తాగలే.ఎడనన్న పడిపోతే కష్టం. మనకి గిడ్డయ్యకి ఎదో ఋణాణుబంధం ఉంది. పోయోద్దాం పా... మన ప్రోగ్రాం ఎట్లా రేపు 11 గం’’లకు. ఊర్లో ఇదిసివద్దాం పా..’’ అన్నాడు. ‘‘నాకూ అదే అనిపించింది సర్ !’’ అన్నాడు కాశన్న శివ కూడా వదిలి పెట్టి రావడమే మంచిది అన్నాడు. కాశన్న బండి తిప్పుకొని గువ్వల దొడ్డి మట్టి రోడ్డు ఎక్కించాడు. గిడ్డయ్య పక్కన బండి ఆపారు. కాశన్నదిగి గిడ్డయ్య చేతిలో సంచి తీసుకొని వెనకాల డోరు తెరచి ‘‘కూసుందురా గిడ్డయ్యా’’ అన్నాడు. ‘‘ఏంటికొస్తిరి సారూ. నానే పోతాంటి కదా’’ అన్నాడు గిడ్డయ్య ఇబ్బంది పెట్టడం ఎందుకనుకొంటూ. కాని కాశన్న గిడ్డయ్యకు ఆ అవకాశం ఇవ్వలేదు.‘‘ఎంత మంచోళ్ళు సారూ మీరు’’ అనుకుంటూ గిడ్డయ్య కుండను జాగ్రత్తగా పట్టుకుని బండి ఎక్కాడు. ‘‘సార్ మా సేను ఊరికి పోయే రాస్తాలోనే ఉంటాది. ఊర్ల మట్టి మిద్దె పడిపోయినాక మా నాయన, మాయమ్మ సేన్లోనే కొట్టం వేసుకుని ఉండారు. సేను బీడైనా మా నాయన నాసావు ఈ సేన్లోనే అనికాసి సేన్లోనే వుండాడు. ఉర్లోనికి పని లేదు సారూ. వూరి బయట్నే మా సేను. కొట్టం కాడ ఆపండి.’’ అని కోరాడు గిడ్డయ్య .మట్టి రోడ్డుపై దుమ్ము లేపుతా బండి పోతా ఉంది. రోడ్డు పై ఒక్కరూ కూడా కనిపించకున్నారు. కనుసూపు మేర బీడు పడిన పొలాలే కన్పిస్తాండాయి.‘‘సారూ ఈడ ఆపండి’’ అన్నాడు గిడ్డయ్య. కాశన్న వెనుకకు వచ్చి డోరు తీశాడు. గిడ్డయ్య కిందకు దిగాడు. కొట్టం ముందర రోడ్డుపైన జీపు ఆగే సరికి గిడ్డయ్య వాళ్ళ నాయన బయటకు వచ్చి గిడ్డయ్యను చూశాడు.‘‘ఓరే గిడ్డీగా ! ఏంరా జీపుల వస్తివి’’ అన్నాడు ఆందోళనగా. ‘‘నాయనా ఇంకేముంది.. నాయనా.. నీ క్వాళ్ళి (కోడలు) సచ్చిపోతే ఈ కుండల తెస్తిని నాయనా !’’ అని ఏడ్సుకుంటూ గిడ్డయ్య వాళ్ళ నాన్నకి ఎదురుపోయాడు. గిడ్డయ్య మాటలు విన్న సోమక్క గుండెలు బాదుకుంటూ బయటికి వచ్చి పాడి పాడి ఏడ్వడం ప్రారంభించింది. ఉళ్ళక్కి ఏడ్సుకుంటానే మంచం వేశాడు. గిడ్డయ్య అతి కష్టం మీద జరిగిన విషయాన్ని తన తల్లి దండ్రులకు చెప్పాడు. కుండను మంచం మీద జాగ్రత్తగా పెట్టాడు. కాశన్న, సోమశేఖర్, శివలు ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. వాళ్ళను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. సోమశేఖర్ గిడ్డయ్య భుజంపై చేయి వేసి ‘‘ఊర్లోకి పోయి మీ వాళ్ళ నెవరినైనా పిలుచుకురావాల్నా?’’ అని అడిగాడు.ఉళ్ళక్కి ఏడ్చుకుంటూనే ‘‘వూర్ల ఎవరూ లేరు నాయనా. ఊర్ల వుండేదంతా ముసిలోల్లే. అందరూ సుగ్గికి పోయేర్య. నా క్వాళ్ళి అమ్మ నాయనోల్లు గూడ ఈడ లేరు.బెంగ్లూరు పోఏర్య. నా క్వాళ్ళిని ఈడే మా సేనులోనే మట్టి చేస్తాం’’ అన్నాడు.కాశన్న, శివ కొట్టంలోకి పోయి గడ్డపార, సలికే వెతికి తీసుకొచ్చారు. ఏడ గుంతతవ్వాలో సోమక్కను అడిగారు. వారు చూపించిన చోట కాశన్న, శివలు తవ్వుతుండగా సోమశేఖర్ మట్టి దూరంగా వేస్తూ ఉన్నాడు. తవ్వడం పూర్తయింది. గిడ్డయ్య, ఉళ్ళక్కి, సోమక్కలు కుండని జాగ్రత్తగా తెచ్చి గుంతలో పెట్టారు. అందరూ ఏడ్చు కుంటూనే మట్టి కప్పారు. ‘‘యానాటి రుణమో సారూ..! మీ పుణ్యాన నా క్వాళ్ళి (కోడలు) గుర్తులన్న వూరికి తెచ్చి ఇస్తిరి. నాయనా మీకు చేతులెత్తి మొక్కలా’’ అన్నాడు కళ్ళు టవల్‌తో తూడ్చుకొంటూ ఉళ్ళక్కి. గిడ్డయ్యకు, ఉళ్ళక్కికు, సోమక్కకు ధైర్యంగా ఉండండని చెబుతూ ముగ్గురూ బరువెక్కిన హృదయాలతో బండి దగ్గరకు వచ్చి బయలు దేరారు.చేతులకు మట్టి అంటుకొని వుంది. బట్టలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి.ముగ్గురూ ఏమీ మాట్లాడుకోలేక పోతున్నారు. దేని గురించీ ఆలోచించే స్థితిలో లేరు. ఒక రకమైన వైరాగ్యములో వున్నారు అందరూ. ఎమ్మిగనూరులో ప్రవేశిస్తున్నప్పటికి తొమ్మిది గంటలు కావొస్తోంది. సోమశేఖర్ ‘‘కాశన్న ! వూరి బయటనే ఏదన్నా హోటలు ఉంటే ఆపు కాళ్ళు, చేతులు కడుక్కొని ఏదైనా తిని ఒకేసారి ఎమ్మిగనూరులోకి వెళ్లిపోదాం’’ అన్నాడు. స్కార్పియో ఒక హోటల్ ముందు ఆగింది. అందరూ అప్రయత్నంగా బండి దిగారు. సోమశేఖరుకు గిడ్డయ్యనే గుర్తుకొస్తున్నాడు. తన భార్య శవం దొరకక పోయినప్పటికీ అమెవో కాదో తెలియని ఆ ఎముకలను ఆ కుండలో వేసుకుని గుండెలకు హత్తుకుని తన ప్రాణంగా భావించి ఎంత అపురూపంగా దానిని తన భార్య శవంగా భావిస్తూ, తినకుండా, తాగకుండా, కింద పెట్టకుండా.. ఎంత గాఢమైన ప్రేమ! తను ఎందుకు నాన్నపట్ల అంత నిర్దయగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నాడు. నాన్న గుర్తుకు రాగానే కంట్లో నీళ్ళు ఆగ కున్నాయి. శివ వాళ్ళ నాన్న తో, కాశన్న వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వున్నారు. సోమశేఖర్ ను హోటల్ లోని సప్లయర్ ఆర్డరు అడుగుతున్నా వినిపించు కోకుండా నాన్నతో ఫోన్లో ఉద్వేగంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే గుండె బరువు తగ్గినట్లు అనిపించింది. వాళ్ళు ముగ్గురూ కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉంటే సోమశేఖర్ కు తన మనసుకు అంటిన మురికిని కడుగుతున్నట్లుగా అనిపించింది. మిగిలిన ఇద్దరికీ కూడా బహుశా ! - మారుతి పౌరోహితం -
సుబ్బరామయ్య
‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖరశాస్త్రి. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్‌లో చేర్పించు’ అంటాడు. ‘‘నిరుత్సాహపరచడం కాదు కానండీ.. మీ అబ్బాయికి సీటు వస్తుందని ఖాయంగా చెప్పలేను’’ అని అప్లికేషన్ పెట్టిన రోజే సోమశేఖర శాస్త్రికి చెప్పాడు ఆఫీస్ క్లర్క్! అది క్రిస్టియన్ కాలేజ్. ఆ కాలేజ్‌లో కొడుక్కి సీటు సంపాదించడం కోసం.. అవసరమైతే వాటికన్ సిటీ నుంచైనా రికమండేషన్ లెటర్ తెచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నాడు సోమశేఖర్. క్రిస్టియన్ కాలేజ్ అంటే అంత గురి సోమశేఖర్‌కి. పద్ధతులు నేర్పిస్తారు. జీవితాన్ని ఒక గాడిలో పడేస్తారు. అందుకే ఎవరైనా.. ‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖర్. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్‌లో చేర్పించు’ అంటాడు. అడ్మిషన్స్ క్లోజ్ చేస్తుండగా చివరి వడపోతలో అవంత్కి సీటొచ్చింది! ‘‘అదృష్టం. మీ వాడికి ముందున్న అప్లికెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రయారిటీ లిస్ట్‌లో మీ వాడికొచ్చింది’’ చెప్పాడు క్లర్క్. ‘‘సంతోషం’’ అన్నాడు సోమశేఖర్. అయితే అవంత్ సంతోషంగా లేడు. అతడి ఫ్రెండ్స్ వేరే కాలేజ్‌లో చేరారు. ‘అందరం ఒకే కాలేజ్‌లో చేరదాం’ అని ఇంటర్లో ఫైనల్ ఎగ్జామ్ రాసిన రోజే అనుకున్నారు ఫ్రెండ్సంతా. అదొక బాధ ఉండిపోయింది అవంత్లో. మామూలు బాధ కాదు. మనోవేదన. మొదటిరోజు కాలేజ్ అంతా తిప్పిచూపించారు కొత్త విద్యార్థులకు. విద్యార్థులు కొత్తే కానీ, కాలేజీ కొత్తదేం కాదు. ఓ డెబ్భై ఏళ్ల నుంచి ఉంది. కాలేజీ అనే కానీ, యూనివర్శిటీ క్యాంపస్‌లా ఉంటుంది. బయటి ప్రపంచానికి కనిపించదు. అడవి మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. క్యాంపస్‌లోనే కాలేజ్ బిల్డింగ్‌లకు కొద్ది దూరంలో హాస్టల్స్. వాటిల్లో అరల్లాంటి గదులు. ఆ గదుల్లో ఒక గది అవంత్ది. గదికి ఒక్కరే ఉంటారు. కాలేజ్‌లో చేర్పించి, బస్సెక్కి వెళ్లేటప్పుడు కొడుక్కి చెప్పాడు సోమశేఖర్.. ‘‘ఇప్పుడు లోపలికి వెళ్తున్నావ్. డిగ్రీ సర్టిఫికెట్‌తోనే మళ్లీ నువ్వు బయటికి రావడం’’ అని. ఆయన ఉద్దేశం ‘అంత గొప్ప కాలేజ్ ఇది’ అని చెప్పడం. రెండో రోజు కూడా అవీ ఇవీ చూపించి, కొత్త విద్యార్థులందర్నీ.. వేరుగా ఉన్న ఒక క్లాస్రూమ్ దగ్గరకి తీసుకెళ్లారు. ఆ రూమ్‌కి తాళం వేసి ఉంది. మిగతా క్లాస్రూమ్లన్నీ రిన్నొవేషన్తో నిన్న మొన్న కట్టినట్లు కొత్తవిగా ఉంటే, అదొక్కటీ పాతదిగా ఉంది. గోడమీద ‘సుబ్బరామయ్య క్లాస్ రూమ్’ అని రాసి ఉన్న చిన్న బోర్డు ఉంది. ‘‘ముప్ఫై ఏళ్ల క్రితం ఈ క్లాస్‌రూమ్‌లోనే సుబ్బరామయ్య మాస్టారు పాఠాలు చెప్పేవారు. ఈ కాలేజీకి మాస్టారిగా రాక ముందు సుబ్బరామయ్య గారు ఈ కాలేజీలోనే విద్యార్థి. లెక్చరర్ అయ్యాక.. విద్యార్థులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు. అందుకే సుబ్బరామయ్యగారు చనిపోయాక, ఆయన క్లాస్‌రూమ్‌ని ఆయనకే ఉంచేసింది కాలేజ్ యాజమాన్యం. ఇందులో తరగతులు జరగవు. ఏ విద్యార్థికైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం క్లాస్రూమ్ తాళాలిచ్చి కాసేపు లోపల కూర్చొని రమ్మని పంపుతారు. అదొక సంప్రదాయంగా వస్తోంది. సుబ్బరామయ్యగారే ఇప్పటికీ లోపల ఉండి, కష్టం చెప్పుకోడానికి వచ్చిన విద్యార్థి కన్నీళ్లు తుడిచి పంపిస్తాడని ఒక నమ్మకం’’ అని చెప్పాడు గుంపును తీసుకొచ్చిన లెక్చరర్. ‘‘అంటే సార్.. సుబ్బరామయ్య మాస్టారి ఆత్మ లోపల తిరుగుతోందా?’’ అని అడిగాడో విద్యార్థి. ఆ గది వైపు పరిశీలనగా చూశాడు అవంత్. మూడో రోజు నుంచి రెగ్యులర్ క్లాసులు. ఈసురోమంటూ బుక్స్ పట్టుకుని కాంపౌండ్‌లో తన హాస్టల్ రూమ్ నుంచి కాలేజ్ బిల్డింగ్ వైపు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అవంత్. అతడి మనసంతా.. ఊరికి దగ్గర్లో తన ఫ్రెండ్స్ చేరిన కాలేజ్‌లోనే ఉంది. ‘‘బాబూ.. ఇలారా..’’ కాంపౌండ్‌లో చెట్టుకింద అరుగు మీద కూర్చొని ఉన్న ఓ ముసలాయన.. అవంత్ని పిలిచాడు. తలంతా నెరిసి, మనిషి వంగిపోయి ఉన్నాడు.అవంత్ ఆయన దగ్గరకు వెళ్లాడు. ‘‘కూర్చో’’ అన్నాడు ఆ మనిషి. కూర్చున్నాడు. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగాడు. ‘‘మీరెవరు?’’ అడిగాడు అవంత్. నవ్వాడాయన. ‘‘నేనెవర్నీ కాదు.ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిపోతుంటాను’’ అన్నాడు. ‘‘మీరెందుకు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు?’’ అడిగాడు అవంత్. ‘‘నలభై ఏళ్ల క్రితం నేనూ ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పాఠాలు చెప్పాను. అందుకే అప్పుడప్పుడూ వచ్చి, కాసేపు కూర్చొని వెళుతుంటాను. మనసులో నీకేదైనా కష్టం ఉంటే అలా దిగాలుగా ఉండకు. ఎవరికైనా చెప్పుకో’’ అన్నాడు. మౌనంగా ఉన్నాడు అవంత్. ‘‘పోనీ.. నాకు చెప్పు’’ అన్నాడు. అవంత్ చెప్పలేదు. క్లాస్‌రూమ్‌కి వెళ్లిపోయాడు. క్లాస్‌లన్నీ అయ్యేసరికి సాయంత్రం అయింది. అవంత్కి మాత్రం ఒక ఏడాది అయినట్లుగా ఉంది. అంత భారంగా కూర్చున్నాడు. అక్కడి నుంచి అతడు నేరుగా హాస్టల్‌కి వెళ్లలేదు. లెక్చరర్స్ క్వార్టర్స్‌కి వెళ్లాడు. అక్కడి నుంచి ‘సుబ్బరామయ్య క్లాస్రూమ్’ తాళాలు అడిగి తెచ్చుకున్నాడు. తాళాలు తీసి ‘సుబ్బరామయ్య క్లాస్రూమ్’లోకి వెళ్లి కూర్చున్నాడు అవంత్. క్లాస్‌రూమ్‌లో ఉన్నట్లే మూడు వరుసల్లో బెంచీలు ఉన్నాయి. మధ్య వరుసలో ముందు బెంచీలో కూర్చున్నాడు. ఎదురుగా డయాస్ మీద లెక్చరర్ కూర్చునే కుర్చీ ఉంది. వెనుక పెద్ద బ్లాక్ బోర్డు. కాసేపలా కూర్చున్నాడు. తర్వాత బెంచీకి తల ఆన్చి కళ్లు మూసుకున్నాడు. ‘ఎందుకు నాన్నా.. నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్‌లో నన్ను చేరనివ్వలేదు?’ అని బాధగా అనుకున్నాడు. డయాస్ మీద కుర్చీ కదిలిన చప్పుడైంది. కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు. ఎ.. దు..రు.. గా.. కుర్చీలో..!! దఢేల్మని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు అవంత్. క్లాస్‌రూమ్‌కి తాళం వేశాడు. పరుగు పరుగున నడుస్తూ ఓ చోట ఆగాడు. పూర్తిగా చీకటి పడకుండానే కాంపౌండ్‌లో లైట్లు వెలిగాయి. ఇంటికి ఫోన్ చేశాడు అవంత్. అవంత్ తల్లి లిఫ్ట్ చేసింది. ‘‘అమ్మా.. నాన్నకెలా ఉంది?’’ అని అడిగాడు. ‘‘ఏంట్రా ఆ కంగారు? నాన్నకెలా ఉంటుంది? బాగానే ఉంది. సంతోషంగా ఉన్నారు. కాలేజీలో నీకు సీటొచ్చినట్లు లేదాయనకి. ఆయనకే వచ్చినట్లుంది. ఇదిగో మాట్లాడు’’ అంది ఆవిడ. ‘‘నాన్నా.. ఎలా ఉన్నావ్?’’.. అడిగాడు అవంత్, సోమశేఖర్ లైన్లోకి రాగానే. పెద్దగా నవ్వాడాయన. ‘‘నువ్వెలా ఉన్నావో చెప్పరా. కాలేజ్ ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘బాగుంది నాన్నా.. చాలా బాగుంది. మళ్లీ చేస్తా’’ అని ఫోన్ కట్ చేశాడు అవంత్. మర్నాడు హాస్టల్ నుంచి కాలేజ్‌కి నడుస్తుంటే మళ్లీ ఆ ముసలాయన అక్కడే కూర్చొని కనిపించాడు అవంత్కి. ‘‘ఒక్కరోజులో అలవాటు పడినట్లున్నావ్ కాలేజ్‌కి. ముఖంలో సంతోషం కనిపిస్తోంది. ఏదో జరిగింది కదా’’ అన్నాడు ఆయన. అవంత్ ఆయన వైపే పరిశీలనగా చూసి, ‘ఈయనగానీ సుబ్బరామయ్య మాస్టారు కాదు కదా’ అనుకున్నాడు. అనుకుని...‘‘లేదు, ఏం జరగలేదు’’ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు.వెళుతున్న అవంత్నే సంతృప్తిగా చూస్తూ.. ‘ఎవరికి ఎవరి చేత చెప్పించాలో వారి చేతే చెప్పించాలి’ అనుకున్నాడు ముసలాయన. - మాధవ్ శింగరాజు -
హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
బెళుగుప్ప: కాలువపల్లి వద్ద ఈ నెల 22న జరిగిన హరిజన సోమశేఖర్ (25)దారుణ హత్య కేసులో ప్రదాన నిందితుడు హరిజన ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బెళుగుప్ప పోలీస్‌స్టేషన్‌లో సీఐ శివప్రసాద్, ఎస్ఐ నాగస్వామిలు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వరుసకు అక్క అయిన ఆంజనేయులు భార్య వరలక్ష్మితో సోమశేఖర్ మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మందలించి, మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో అతడిని కడతేర్చాలని ఆంజనేయులు పథకం వేశాడు. సమీప బంధువులైన ఆత్మకూరుకు చెందిన హరిజన నాగరాజు, కాలువపల్లికి చెందిన హరిజన కిరణ్, హరిజన పెద్దన్నలతో కలసి ఈ నెల 22న సాయంత్రం గ్రామ సమీపంలోని ముళ్లపొదల వద్ద సోమశేఖర్‌పై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం రామసాగరం క్రాస్ వద్ద ప్రధాన నిందితుడు ఆంజనేయులును ఎస్ఐ నాగస్వామి తమ సిబ్బందితో కలసి అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన నిందితుడిని కళ్యాణదుర్గం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. -
ఐసెట్‌లో జిల్లా వాసికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఐసెట్ ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మాలిపురం గ్రామానికి చెందిన ఇరుకుల సోమశేఖర్ రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించాడు. బుధవారం ప్రకటించిన ఐసెట్ ఫలితాల్లో 200 మార్కులకు గాను 166 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. సోమశేఖర్ ప్రస్తుతం సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా నిజామబాద్ జిల్లాలో పనిచేస్తున్నాడు. చదువులో ముందంజ.. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన ఇరుకుల భిక్షపతి, సోమలక్ష్మిల పుత్రుడు సోమశేఖర్ చిన్నతనం నుంచే చదువులో ముందంజలో ఉన్నాడు. 9వ తరగతి వరకు తిరుమలగిరిలోని వివేకానంద విద్యామందిర్, 10వ తరగతి శ్రీవాణి పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ ఖమ్మంలో చదివాడు. 2014లో సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీఏ చేయడానికి ఐసెట్ పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. -
తహసీల్దార్ బదిలీ
అనంతపురం అర్బన్ : చిత్తూరు జిల్లా నుంచి తహసీల్దార్ సోమశేఖర్‌ను అనంతపురం కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్లు రఫిక్ అహమ్మద్, సోమశేఖర్లు చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. డిసెంబర్ 31న ఇక్కడి కలెక్టరేట్లో తహసీల్దార్ ప్రసాద్ ఉద్యోగవిరమణ చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన ఆ స్థానానికి సోమశేఖర్‌ను బదిలీపై పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హిందుపురం మాజీ ఎమ్మెల్యే మృతి
హిందుపురం(అనంతపురం): హిందుపురం మాజీ ఎమ్మెల్యే జి. సోమశేఖర్ (80) గురువారం హైదరాబాద్‌లోని తన ఇంటిలో మృతిచెందారు. సోమశేఖర్ హిందుపురం నియోజకవర్గం నుంచి 1972లో గెలిచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై పోటీ చేసి ఓడిపోయారు. గురువారం ఆయన స్వగ్రామం దేమశెట్టిపల్లిలో అంత్యక్రియలు జరుపుతారు. -
కర్ణాటక సరిహద్దులో విషాదం
కేఎస్ ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీ 14 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం కోలారు, బెంగళూరు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు పలమనేరు: పలమనేరు సమీపంలోని కర్ణాటక సరిహద్దులో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. ముల్బాగల్ సమీపంలోని కప్పలమడుగు, శ్రీరంగపురం గ్రామాల సమీపంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై కేఎస్ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురి మృతదేహాలు చెల్లాచెదురై గుర్తు పట్టలేని విధంగా మారాయి. మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం దద్దరిల్లింది. మృతుల్లో ఆంధ్ర, కర్ణాటకవాసులు.. మృతుల్లో కోలారు జిల్లా గద్దేకల్లూరుకు చెందిన నా గేష్, బెంగళూరు కోడిహళ్లికి చెందిన నాగమణి, బెంగళూరు సిటీకి చెందిన నారాయణమ్మ, తుమ్కూరుకు చెందిన బస్సుడ్రైవర్ గంగాధరయ్య, ముల్బాగల్కు చెందిన విజయమ్మ, బెంగళూరుకు చెందిన భారతి బ్రహ్మచారి, కర్ణాటకకు చెందిన నితీష్‌కుమార్(2), ఆంధ్రాకు చెందిన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మండలం చిక్కనపల్లెకు చెందిన రాజశేఖర్, పలమనేరు పట్టణానికి చెందిన లిఖిత్‌కుమార్ (3), శాంతాభాయి(55), తిరుపతికి చెందిన పార్వతమ్మ ఉన్నారు. మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. పలు ఆస్పత్రుల్లో క్షతగాత్రులు.. ఈ ప్రమాదంలో గాయపడిన 13 మందిని ముల్బాగల్, కోలార్, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో బెంగళూరుకు చెందిన సోమశేఖర్, తుంకూరుకు చెందిన కేఎస్ఆర్టీసీ కండక్టర్ నరసింహరాజు, గౌరీబీదునూర్కు చెందిన లక్ష్మీపతి, సుబ్రమణ్యమాచారి, మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో నలుగురు సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం.. బెంగళూరు వైపు వేగంగా వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు వాహనాలు వేగంగా ఢీకొనడంతోనే ఇంత ఘోరం జరిగిందని తెలుస్తోంది. సింగిల్ రోడ్డుపై వస్తున్న బస్సు కుడివైపు పూర్తిగా దూసుకుపోయేలా లారీ ఢీకొంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు.. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే డె ప్యూటీ కమిషనర్ రవి, కోలారు జిల్లా ఎస్పీ అజయ్ విలోరి, డీఎస్పీ సిద్ధ్దేశ్వర్, సీఐ కృష్ణప్ప, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ప్ప, నంగిలి ఎస్ఐ అంబరేష్ గౌడ, ముల్బాగల్ ఎమ్మెల్యే మంజునాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ, పోలీస్, పీడబ్ల్యూడీ విభాగానికి చెందిన పలువురు అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మృతుల కుటుంబాలకు కేఎస్ఆర్టీసీ రూ.2.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. -
టీడీపీకి కరణం ఫ్యామిలీ ఝలక్
మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: మెదక్ నియోజక వర్గాన్ని తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దిన కరణం ఫ్యామిలీ తమ రాజీనామాల ద్వారా సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. పార్టీ అధినేత దర్శనం కోసం రెండు రోజులు పడిగాపులు కాసినా ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిన తల్లీకొడుకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కరణం సోమశేఖర్రావులు ఆదివారం ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలకు తమకు గుర్తింపు లభించడం లేద న్న ఆవేదనతో వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇంతవరకు అసెంబ్లీ అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా తీర్చిదిద్ది నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాలుగుసార్లు మంత్రి పదవిని నిర్వహించిన కరణం రాంచందర్‌రావు సేవలను చంద్రబాబు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంమంతా మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేసినా పట్టించుకోక పోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తూ... తమను నిర్లక్ష ్యం చేయడం వల్ల ఇప్పటికే తమ కార్యకర్తలంతా అసంతృప్తికి లోనై ఇతర పార్టీలోకి వెళ్లిపోయారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సైతం నియోజకవర్గ స్థాయిలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. దీంతో తమ కేడర్ దెబ్బతినే పరిస్థితికి చేరుకుందన్నారు. ఇదే విషయం చర్చించేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లి రెండు రోజులపాటు పడిగాపులు కాసినా అపాయింట్మెంట్ దొరకలేదన్నారు. గుర్తింపు లభించని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం ఇష్టంలేక తాము పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.