‘క్యాంప్ వెళ్ళే ముందు హాస్పటల్‌కు ఒకసారి వెళ్లి మీ నాన్నను పలుకరించి వెళ్ళండి. చాలా ఫీల్ అవుతా ఉన్నారు’’ అన్నది కవిత. ‘‘టైం ఎక్కడుంది. నేను చేస్తున్నది ప్రయివేటు కంపెనీలో. చూస్తూనే ఉన్నావుగా తీరికెక్కడ ఉంది? అన్నీ తెలిసీ నీవు అలా వేధించడం ఏమిటి?’’ విసుగుతో అన్నాడు సోమశేఖర్.‘‘అది కాదండి. నాన్నగారికి అవన్నీ తెలీవుగా. పని ఎప్పటికీ ఉన్నదే! కాస్తంత వీలు చూసుకుని వెళ్లి అలాగే వెళ్ళిపోండి. పది నిమిషాలు గడిపితే ఆయన సంతోషపడతారు’’ అర్థిస్తూ అన్నది కవిత. ‘‘నాకైనా వెళ్లాలని ఉండదా? నా పని ఒత్తిడి ఎవరూ అర్థం చేసుకోరు. ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయ్యింది. నియోజకవర్గాల వారిగా వెళ్లి గ్రౌండ్ రిపోర్ట్ అంట. ’’ అని నిష్టూర పోతూ అన్నాడు సోమశేఖర్.‘‘మీకు టైం లేకపోతే నేను ఎలాగూ వెళతాను కదా! మావయ్యతో చెబుతాలే అంది’’ కవిత. సోమశేఖర్ కొంత కోపం తగ్గించాడు.‘‘సర్లే చూస్తా! మేము ఎలాగూ కర్నూల్‌కు పోతావుండాము. కర్నూలుకు పోయే దార్లోనేగా హాస్పటల్. ఓ పది నిమిషాలు చూసి వెళతాలే.’’ అన్నాడు సోమశేఖర్ రాజీ ధోరణిలో.‘‘వెళితే బావుంటుందని, అంతకు మించి ఏమీ లేదు. పది గంటలకు క్యారేజీతో ఎలాగూ నేను వెళతానుగా’’ సర్ది చెబుతూ అంది కవిత. సోమశేఖర్ తన కొలీగ్ శివకు ఫోన్ చేశాడు. ‘‘శివా! నీవు ఆటో పట్టుకుని మెహదీపట్నం వచ్చేయ్! మానాన్న ఉన్న ఆస్పత్రి నీకు తెలుసు కదా, అక్కడకు వచ్చేయ్! నాన్న మాట్లాడాలని కలవరిస్తున్నాడంట. ఓ పది నిమిషాలు ఆయనతో మాట్లాడాలి. నీవు ఆటోలో రాగలిగితే నిన్ను పికప్ చేసుకునే సమయం మిగిలి అక్కడ గడపొచ్చు. ప్లీజ్’’ అని అభ్యర్థించాడు సోమశేఖర్.
‘‘అలాగే సర్! తప్పకుండా’’ అవతల వైపు నుండి శివ.సోమశేఖర్ హైదరాబాదులో ఒక ప్రయివేటు టివి ఛానల్‌లో పని చేస్తున్నాడు. నాన్న ఆంజనేయులు గవర్నమెంట్ టీచర్. అమ్మ గృహిణి. సోమశేఖర్‌కు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. నాన్నకు ఇటీవల హార్ట్ ప్రాబ్లెమ్ వలన ఆస్పత్రిలో చేర్చారు. నాన్నకు ఇ.హెచ్.ఎస్ ఉంది. పెన్షన్ వస్తోంది. ఆర్థికంగా నాన్న, అమ్మలు సోమ శేఖర్‌కు భారం కాదు కాని సమయమే వారి గురించి కేటాయించ లేకపొతున్నాడు. సోమశేఖర్ ఆస్పత్రిని చేరుకొని నాన్న రూమ్‌కు వెళ్ళాడు. అమ్మ నాన్నకు బ్రష్ చేయించినట్లుంది. నాన్న టవల్‌తో ముఖం తుడుచుకుంటున్నాడు . ‘‘ఎలా వుంది నాన్నా’’ అంటూ రూములోకి ప్రవేశించాడు సోమశేఖర్.‘‘బావుందిరా! మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పారురా ’’ కొడుకు వచ్చాడన్న ఉత్సాహంతో అన్నాడు ఆంజినేయులు.‘‘అమ్మా! కవిత పది గంటల లోపు వస్తుందంట’’ అని అమ్మ సావిత్రమ్మతో సోమశేఖర్ అన్నారు. ‘‘అవున్రా ఫోన్ చేసి చెప్పింది. సోమశేఖర్ ఆస్పత్రికే బయలు దేరాడని చెప్పింది. మీ నాయన నీకోసమే ఎదురు చూస్తా ఉండాడు’’ అంది సావిత్రమ్మ.‘‘కాదుమా! ఈయప్ప నన్ని ఇంత టెన్షన్ పెడితే ఎట్టా! నాకేమి రాకూడదని ఉంటదా. నా తిప్పలు మీకేమి తెలుసు. ఇరవై రోజులైంది. ఒక్క రోజు రెస్ట్ లేకుండా దోకిస్తా ఉన్నారు. మా! నాను చేస్తా ఉండేది ప్రవేటు ఉద్యోగం. నాయనకు తెలియంది ఏముంది? సూడల్ల, సూడల్ల అని సతాయిస్తే ఎట్టా! ఈడొచ్చి నాతాన ఉండమంటే రారు. పల్లె ఇడిసి రామంటారు. పన్నెండు ఏండ్లు పనిచేసి దాన్నే ఈయప్ప సొంతూరుఅనుకుంటాండు. ఆడ మన తాతలు సంపాదించిన భూములేమన్న ఉన్నాయా?. నా తిప్పలు నాకైతే ఈయప్ప దొకటి’’ అంటూ అసహనం వ్యక్తం చేశాడు సోమశేఖర్. ‘‘సర్లేరా ! పోయిరాపో! ఏంటోరా నిన్ను సూడాలనిపిస్తాది. రావాలంటాను. అంతే’’ అన్నాడు ఆంజనేయులు నోచ్చుకొంటూ. ‘‘మా! ఇడ్లీ తీసుకొచ్చా. తినిపించు’’ అన్నాడు సోమశేఖర్.
సావిత్రమ్మ ఆంజనేయులు ముందు ఇడ్లీ పెట్టింది. ఆంజనేయులు ఇడ్లీ తింటూ సోమశేఖర్ తో మాట్లాడసాగాడు. ‘‘క్యాంపు ఎక్కడికి పోతావున్నారా?’’ అని సోమశేఖర్‌ను ప్రశ్నించాడు ఆంజినేయులు. ‘‘ఏమ్మిగనూరుకు నాన్నా!’’ అని సోమశేఖర్ అనగానే ఒక్కసారిగా ఆంజనేయులు మొఖం వెలిగిపోయింది. తను ఉంటున్న ప్రాంతమే. ‘‘నాను ఈడకు వచ్చి వారం రోజులైంది. ధనుంజయ సారు నీకు తెలుసుకదా ? మొన్న రాత్రి బాత్రూములో కాలు జారి పడినాడంట. వాడి కొడకు ఫోన్ చేసి ఉండే. వీలైతే ఎమ్మిగనూరులో ధనుంజయ సార్ ను కలిసి రారా.’’ అంటుండగా ఒక్కసారిగా దగ్గు వచ్చింది. ఆ దగ్గుతొ నోట్లో నములుతున్న ముద్దగా వున్న ఇడ్లి తుంపరలుగా వచ్చి సోమశేఖర్ మీద పడింది. షర్టు పై పడిన ఇడ్లిను దులుపుకొంటూ ఒక్కసారిగా ఇంతెత్తు లేచాడు సోమశేఖర్.
‘‘తినేటప్పుడు మాట్లాడొద్దు అంటే ఇనిపించుకోవు. మా! ఇంతగూడా ఈయప్పకు బుద్దిరాల్యా! నేనే బుద్ది తక్కువై వచ్చా. మా! ఎట్లా ఎగుతావో ఏమో నాకు తెల్దు. నే పోతున్నా! నాల్గు దినాలు రాను సూడు! ఊరికే ఫోన్ చేసి సతాయించొద్దండి ‘‘ అంటూ విసవిస వెళ్ళిపోయాడు సోమశేఖర్.నాన్న కళ్ళ నుండి కన్నీరు చెంపలపైకి చేరింది. అమ్మ కొంగుతో కళ్ళు అద్దుకుంది. సోమశేఖర్ ఆస్పత్రి నుండి బయటకి రాగానే శివ స్కార్పియో దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. ‘‘శివ ఎంత సేపయింది వచ్చి?’’ అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా ‘‘ పోదాం పదా’’ అన్నాడు సోమశేఖర్. ‘‘సరే సర్’’ అంటూ కదిలాడు శివ.డ్రైవర్ కాశన్న ‘‘సార్ ఎక్కడైనా టీ తాగుదాం?’’ అన్నాడు. సోమశేఖర్ ‘‘నేను కూడా టిఫిన్ చేయాలి. ఏదైనా హోటల్ ఉంటే ఆపు’’ అన్నాడు.‘‘అవునవును నేను కూడా దమ్ము కొట్టాలి’’ అన్నాడు శివ.స్కార్పియో ఒక డాబా ముందు ఆగింది. నలుగురూ దిగారు. సోమశేఖర్ టిఫిన్‌కు ఆర్డరిచ్చాడు . శివ, కాశన్నలు టీ కి ఆర్డరిచ్చి టేబుల్ ముందు కూర్చున్నారు. డ్రైవర్ కాశన్న పక్కటేబుల్ దగ్గర కూర్చుని టీ కోసం ఎదురు చూస్తున్నాడు.
సోమశేఖర్ శివతో మాట కలుపుతూ...‘‘నా చదువంతా ఎమ్మిగనూరు చుట్టు పక్కల, ఎమ్మిగనూరులో సాగింది శివా! తర్వాత పీజిడియంసి యానిమేషన్ కోర్సులకై బెంగళూరు పోతిని. అది అయిపోయినాక ఈ ఛానల్లో చేరి ఇట్లా తిప్పలు పడుకుంటా ఉండా. రేపటి మన ప్రోగ్రామ్ ఎమ్మిగనూర్‌లో వుండేది. మనం కర్నూలు వెళ్లి అక్కడి నుంచి ఎమ్మిగనూరు వెళ్ళాలి. కర్నూలుకు డెబ్బై కి.మీ. దూరంలో ఉంటాది ఎమ్మిగనూరు. మా నాయన ఎమ్మిగనూరు దగ్గర్లోనే నాగలదిన్నె అనే ఊర్లో పన్నెండు ఏండ్లు టీచరుగా పని చేసి రిటైర్ అయినాడు. రిటైరైనాక కూడా ఆడనే ఉండాడు. హైదరాబాద్ రాకముందు నేను కూడా ఆడనే ఉండినాను. పదైదు దినాల కింద గుండెలో నొప్పి వస్తే హైదరాబాద్కు పిలిపించి ఆస్పత్రిలో చూపిస్తి. ఏం సమస్య లేదు. టాబ్లెట్స్ వాడాలన్నారు డాక్టర్లు. రోజూ తనతో ఆస్పత్రికి పోయి మాట్లాడాలంటాడు. మనకి అయితాదా? నీవే సూస్తుండావు కదా!!’’ అన్నాడు. ‘‘అవును సర్ ! మీ నాయన మిమ్ములను సూడాలని సతాయిస్తుండాడు. మా నాయన నన్ని సూడకుండా సతాయిస్తుండాడు. ఎప్పుడైనా నేనే ఫోన్ చేయాలి.నెల దినాలైనా చేయడు. ఫోన్చేస్తే ఎత్తడు. ఏమి నాయనోల్లో ఏమో! ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ’’ అంటూ శివ కాశన్న వైపు తిరిగి ‘‘ఏం కాశన్నా! అంతే గదా’’ అన్నాడు. ‘‘ఏమో సార్.. నాకైతే మా నాయన సిన్నప్పుడే సచ్చిపోయినాడంటా. మా యమ్మది సోమశేఖర్ సార్ వాళ్ళ నాయన కతే! మాది కూడా కర్నూలు దగ్గర నిడ్జూరు. ఇంటికాడ వొక్కతే ఉంటాదని ఫోన్ కొనిచ్చినాను. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తా ఉంటాది. మనకేమో ఈ ఫోన్ తీయడం కాదు.. ఈ ముసలోల్లతో వచ్చింది సావు’’ అన్నాడు కాశన్న.దాబాలో సప్లయర్ చినిగి పోయిన బనియన్ వేస్కొని బక్క పల్చగా ఉన్నాడు. కళ్ళు లోపలి పోయివున్నాయి. బహుశా రాత్రంతా మేల్కొని ఉన్నట్లున్నాడు. మొఖం పీక్క పోయిఉంది.వీళ్ళ సంభాషణ వింటున్న సప్లయర్ ‘‘సార్ మీరు కర్నూలుకు పోతున్నారా?’’ అని అడిగాడు. సోమశేఖర్ ‘‘అవును’’ అన్నాడు. ‘‘సార్ ఆ రోడ్డు మీద ఆయన్ను చూడండి !’’ అంటూ రోడ్డు వైపు చూపించాడు.పైకి కట్టుకున్న మాసిన లుంగీ, వారాలుగా ఉతకకున్న షర్టు, చిందరవందరగా ఉన్న జుట్టు, మాసిపోయిన గడ్డం, ఒక చేతిలో సంచి పట్టుకుని ఉండాడు. ఇంకొక చేతితో భుజంపైన కుండను పట్టుకుని ఉండాడు. కుండకు పాత గుడ్డ కట్టి దాని చుట్టూ సన్నని తాడు కట్టి వుంది. చేతిలోని సంచిలో వంట గిన్నెలు ఉన్నట్లున్నాయి.కదిలినపుడంతా లోపలి గిన్నెలు శబ్దాలు చేస్తున్నాయి.సోమశేఖర్ ఆసక్తిగా ‘‘ ఎవరు అతను? పోతున్న బండ్లన్నిటిని ఆపమని అడుగుతున్నట్లున్నాడు’’ అని అడిగాడు.
‘‘సార్. ఎక్కడినుండి నడుచుకుంటూ వచ్చాడో తెలియదు. పొద్దుటి నుండి కర్నూలు వైపు పోయే వెహికల్స్‌ను ఆపి కర్నూలుకు వస్తా .. అని అడుగుతావుండాడు. ఏ వెహికల్ ఆగడం లేదు. ఒకటి రెండు జీపులు ఆగినాయి. ఇతను నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. వాళ్ళు ఎగాదిగా చూసి వెళ్ళిపోతున్నారు. పాపం అనిపిస్తా వుంది సార్. నేనే బన్ను టీ తీసుకు పోయి తినమంటే వద్దు అన్నాడు. మీకు పుణ్యం వుంటాది. మీ బండి వెనక సీటు ఖాళీగున్నట్లు ఉంది. కొంచెం ఎక్కించుకుని పొండి సార్. నాకే బాధ అయితా ఉంది’’ అని అర్థించాడు.కర్నూలు అనే పేరు వినగానే సోమశేఖర్ అయితే ‘‘పిలు అతడిని’’ అన్నాడు.
సప్లయర్ పరిగెత్తుకుంటూ ఆ మనిషి దగ్గరికి వెళ్లి గట్టిగా ‘‘సారోల్లు కర్నూలుకు పోతుండారంట. బండి ఎక్కమన్నారు. పో .. బండి ఎక్కు’’ అని చెప్పాడు.‘‘నా దగ్గర దుడ్లు లేవు అని సెప్పినావా?’’ అని అనుమానంగా అడిగాడు అతను.‘‘చెప్పినా లే! రా.. ముందు నీవు ఎక్కి కూర్సో’’ అంటూ సప్లయర్ బండి వెనకాల డోర్ తీశాడు. అతను కుండను జాగ్రత్తగా పట్టుకుని సీటు మీద పెట్టి లోపలి ఎక్కాడు. సప్లయర్ సంచిని తీసి అందించాడు. గళ గళ శబ్దం చేస్తున్న సంచిలోంచి సత్తు గ్లాసులు రెండు కింద పడినాయి. సప్లయర్ వాటిని తీసి సంచిలోకి వేసి సంచిని అతనికి అందించగా అతను సంచిని లోపలి తీసుకున్నాడు. అతను సీటు పైన కూర్చుని పైన గుడ్డను కట్టిన కుండను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. సోమశేఖర్, శివలు వచ్చి బండి ఎక్కారు. డ్రైవర్ బండి స్టార్ట్ చేశాడు. టైం పదిన్నర. శివ ముందు సీట్లో, సోమశేఖర్ మద్య సీట్లో కూర్చున్నారు.శివ వెనకాల కూర్చున్న వ్యక్తిని చూస్తూ, ‘‘టీ తాగాల్సింది’’ అని పలకరింపుగా అన్నాడు . ‘‘ వొద్దు సారూ’’ అన్నాడతను. ‘‘ఏముంది ఆ కుండలో అంత భద్రంగా ఒళ్లో పెట్టుకుని కూసుండావు. కోడిపెట్ట తన పిల్లల్ని రెక్కలకింద జాగ్రత్తగా అదిమి పెట్టుకొన్నట్లు’’ అని అతణ్ణి ప్రశ్నించాడు. అతను ఏమి పలకలేదు. చూపులు ఎదుటి కిటికీ నుండి బయటకు చూస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం లోనే లేడన్నట్లుగాఉన్నాడు.‘‘ఏం సామీ ఏం పలకకున్నావు. కొంపదీసి ఆ కుండలో నిధి ఏమీ లేదు గదా! మేమేం అడగంలే. ఏముండాది ఆ కుండలో.. ఏమి సేప్పకున్నావు’’ అన్నాడు శివ.తనను గాదేమో అన్నట్లు అవే చూపులు. సోమశేఖర్ ‘‘వదిలేయ్ శివా! అతన్తో మనకెందుకు’’ అన్నాడు.బండి ఫోర్ లైనర్లో పోతా ఉంది. ఆలంపూరు చౌరస్తా వచ్చింది. టైం ఒకటిన్నర.శివ ‘‘సార్ భోం చేద్దామా?’’ అని అదిగాడు.సోమశేఖర్ ‘‘సరే పద! కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు పోయే దారిలో హోటళ్ళు కూడా ఏమీ లేవు. ఇక్కడే తినిపోదాం’’ అన్నాడు.డ్రైవర్ దాబాను చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు.వెనకాలతను ‘‘సార్! ఎమ్మిగనూరుకు పోతారా?’’ అని అడిగాడు.సోమశేఖర్ ‘‘అవును. నీవు కర్నూలు వరకే కదా!’’ అని అడిగాడు.‘‘సార్ నాదీ ఎమ్మిగనూరు దగ్గరే! గువ్వలదొడ్డి. కర్నూలు నుండి ఎమ్మిగనూరుకు పోయే రోడ్డులో ఎర్రకోట వస్తాది. ఆటికి మావూరు ఒక మైలు వుంటాది. నాను ఆడ దిగుతా సార్!. మీకు పుణ్యం ఉంటాది. ఆడ ఆపండి సారూ!’’ అని వేడుకున్నాడు.సోమశేఖర్ ‘‘నీది గువ్వలదొడ్డినా ? అవున్లే .. ఎర్రకోట నుండి పోతారు గదా? .. సర్లే దింపుతాంలే ‘‘ అని అన్నాడు.
డ్రైవర్ ఆలంపూరు ఫ్లై ఓవర్ దాటిన తరువాత ఒక డాబా వద్ద బండి ఆపాడు.అందరూ దిగారు. సోమశేఖర్ బండి వెనకాల కూర్చున్న వ్యక్తీ వైపు తిరిగి ‘‘నీ పేరేమన్నావ్!’’ అని ప్రశ్నించాడు. అతను శక్తినంతా కూడగట్టుకుని తడి ఆరిపొయిన పెదవులను నాలుకతో తడిచేసుకొంటూ ‘‘గిడ్డయ్య సారూ’’ అని చెప్పాడు.\‘‘దిగు గిడ్డయ్యా ! .. అన్నం తిందువు కాని’’ అన్నాడు.గిడ్డయ్య ‘‘వద్దులే సారూ..’’ అని అన్నాడు.‘‘డబ్బులు మేమిస్తాంలే ! నీవేం ఇవ్వొద్దు.. పోద్దట్నించి ఏమి తినలేదంట కదా! ఆ డాబాలో సప్లయర్ చెప్పాడు. తిందురా. ఆ కుండ సీటు మీద పెట్టు. నీ నిధిని ఎవ్వరూ ఎత్తుక పొర్లే .. రా..’’ అని అడిగాడు. ‘‘వొద్దులే సారూ.. నాకి ఆకలి లేదు. మీరు తిని రండి.. నాను ఈడనే కూసోని ఉంటాను’’ అన్నాడు.‘‘నీ ఖర్మ! మేం ఏమీ చేయలేము. మేం తినొస్తాం. అయితే ఈడనే వుండు’’ అంటూ సోమశేఖర్ బండి దిగాడు.ముగ్గురూ వెళ్లి అరగంటలో తిని వచ్చారు. బండి మరలా బయలు దేరింది.తన బాల్యం ఎమ్మిగనూరు ప్రాంతంలో సాగడం వలన గిడ్డయ్య మౌనం అనేక అనుమానాలు కలిగిస్తా ఉంది. ఏమి తినలే. ఏమీ తాగలే. ప్రతీదీ వద్దంటాడు. గిడ్డయ్యది ఎమ్మిగనూరు ప్రాంతమే. ఎందుకో సోమశేఖర్‌కు గిడ్డయ్యతో మాట్లాడాలని ఉంది. తనూ అదే ప్రాంతం వాడు కావడం వలన ప్రాంతీయ అభిమానంకావచ్చు.సోమశేఖర్ ‘‘గిడ్డయ్యా! గువ్వలదొడ్డి అన్నావ్ కదా! హైదరాబాద్ ఎందుకొచ్చావు?’’ అని ప్రశ్నించాడు. ‘‘సారూ... ! బతకనీక వొచ్చింటిమి’’ అంటూ నీరసంగా మాట్లాడడం ప్రారంభించాడు గిడ్డయ్య.‘‘మా నాయన పేరు ఉళ్ళక్కి, మాయమ్మ సోమక్క. మాకి మూడు ఎకరాలు వరిమడి ఉండ్య. మాకి బాయి ఉండ్య. మా వూరికి కాల్వ ఉండ్య. ఎండా కాలం కాల్వ నీళ్ళు పారుతా ఉండ్య. వానా కాలం వానకే వడ్లు పండిస్తాంటిమి. మానాయన మోటతో (కపిల) నీళ్ళు పారిస్తా ఉండ్య. మా నాయన నన్ని సదువిడిపిచ్చి సేని పనికి పిలుసుక పోబట్ట్యా! మూడు ఎకరాలు వరిమడి పెట్టుకొని మనకి సదువెంటికిలే? అంటాండ్య. నాను కూడా బడి ఇడిసి పెట్టి మానాయనతో కల్సి సేనికి పోతాంటి సార్. నాయన మెత్తగాయ. మాయమ్మ మెత్తగాయ. నాకి పెండ్లి సేసిరి. బాయి ఎండిపాయ. మోట మూలాన పడ్య. సేను బీడు అయిపాయ. మానాయన ఎప్పుడు సూసినా నా కొడుకుని సదవొద్దని వాని గొంతు గోసిడిస్తిని అని పలమతాండ్య.
ఇంట్ల తిండికి జరగక పాయే. ఇంగ ఇట్ల కాదని నాను నా పెండ్లాం హైదరాబాద్ కి బతకనీక వస్తిమి. సెడి పట్నం సేరాలనేర్య పెద్దలు. అట్లా వచ్చిడిస్తిమి సారూ. రోవొన్ని దినాలు మట్టి పనికి పోతిమి. నా పెండ్లాముకి బరువులుమోసి మోకాళ్ళ నొప్పులు రాబట్య. మట్టి పని చేయాల్యాక పాయ. నాను మట్టి పనికి పోతుంటే తాను గుడిసె కాడనే వుంటుండ్యా. ఇంగ ఇట్లా కాదని పక్క గుడిసె ముసిలోళ్ళు డంప్ యార్డుకాడికి ఇనుప ముక్కలేరుకోనీక్య పోతుంటే తానూ కూడా పోబట్య. ఇనుప ముక్కలు ఏరుకొని గుజిరీకి అమ్ముతుండ్య . దినామూ నూరు, నూటాయావై రూపాయలోస్తాండ్య. ఒక దినుము నాకు ప్రాణం బాగా ల్యాక కొట్టంకాడ ఉంటి. పక్క కొట్టం ముసిలోల్లతో కలిసి దినుమూ మాదిరే ఇనుము ముక్కలేరుకోనేకి డంప్యార్డు కాటికి పాయే. పైటాలప్పుడు ముసిలోల్లు ఉరుక్కుంట మా గుడిసె కాటికొచ్చి గిడ్డయ్యా! నీ పెండ్లాం మీద అంటబెట్టిన చెత్త పడిడిసేద్య. ఆయమ్మ దాంట్లోనే మునిగి పోయ. బెరీన రా ! అన్రి. నాను ఉరుక్కుంటూ పోతి. పెద్ద దిబ్బ పైన కాలుతుంటే నా పెండ్లాము కింద ఉండేనట. అదికాలి కాసి కిందకి పొర్లి పడిపోయేద్య.నాను ఏడ్సుకుంట కసువు తీసేసేకి సూస్తిని. ఆడున్నోల్లు పట్టుకునిడిసిరి. నాను ఏడ్సుకుంట ఏమి సేతురా దేవుడా అనుకుంటా ఉంటి. అదేదో టీవి లోన సెప్పిరంట. ప్రోక్లయిను వచ్చి నుగ్గ తవ్వి సూసేగాని ఆయమ్మ మాత్రము దొరకల్యా! డ్రైవోరు నాదగ్గరున్న వేయి రూపాయలూ డిజిల్ కని తీసుకోనిడిస్య! అందురూ అగ్గిలో బూడిదై పోయింటాది అనబట్రి. నా పెండ్లాముని ఎట్లన్న తీసియండి. అయమ్మ పీనిగినన్న తీస్కోని వూరికి పోతా! మా నాయనకి మా యమ్మకి నాను మొగమెట్ల సూపియ్యాలంటి. వాళ్ళే అంత గుంపు కట్టుకుని కూసున్న కాడ బూడిదని తీసిరి. పీనిగి దొరకల్యా! ఎముకలు దొరికితే అవే ఆయమ్మవని ఈ కుండల పెట్టిచ్చిరి. ఈ కుండలో సచ్చిపోయిన నా పెండ్లాము ఎముకలుండాయి. మన్ను చేసేకి మా ఊరికి తీసకపోతున్నా. మా యత్తకి, మామకి నా నేమని సెప్పాల! మాము నామదార్లం. మన్ను అయ్యేంత వరకు ఏమీ ముట్టము సారూ. దానికే నాను టీ నీళ్ళు కూడా తాగ కుండా ఉండేది. పుణ్యాత్ములు మీరు నాకి దొరికితిరి. ఎట్లన్నా గాని ఎర్రకోట కాడ దింపండి సారూ’’ అంటూ కన్నీరు పెట్టుకొన్నాడు గిడ్డయ్య.
సోమశేఖరుకు నోట మాట రాలేదు. కళ్ళలో అందరకూ నీళ్ళు తొణికిస లాడాయి. తన చిన్నతనంలో ఎమ్మిగనూరులో చుట్టూ ఎక్కడ చూసినా నీళ్ళుఉండేవి. ఆ నీళ్లన్నీ ఎక్కడికి పోయాయి...? తుంగభద్ర ఎల్‌ఎల్‌సి కెనాల్ క్రింద వేసవి కాలములో గూడ నీళ్ళు వచ్చేవి. ఈ కాలువ క్రింద పండే పొలాలలో పని చేయడానికి ఎంతోమంది ఆస్పరి, దేవనకొండ, తుగ్గలి వంటి ప్రాంతాలనుండి సుగ్గికి వచ్చేవారు. తను వదలిపెట్టిన పన్నెండు ఏళ్ళలోనే ఎంత మార్పు వచ్చింది కదా అని ఆలోచిస్తూ ఉండగా గిడ్డయ్యా, ‘‘సారూ ఆడ కనిపించేదే ఎర్రగోట. ఊరుముందే ఆపండి. నాను దిగుతాను’’ అని సంచి చేతిలోకి తీసుకుంటూ అన్నాడు గిడ్డయ్య.రోడ్డు పక్కన స్కార్పియో ఆపారు. డ్రైవర్ కాశన్న దిగి వెనకాల వచ్చి డోరు తీశాడు. సంచిని చేతిలోకి తీసుకొని సామాన్లు కింద పెట్టాడు. గిడ్డయ్య కుండని గుండెలకు హత్తుకుని జాగ్రత్తగా కిందకు దిగి ‘‘సారూ! శానా సాయం సేస్తిరి. సచ్చి మీ కడుపున పుడతాను తండ్రీ! మీరు మడసంగా పోయి రాండి ’’ అంటూ కుండను భుజం మీద పెట్టుకుని సత్తు గిన్నెల సంచిని చేత పట్టుకుని మట్టి రోడ్డు వైపు బయలు దేరాడు.కాశన్న బండి ఎక్కి ముందుకు పోనిచ్చాడు. అందరూ గంభీరంగా ఉన్నారు. సోమశేఖర్ కల్పించుకుని ‘‘కాశాన్నా! బండి తిప్పు! గిడ్డయ్యను వారూర్లో దింపోద్దాం. పోద్దన్నుంచి ఏమి తినలే. తాగలే.ఎడనన్న పడిపోతే కష్టం. మనకి గిడ్డయ్యకి ఎదో ఋణాణుబంధం ఉంది. పోయోద్దాం పా... మన ప్రోగ్రాం ఎట్లా రేపు 11 గం’’లకు. ఊర్లో ఇదిసివద్దాం పా..’’ అన్నాడు.
‘‘నాకూ అదే అనిపించింది సర్ !’’ అన్నాడు కాశన్న శివ కూడా వదిలి పెట్టి రావడమే మంచిది అన్నాడు. కాశన్న బండి తిప్పుకొని గువ్వల దొడ్డి మట్టి రోడ్డు ఎక్కించాడు. గిడ్డయ్య పక్కన బండి ఆపారు. కాశన్నదిగి గిడ్డయ్య చేతిలో సంచి తీసుకొని వెనకాల డోరు తెరచి ‘‘కూసుందురా గిడ్డయ్యా’’ అన్నాడు. ‘‘ఏంటికొస్తిరి సారూ. నానే పోతాంటి కదా’’ అన్నాడు గిడ్డయ్య ఇబ్బంది పెట్టడం ఎందుకనుకొంటూ. కాని కాశన్న గిడ్డయ్యకు ఆ అవకాశం ఇవ్వలేదు.‘‘ఎంత మంచోళ్ళు సారూ మీరు’’ అనుకుంటూ గిడ్డయ్య కుండను జాగ్రత్తగా పట్టుకుని బండి ఎక్కాడు. ‘‘సార్ మా సేను ఊరికి పోయే రాస్తాలోనే ఉంటాది. ఊర్ల మట్టి మిద్దె పడిపోయినాక మా నాయన, మాయమ్మ సేన్లోనే కొట్టం వేసుకుని ఉండారు. సేను బీడైనా మా నాయన నాసావు ఈ సేన్లోనే అనికాసి సేన్లోనే వుండాడు. ఉర్లోనికి పని లేదు సారూ. వూరి బయట్నే మా సేను. కొట్టం కాడ ఆపండి.’’ అని కోరాడు గిడ్డయ్య .మట్టి రోడ్డుపై దుమ్ము లేపుతా బండి పోతా ఉంది. రోడ్డు పై ఒక్కరూ కూడా కనిపించకున్నారు. కనుసూపు మేర బీడు పడిన పొలాలే కన్పిస్తాండాయి.‘‘సారూ ఈడ ఆపండి’’ అన్నాడు గిడ్డయ్య. కాశన్న వెనుకకు వచ్చి డోరు తీశాడు. గిడ్డయ్య కిందకు దిగాడు. కొట్టం ముందర రోడ్డుపైన జీపు ఆగే సరికి గిడ్డయ్య వాళ్ళ నాయన బయటకు వచ్చి గిడ్డయ్యను చూశాడు.‘‘ఓరే గిడ్డీగా ! ఏంరా జీపుల వస్తివి’’ అన్నాడు ఆందోళనగా.
‘‘నాయనా ఇంకేముంది.. నాయనా.. నీ క్వాళ్ళి (కోడలు) సచ్చిపోతే ఈ కుండల తెస్తిని నాయనా !’’ అని ఏడ్సుకుంటూ గిడ్డయ్య వాళ్ళ నాన్నకి ఎదురుపోయాడు. గిడ్డయ్య మాటలు విన్న సోమక్క గుండెలు బాదుకుంటూ బయటికి వచ్చి పాడి పాడి ఏడ్వడం ప్రారంభించింది. ఉళ్ళక్కి ఏడ్సుకుంటానే మంచం వేశాడు. గిడ్డయ్య అతి కష్టం మీద జరిగిన విషయాన్ని తన తల్లి దండ్రులకు చెప్పాడు. కుండను మంచం మీద జాగ్రత్తగా పెట్టాడు. కాశన్న, సోమశేఖర్, శివలు ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు. వాళ్ళను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. సోమశేఖర్ గిడ్డయ్య భుజంపై చేయి వేసి ‘‘ఊర్లోకి పోయి మీ వాళ్ళ నెవరినైనా పిలుచుకురావాల్నా?’’ అని అడిగాడు.ఉళ్ళక్కి ఏడ్చుకుంటూనే ‘‘వూర్ల ఎవరూ లేరు నాయనా. ఊర్ల వుండేదంతా ముసిలోల్లే. అందరూ సుగ్గికి పోయేర్య. నా క్వాళ్ళి అమ్మ నాయనోల్లు గూడ ఈడ లేరు.బెంగ్లూరు పోఏర్య. నా క్వాళ్ళిని ఈడే మా సేనులోనే మట్టి చేస్తాం’’ అన్నాడు.కాశన్న, శివ కొట్టంలోకి పోయి గడ్డపార, సలికే వెతికి తీసుకొచ్చారు. ఏడ గుంతతవ్వాలో సోమక్కను అడిగారు. వారు చూపించిన చోట కాశన్న, శివలు తవ్వుతుండగా సోమశేఖర్ మట్టి దూరంగా వేస్తూ ఉన్నాడు. తవ్వడం పూర్తయింది. గిడ్డయ్య, ఉళ్ళక్కి, సోమక్కలు కుండని జాగ్రత్తగా తెచ్చి గుంతలో పెట్టారు. అందరూ ఏడ్చు కుంటూనే మట్టి కప్పారు. ‘‘యానాటి రుణమో సారూ..! మీ పుణ్యాన నా క్వాళ్ళి (కోడలు) గుర్తులన్న వూరికి తెచ్చి ఇస్తిరి. నాయనా మీకు చేతులెత్తి మొక్కలా’’ అన్నాడు కళ్ళు టవల్తో తూడ్చుకొంటూ ఉళ్ళక్కి. గిడ్డయ్యకు, ఉళ్ళక్కికు, సోమక్కకు ధైర్యంగా ఉండండని చెబుతూ ముగ్గురూ బరువెక్కిన హృదయాలతో బండి దగ్గరకు వచ్చి బయలు దేరారు.చేతులకు మట్టి అంటుకొని వుంది. బట్టలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి.ముగ్గురూ ఏమీ మాట్లాడుకోలేక పోతున్నారు. దేని గురించీ ఆలోచించే స్థితిలో లేరు. ఒక రకమైన వైరాగ్యములో వున్నారు అందరూ. ఎమ్మిగనూరులో ప్రవేశిస్తున్నప్పటికి తొమ్మిది గంటలు కావొస్తోంది. సోమశేఖర్ ‘‘కాశన్న ! వూరి బయటనే ఏదన్నా హోటలు ఉంటే ఆపు కాళ్ళు, చేతులు కడుక్కొని ఏదైనా తిని ఒకేసారి ఎమ్మిగనూరులోకి వెళ్లిపోదాం’’ అన్నాడు. స్కార్పియో ఒక హోటల్ ముందు ఆగింది. అందరూ అప్రయత్నంగా బండి దిగారు. సోమశేఖరుకు గిడ్డయ్యనే గుర్తుకొస్తున్నాడు. తన భార్య శవం దొరకక పోయినప్పటికీ అమెవో కాదో తెలియని ఆ ఎముకలను ఆ కుండలో వేసుకుని గుండెలకు హత్తుకుని తన ప్రాణంగా భావించి ఎంత అపురూపంగా దానిని తన భార్య శవంగా భావిస్తూ, తినకుండా, తాగకుండా, కింద పెట్టకుండా.. ఎంత గాఢమైన ప్రేమ! తను ఎందుకు నాన్నపట్ల అంత నిర్దయగా ప్రవర్తిస్తున్నాను అనుకుంటున్నాడు. నాన్న గుర్తుకు రాగానే కంట్లో నీళ్ళు ఆగ కున్నాయి. శివ వాళ్ళ నాన్న తో, కాశన్న వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతూ వున్నారు. సోమశేఖర్ ను హోటల్ లోని సప్లయర్ ఆర్డరు అడుగుతున్నా వినిపించు కోకుండా నాన్నతో ఫోన్‌లో ఉద్వేగంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే గుండె బరువు తగ్గినట్లు అనిపించింది. వాళ్ళు ముగ్గురూ కాళ్ళు, చేతులు కడుక్కుంటూ ఉంటే సోమశేఖర్ కు తన మనసుకు అంటిన మురికిని కడుగుతున్నట్లుగా అనిపించింది. మిగిలిన ఇద్దరికీ కూడా బహుశా !
- మారుతి పౌరోహితం
నీళ్లింకని నేల
Published Sun, Nov 25 2018 2:15 AM | Last Updated on Sun, Nov 25 2018 2:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment