మెదక్/మెదక్ టౌన్, న్యూస్‌లైన్: మెదక్ నియోజక వర్గాన్ని తెలుగు దేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దిన కరణం ఫ్యామిలీ తమ రాజీనామాల ద్వారా సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. పార్టీ అధినేత దర్శనం కోసం రెండు రోజులు పడిగాపులు కాసినా ఫలితం లేకపోవడంతో విసిగి వేసారిన తల్లీకొడుకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవి, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కరణం సోమశేఖర్‌రావులు ఆదివారం ప్రకటించారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి చేసిన సేవలకు తమకు గుర్తింపు లభించడం లేద న్న ఆవేదనతో వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నా.. ఇంతవరకు అసెంబ్లీ అభ్యర్థిత్వంపై స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా తీర్చిదిద్ది నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. నాలుగుసార్లు మంత్రి పదవిని నిర్వహించిన కరణం రాంచందర్‌రావు సేవలను చంద్రబాబు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంమంతా మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేసినా పట్టించుకోక పోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తూ... తమను నిర్లక్ష ్యం చేయడం వల్ల ఇప్పటికే తమ కార్యకర్తలంతా అసంతృప్తికి లోనై ఇతర పార్టీలోకి వెళ్లిపోయారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సైతం నియోజకవర్గ స్థాయిలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. దీంతో తమ కేడర్ దెబ్బతినే పరిస్థితికి చేరుకుందన్నారు. ఇదే విషయం చర్చించేందుకు చంద్రబాబు వద్దకు వెళ్లి రెండు రోజులపాటు పడిగాపులు కాసినా అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. గుర్తింపు లభించని పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం ఇష్టంలేక తాము పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
టీడీపీకి కరణం ఫ్యామిలీ ఝలక్
Published Sun, Mar 30 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement