‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖరశాస్త్రి. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్‌లో చేర్పించు’ అంటాడు. ‘‘నిరుత్సాహపరచడం కాదు కానండీ.. మీ అబ్బాయికి సీటు వస్తుందని ఖాయంగా చెప్పలేను’’ అని అప్లికేషన్ పెట్టిన రోజే సోమశేఖర శాస్త్రికి చెప్పాడు ఆఫీస్ క్లర్క్! అది క్రిస్టియన్ కాలేజ్. ఆ కాలేజ్‌లో కొడుక్కి సీటు సంపాదించడం కోసం.. అవసరమైతే వాటికన్ సిటీ నుంచైనా రికమండేషన్ లెటర్ తెచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నాడు సోమశేఖర్. క్రిస్టియన్ కాలేజ్ అంటే అంత గురి సోమశేఖర్‌కి. పద్ధతులు నేర్పిస్తారు. జీవితాన్ని ఒక గాడిలో పడేస్తారు. అందుకే ఎవరైనా.. ‘మా అబ్బాయిని ఎక్కడ చేర్చమంటావ్?’ అని అడిగితే.. ‘మంచి క్రిస్టియన్ కాలేజ్ చూసి చేర్పించు’ అని చెప్పడు సోమశేఖర్. ‘ఏదో ఒక క్రిస్టియన్ కాలేజ్‌లో చేర్పించు’ అంటాడు.
అడ్మిషన్స్ క్లోజ్ చేస్తుండగా చివరి వడపోతలో అవంత్‌కి సీటొచ్చింది! ‘‘అదృష్టం. మీ వాడికి ముందున్న అప్లికెంట్ క్యాన్సిల్ చేసుకోవడంతో ప్రయారిటీ లిస్ట్‌లో మీ వాడికొచ్చింది’’ చెప్పాడు క్లర్క్. ‘‘సంతోషం’’ అన్నాడు సోమశేఖర్. అయితే అవంత్ సంతోషంగా లేడు. అతడి ఫ్రెండ్స్ వేరే కాలేజ్‌లో చేరారు. ‘అందరం ఒకే కాలేజ్‌లో చేరదాం’ అని ఇంటర్‌లో ఫైనల్ ఎగ్జామ్ రాసిన రోజే అనుకున్నారు ఫ్రెండ్సంతా. అదొక బాధ ఉండిపోయింది అవంత్‌లో. మామూలు బాధ కాదు. మనోవేదన.
మొదటిరోజు కాలేజ్ అంతా తిప్పిచూపించారు కొత్త విద్యార్థులకు. విద్యార్థులు కొత్తే కానీ, కాలేజీ కొత్తదేం కాదు. ఓ డెబ్భై ఏళ్ల నుంచి ఉంది. కాలేజీ అనే కానీ, యూనివర్శిటీ క్యాంపస్‌లా ఉంటుంది. బయటి ప్రపంచానికి కనిపించదు. అడవి మధ్యలో ఉన్నట్లు ఉంటుంది. క్యాంపస్‌లోనే కాలేజ్ బిల్డింగ్‌లకు కొద్ది దూరంలో హాస్టల్స్. వాటిల్లో అరల్లాంటి గదులు. ఆ గదుల్లో ఒక గది అవంత్‌ది. గదికి ఒక్కరే ఉంటారు. కాలేజ్‌లో చేర్పించి, బస్సెక్కి వెళ్లేటప్పుడు కొడుక్కి చెప్పాడు సోమశేఖర్.. ‘‘ఇప్పుడు లోపలికి వెళ్తున్నావ్. డిగ్రీ సర్టిఫికెట్‌తోనే మళ్లీ నువ్వు బయటికి రావడం’’ అని. ఆయన ఉద్దేశం ‘అంత గొప్ప కాలేజ్ ఇది’ అని చెప్పడం. రెండో రోజు కూడా అవీ ఇవీ చూపించి, కొత్త విద్యార్థులందర్నీ.. వేరుగా ఉన్న ఒక క్లాస్‌రూమ్ దగ్గరకి తీసుకెళ్లారు. ఆ రూమ్‌కి తాళం వేసి ఉంది. మిగతా క్లాస్‌రూమ్‌లన్నీ రిన్నొవేషన్‌తో నిన్న మొన్న కట్టినట్లు కొత్తవిగా ఉంటే, అదొక్కటీ పాతదిగా ఉంది. గోడమీద ‘సుబ్బరామయ్య క్లాస్ రూమ్’ అని రాసి ఉన్న చిన్న బోర్డు ఉంది. ‘‘ముప్ఫై ఏళ్ల క్రితం ఈ క్లాస్‌రూమ్‌లోనే సుబ్బరామయ్య మాస్టారు పాఠాలు చెప్పేవారు. ఈ కాలేజీకి మాస్టారిగా రాక ముందు సుబ్బరామయ్య గారు ఈ కాలేజీలోనే విద్యార్థి. లెక్చరర్ అయ్యాక.. విద్యార్థులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయనకే చెప్పుకునేవారు. అందుకే సుబ్బరామయ్యగారు చనిపోయాక, ఆయన క్లాస్‌రూమ్‌ని ఆయనకే ఉంచేసింది కాలేజ్ యాజమాన్యం. ఇందులో తరగతులు జరగవు. ఏ విద్యార్థికైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం క్లాస్‌రూమ్ తాళాలిచ్చి కాసేపు లోపల కూర్చొని రమ్మని పంపుతారు. అదొక సంప్రదాయంగా వస్తోంది. సుబ్బరామయ్యగారే ఇప్పటికీ లోపల ఉండి, కష్టం చెప్పుకోడానికి వచ్చిన విద్యార్థి కన్నీళ్లు తుడిచి పంపిస్తాడని ఒక నమ్మకం’’ అని చెప్పాడు గుంపును తీసుకొచ్చిన లెక్చరర్. ‘‘అంటే సార్.. సుబ్బరామయ్య మాస్టారి ఆత్మ లోపల తిరుగుతోందా?’’ అని అడిగాడో విద్యార్థి. ఆ గది వైపు పరిశీలనగా చూశాడు అవంత్.
మూడో రోజు నుంచి రెగ్యులర్ క్లాసులు. ఈసురోమంటూ బుక్స్ పట్టుకుని కాంపౌండ్‌లో తన హాస్టల్ రూమ్ నుంచి కాలేజ్ బిల్డింగ్ వైపు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అవంత్. అతడి మనసంతా.. ఊరికి దగ్గర్లో తన ఫ్రెండ్స్ చేరిన కాలేజ్‌లోనే ఉంది. ‘‘బాబూ.. ఇలారా..’’ కాంపౌండ్‌లో చెట్టుకింద అరుగు మీద కూర్చొని ఉన్న ఓ ముసలాయన.. అవంత్‌ని పిలిచాడు. తలంతా నెరిసి, మనిషి వంగిపోయి ఉన్నాడు.అవంత్ ఆయన దగ్గరకు వెళ్లాడు. ‘‘కూర్చో’’ అన్నాడు ఆ మనిషి. కూర్చున్నాడు. ‘‘ఏంటలా ఉన్నావు?’’ అని అడిగాడు. ‘‘మీరెవరు?’’ అడిగాడు అవంత్. నవ్వాడాయన. ‘‘నేనెవర్నీ కాదు.ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిపోతుంటాను’’ అన్నాడు. ‘‘మీరెందుకు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు?’’ అడిగాడు అవంత్. ‘‘నలభై ఏళ్ల క్రితం నేనూ ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పాఠాలు చెప్పాను. అందుకే అప్పుడప్పుడూ వచ్చి, కాసేపు కూర్చొని వెళుతుంటాను. మనసులో నీకేదైనా కష్టం ఉంటే అలా దిగాలుగా ఉండకు. ఎవరికైనా చెప్పుకో’’ అన్నాడు. మౌనంగా ఉన్నాడు అవంత్. ‘‘పోనీ.. నాకు చెప్పు’’ అన్నాడు. అవంత్ చెప్పలేదు. క్లాస్‌రూమ్‌కి వెళ్లిపోయాడు. క్లాస్‌లన్నీ అయ్యేసరికి సాయంత్రం అయింది. అవంత్‌కి మాత్రం ఒక ఏడాది అయినట్లుగా ఉంది. అంత భారంగా కూర్చున్నాడు. అక్కడి నుంచి అతడు నేరుగా హాస్టల్‌కి వెళ్లలేదు. లెక్చరర్స్ క్వార్టర్స్‌కి వెళ్లాడు. అక్కడి నుంచి ‘సుబ్బరామయ్య క్లాస్‌రూమ్’ తాళాలు అడిగి తెచ్చుకున్నాడు.
తాళాలు తీసి ‘సుబ్బరామయ్య క్లాస్‌రూమ్’లోకి వెళ్లి కూర్చున్నాడు అవంత్. క్లాస్‌రూమ్‌లో ఉన్నట్లే మూడు వరుసల్లో బెంచీలు ఉన్నాయి. మధ్య వరుసలో ముందు బెంచీలో కూర్చున్నాడు. ఎదురుగా డయాస్ మీద లెక్చరర్ కూర్చునే కుర్చీ ఉంది. వెనుక పెద్ద బ్లాక్ బోర్డు. కాసేపలా కూర్చున్నాడు. తర్వాత బెంచీకి తల ఆన్చి కళ్లు మూసుకున్నాడు. ‘ఎందుకు నాన్నా.. నా ఫ్రెండ్స్ చదివే కాలేజ్‌లో నన్ను చేరనివ్వలేదు?’ అని బాధగా అనుకున్నాడు. డయాస్ మీద కుర్చీ కదిలిన చప్పుడైంది. కళ్లు తెరిచి, తల పైకెత్తి చూశాడు. ఎ.. దు..రు.. గా.. కుర్చీలో..!!
దఢేల్మని తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు అవంత్. క్లాస్‌రూమ్‌కి తాళం వేశాడు. పరుగు పరుగున నడుస్తూ ఓ చోట ఆగాడు. పూర్తిగా చీకటి పడకుండానే కాంపౌండ్‌లో లైట్లు వెలిగాయి. ఇంటికి ఫోన్ చేశాడు అవంత్. అవంత్ తల్లి లిఫ్ట్ చేసింది. ‘‘అమ్మా.. నాన్నకెలా ఉంది?’’ అని అడిగాడు. ‘‘ఏంట్రా ఆ కంగారు? నాన్నకెలా ఉంటుంది? బాగానే ఉంది. సంతోషంగా ఉన్నారు. కాలేజీలో నీకు సీటొచ్చినట్లు లేదాయనకి. ఆయనకే వచ్చినట్లుంది. ఇదిగో మాట్లాడు’’ అంది ఆవిడ. ‘‘నాన్నా.. ఎలా ఉన్నావ్?’’.. అడిగాడు అవంత్, సోమశేఖర్ లైన్‌లోకి రాగానే. పెద్దగా నవ్వాడాయన. ‘‘నువ్వెలా ఉన్నావో చెప్పరా. కాలేజ్ ఎలా ఉంది?’’ అన్నాడు. ‘‘బాగుంది నాన్నా.. చాలా బాగుంది. మళ్లీ చేస్తా’’ అని ఫోన్ కట్ చేశాడు అవంత్.
మర్నాడు హాస్టల్ నుంచి కాలేజ్‌కి నడుస్తుంటే మళ్లీ ఆ ముసలాయన అక్కడే కూర్చొని కనిపించాడు అవంత్‌కి. ‘‘ఒక్కరోజులో అలవాటు పడినట్లున్నావ్ కాలేజ్‌కి. ముఖంలో సంతోషం కనిపిస్తోంది. ఏదో జరిగింది కదా’’ అన్నాడు ఆయన. అవంత్ ఆయన వైపే పరిశీలనగా చూసి, ‘ఈయనగానీ సుబ్బరామయ్య మాస్టారు కాదు కదా’ అనుకున్నాడు. అనుకుని...‘‘లేదు, ఏం జరగలేదు’’ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు.వెళుతున్న అవంత్‌నే సంతృప్తిగా చూస్తూ.. ‘ఎవరికి ఎవరి చేత చెప్పించాలో వారి చేతే చెప్పించాలి’ అనుకున్నాడు ముసలాయన.
- మాధవ్ శింగరాజు
సుబ్బరామయ్య
Published Sun, Nov 25 2018 1:22 AM | Last Updated on Sun, Nov 25 2018 1:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment