కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను కొల్లగొట్టింది, అమ్ముకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తమతో గుంటూరు, విజయవాడ వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన క్రైస్తవ ఆస్తుల వివరాలు ఇస్తామని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. శుక్రవారం కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత సీఎం జగన్‌దని చెప్పారు. అమరావతిలో దళితుల అసైన్‌మెంట్ భూములను చంద్రబాబు భయపెట్టి బలవంతంగా గుంజుకున్నాడన్నారు. రేపల్లెలో 400 దళిత కుటుంబాలను వెలివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.
చివరికి దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి అవమానించిన వ్యక్తి ఆయన కాదా... అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్‌ను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, వైఎస్సార్‌సీపీ నాయకులు యాట ఓబులేసు, సత్తిరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment