అయినా మత సామరస్యానికి కట్టుబడి ఉన్నా
తమిళనాడు డిప్యూటీ సీఎం పునరుద్ఘాటన
మత భావోద్వేగాలను రాజకీయం చేస్తున్నారని ఆవేదన
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పోలీసు కేసులు ఎదుర్కొన్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ యువనేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో గురువారం జరిగిన క్రిస్మస్ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. తనను తాను గర్వించదగిన క్రైస్తవుడిగా ప్రకటించుకున్నారు. తనకు అన్ని మతాలు సమానమని, మత సామరస్యానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. మతం పేరుతో విభజించేవారిని, విద్వేషాన్ని చిమ్మేవారికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.
నాకు అన్ని మతాలు సమానం
‘గత ఏడాది క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నేను క్రిస్టియన్‌నని సగర్వంగా చెప్పాను. ఇది పలువురు సంఘీలకు చిరాకు తెప్పించింది. ఈ రోజు మళ్లీ చెబుతున్నా. నేను గర్వించదగిన క్రైస్తవుడిని. నేను క్రిస్టియన్‌ని అని మీరు అనుకుంటే, క్రిస్టియన్‌ని. ముస్లింనని మీరు అనుకుంటే, ముస్లింను. హిందువు అనుకుంటే, నేను హిందువును. నాకు అన్ని మతాలు సమానం. అన్ని మతాలు మనకు ప్రేమను చూపించడమే నేర్పుతాయి’అని నొక్కి చెప్పారు.
బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు
మతాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునే వారు విద్వేషాలు, విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. ‘ఇటీవల అలహాబాద్‌కు చెందిన ఓ న్యాయమూర్తి ఒక మతాన్ని కించపరిచేలా మాట్లాడటం చూశాం. ఆయన ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి న్యాయమూర్తి పదవిలో ఉంటే ఆయన కోర్టులో న్యాయం ఎలా ఆశిస్తాం?’ అని ప్రశ్నించారు.
ఆయనను తొలగించడానికి లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి కాంగ్రెస్, డీఎంకే ఎంపీలు సంతకాలు చేసినా, అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం సంతకాలు చేయలేదన్నారు. ‘‘బీజేపీకి బానిసలుగా కొనసాగుతున్నారు కాబట్టే.. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ చేసిన తీర్మానానికి అన్నాడీఎంకే మద్ధతివ్వలేదు’’ అని అన్నాడీఎంకేను విమర్శించారు.
చదవండి: మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
బీజేపీ–అన్నాడీఎంకే మధ్య రహస్య పొత్తు కొనసాగుతోందని, రాజ్యాంగ విలువల కంటే రాజకీయ విధేయతకే అన్నాడీఎంకే ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. కాగా, సనాతన ధర్మంపై గతేడాది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయనపై చాలా చోట్ల పోలీసు కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment