శిల్పా నాగ్, రోహిణి సింధూరి
మైసూరు: జిల్లాధికారి రోహిణి సింధూరిపై ఆరోపణలు చేసి తన ఉద్యోగానికి రాజీనామ చేసిన మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్‌ను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ శుక్రవారం సుత్తూరు మఠానికి పిలిపించారు. సుత్తూరు మఠం స్వామీజీ నేతృత్వంలో శిల్పానాగ్‌తో చర్చించారు. తొలుత రాజీనామా ఉపసంహరించుకుని, ఇకపై ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని శిల్పానాగ్‌కు మంత్రి సూచించారు. కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను అంగీకరించొద్దని సీఎం, సీఎస్‌కు మనవి చేస్తానని జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ తెలిపారు. నీతి, నిజాయతీ కలిగిన అధికారి రాజీనామాను అంగీకరిస్తే వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. పాలికె కమిషనర్ శిల్పానాగ్ రాజీనామాను ఆమోదించవద్దని కోరుతూ శుక్రవారం పాలికె కార్యాలయం వద్ద సిబ్బంది సంతకాల సేకరణ చేపట్టారు. కలెక్టర్ రోహిణి సింధూరి సర్వాధికారిలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రోహిణి సింధూరిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఉద్యోగానికో దండం.. రాజీనామా చేస్తున్నా)
ఆలోచించే రాజీనామా చేశా: శిల్పానాగ్
తాను బాగా ఆలోచించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు మైసూరు మహానగర పాలికె కమిషనర్ శిల్పానాగ్ స్పష్టం చేశారు. తానేమీ ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదని, కోవిడ్ వంటి సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయాల్సి రావడం బాధిస్తోందని చెప్పారు. సీఎస్‌ఆర్ ఫండ్స్‌కు ఎవరూ బాధ్యత తీసుకోలేదని, తానే బాధ్యత తీసుకుని కరోనా రోగులకు ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు.
నిధుల వివరాలు అడగడం తప్పా? : కలెక్టర్
సీఎస్‌ఆర్ ఫండ్ కింద ఖర్చు చేసిన రూ.12 కోట్ల గురించి వివరాలు అడగడం తప్పా అంటూ జిల్లాధికారిణి రోహిణి సింధూరి ప్రశ్నించారు. శుక్రవారం నగరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఈ వారం గ్రామాలకు వైద్యులు అనే కార్యక్రమానికి సీఎస్‌ఆర్ ఫండ్స్ వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను ఎలా వ్యయం చేశారనే విషయంపై వివరాలు ఇవ్వాలని కోరగా మైసూరు పాలికె కమిషనర్ శిల్పానాగ్ ఇప్పటివరకు బదులు ఇవ్వలేదన్నారు. తనపై అసంతృప్తి ఉంటే ఫిర్యాదు చేసేందుకు ఒక పద్ధతి, వ్యవస్థ ఉంటుందని, దాన్ని అనుసరించి వ్యవహరించాలని సూచించారు. ఈ విషయాలన్నింటి గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరిస్తానని ఆమె తెలిపారు.
మైసూర్‌లో శిల్పా నాగ్‌కు మద్దతుగా సంతకాలు చేస్తున్న ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment