హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
బెళుగుప్ప: కాలువపల్లి వద్ద ఈ నెల 22న జరిగిన హరిజన సోమశేఖర్ (25)దారుణ హత్య కేసులో ప్రదాన నిందితుడు హరిజన ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బెళుగుప్ప పోలీస్‌స్టేషన్లో సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ నాగస్వామిలు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీఐ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వరుసకు అక్క అయిన ఆంజనేయులు భార్య వరలక్ష్మితో సోమశేఖర్ మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. మందలించి, మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో అతడిని కడతేర్చాలని ఆంజనేయులు పథకం వేశాడు.
సమీప బంధువులైన ఆత్మకూరుకు చెందిన హరిజన నాగరాజు, కాలువపల్లికి చెందిన హరిజన కిరణ్, హరిజన పెద్దన్నలతో కలసి ఈ నెల 22న సాయంత్రం గ్రామ సమీపంలోని ముళ్లపొదల వద్ద సోమశేఖర్‌పై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం రామసాగరం క్రాస్ వద్ద ప్రధాన నిందితుడు ఆంజనేయులును ఎస్‌ఐ నాగస్వామి తమ సిబ్బందితో కలసి అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ శివప్రసాద్ తెలిపారు. ప్రధాన నిందితుడిని కళ్యాణదుర్గం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారన్నారు.