మొయినాబాద్ (రంగారెడ్డి): చిలుకూరులోని బాలాజీ బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సాయంత్రం పుట్టమన్ను తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆలయ అర్చకులు పూర్తి చేశారు. శేష, హనుమంత, సూర్యప్రభ, గరుడ, గజ, పల్లకీ, అశ్వ వాహనాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానంలేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని.. ప్రసాదం స్వీకరించే మహిళలు ఉదయం 8 గంటలకే చిలుకూరు ఆలయానికి చేరుకోవాలని అర్చకుడు రంగరాజన్ తెలిపారు.