విజయ డెయిరీ చైర్మన్‌గా భూమా నారాయణరెడ్డి
- 23వ సారి ఏకగ్రీవంగా ఎన్నిక
నంద్యాలరూరల్: జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సమితి (విజయడెయిరీ) అధ్యక్షునిగా 23వ సారి భూమా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నంద్యాల విజయ డెయిరీ పరిపాలన భవనంలో ఈ ఎన్నిక జరిగింది. ఏటా మూడు డైరెక్టర్ స్థానాలకు రొటేషన్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎం.కృష్ణాపురం పాల కేంద్రం అధ్యక్షుడిగా బాలీశ్వరరెడ్డి, శిరివెళ్ల పాలకేంద్రం అధ్యక్షుడిగా సుబ్బరాయుడు, సంజామల పాల కేంద్రం అధ్యక్షుడిగా రామకృష్ణుడు నామినేషన్లను దాఖలు చేయగా వీరికి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి హరిబాబు ప్రకటించారు. అనంతరం కొత్త డైరెక్టర్లతో పాటు మిగతా డైరెక్టర్లు సమావేశమై.. భూమా నారాయణరెడ్డిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2017–18సంవత్సరానికి 331లక్షల లీటర్ల పాల సేకరణ, 380లక్షల లీటర్ల పాల అమ్మకాల లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 2015–16లో 294లక్షల లీటర్ల పాల సేకరణ చేశామని, 378లక్షల లీటర్ల పాలు అమ్మకం జరిపి రూ.181కోట్ల వ్యాపారం చేశామన్నారు. గత ఏడాది పాల దిగుబడి పెంపునకు, సాంకేతిక వనరుల కోసం రూ.48.83లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.80.33లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. విజయ డెయిరీ ఎండీ ప్రసాదరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, మార్కెటింగ్ డీజీఎం సుబ్రమణ్యం, ప్లాంట్ డీజీఎం శంకర్‌రెడ్డి, ప్రొటెక‌్షన్ డీజీఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్యాంసన్‌బాబు, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.