పెద్ద కష్టాలు | big problems | Sakshi
Sakshi News home page

పెద్ద కష్టాలు

Published Fri, Nov 11 2016 12:06 AM | Last Updated on Fri, Oct 5 2018 6:40 PM

పెద్ద కష్టాలు - Sakshi

పెద్ద కష్టాలు

 సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి బ్యాంకుల్లో రూ.500, రూ.వెయ్యి పాత నోట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైంది. మరోవైపు ప్రజల వద్ద ఉన్న పాత నోట్లలో రోజుకు రూ.4 వేలు మాత్రమే (బ్యాంక్‌ అకౌంట్‌తో సంబంధం లేకుండా) మార్చుకునే అవకాశం కల్పించగా, జనం గుర్తింపు కార్డుల్ని వెంట తెచ్చుకుని బ్యాంకుల ఎదుట బారులు తీరారు. తమ ఖాతాల్లోని సొమ్ముల నుంచి రోజూకు రూ.10 వేలు (వారానికి గరిష్టంగా రూ.20 వేలు మాత్రమే) తీసుకునే అవకాశం ఇవ్వడంతో అనేకమంది బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలతో ఉదయం 9గంటల నుంచే క్యూ కట్టారు. జిల్లాలోని అన్ని బ్యాంక్‌ శాఖలవద్ద ఇదే పరిస్థితి కనిపిం చింది. కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం తొలి రోజున బ్యాంకుల ముందు నిలబడిన వారిలో పేద, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. తమ వద్ద ఉన్న సొమ్మును బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసుకునేందుకు వచ్చిన వారు సైతం అధికంగానే ఉన్నారు. చాలామందికి పాన్‌ కార్డు లేకపోవడంతో గరిష్టంగా రూ.49 వేల చొప్పున జమ చేసినట్టు బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గురువారం పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రమే రావడంతో డిపాజిట్ల రూపంలో రూ.100 కోట్ల వరకు వ్యక్తిగత ఖాతాల్లో జమ అయినట్టు అంచనా. ప్రధాన బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండగా, మిగిలిన చోట్ల పెద్దగా కనిపించలేదు. ధనవంతులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, చేపలు, రొయ్యల ఎగుమతిదారులు, ఆక్వా రైతులు బ్యాంకుల వద్ద కనిపించలేదు. రోజువారీ అవసరాలకు సొమ్ము అవసరమైన వారు మాత్రమే వచ్చారు. ప్రతి బ్యాంకు వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ బ్యాంకర్లతో సమావేశమై చర్చించారు. 
కొత్త నోట్లు కొన్నే..
జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోను అప్పటికే ఉన్న రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను మాత్రమే ఖాతాదారులకు ఇచ్చారు. బ్యాంకులో ఉన్న నోట్లన్నీ పంపిణీ చేసిన అనంతరం రూ.500, రూ.2,000 కొత్త నోట్లు ఇవ్వాలని బ్యాంక్‌ అధికారులు భావించారు. ఈ కారణంగా కొన్ని బ్యాంకుల్లో మాత్రమే కొత్త నోట్లు లభ్యమయ్యాయి. ఈ నెల 19 వరకూ కొత్తనోట్లను అన్ని బ్యాంకులకు పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. మరోవైపు త్వరలో రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కూడా మారుస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించడంతో చిన్న నోట్లు ఎక్కువ మొత్తంలో దాచుకుందామనుకున్న వారు ఆలోచనలో పడ్డారు. నరసాపురంలోని బ్యాంక్‌లకు కొత్త నోట్లు గురువారం మధ్యాహ్నం వరకూ రాలేదు. దీంతో రూ.10, రూ.20, రూ.100 నోట్లు మాత్రమే ఇచ్చారు. మధ్యాహ్నం నుంచి రూ.2 వేల నోట్లు పంపిణీ చేశారు. రాత్రి వరకూ బ్యాంక్‌ల వద్ద రద్దీ కొనసాగింది. నగదు జమ, చెల్లింపుల కోసం అన్ని బ్యాంకుల్లోనూ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. 
తీరని కొరత
బ్యాంకుల్లో పాత నోట్లు మార్చుకునే ప్రక్రియ ప్రారంభమైనా చిల్లర కొరత తీరలేదు. పెట్రోల్‌ బంకుల్లో రూ.500కు సరిపడా ఆయిల్‌ నింపుతున్నారు. చిన్న వ్యాపారాలు రెండో రోజు కూడా మందకొడిగానే సాగాయి. బంగారం, తాకట్టు వ్యాపారాలతోపాటు సినిమాహాళ్లు, వాణిజ్య కేంద్రాలు బోసిపోయాయి. పాన్‌కార్డుతో ఎంత మొత్తమైనా జమ చేసే అవకాశం ఉన్నా విత్‌డ్రా చేసుకునే పరిమితి చాలా తక్కువ ఉండటంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. జనం ఇబ్బందులను ఆసరా చేసుకుని దళారులు రంగంలోకి దిగారు. రూ.వెయ్యికి  రూ.200, రూ.500కు రూ.100 కమీషన్‌ తీసుకుని పాత నోట్లు స్వీకరిస్తున్నారు. వివాహాలు, గృహ ప్రవేశం, గృహ నిర్మాణం, పొలం అమ్మకాలు, కొనుగోళ్ల కోసం ఇళ్లల్లో పెద్ద మొత్తంలో సొమ్ము దాచుకున్న వారు వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. తెల్లారితే పెళ్లి జరగాల్సిన కుటుంబాలు కూడా నోట్ల మార్పిడి నిలిచిపోవడంతో ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నాయి. అక్రమార్జన ద్వారా నల్లధనం కూడబెట్టిన ప్రజాప్రతినిధులు వాటిని ఎలా మార్చాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. 20 నుంచి 30 శాతం కమీషన్‌ ప్రాతిపదికన పెద్ద మొత్తాల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ఒక టిప్పర్‌లో కరెన్సీ కట్టలు పెట్టుకుని మార్చడం కోసం తిరిగినట్టు ప్రచారం జరిగింది. డిసెంబర్‌ 30లోగా తమ వద్ద ఉన్న అక్రమార్జనను మార్చుకునేందుకు వారు ఇప్పటి నుంచే దారులు వెతుకుతున్నారు.  
 
 
 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement