చనిపోయిన మల్లికార్జున
మదనపల్లె టౌన్: ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రైతు దుర్మరణం చెందిన సంఘటన పీటీఎంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు... పీటీఎంకు చెందిన బందార్ల సూర్యనారాయణ కుమారుడు మల్లికార్జున(43) వ్యవసాయంతోపాటు ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ భార్య సత్యవతి, కుమార్తెలు శ్రావణి, నందిని, కావ్య, లహరి, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. రోజూ మాదిరిగానే సొంత పనిమీద కందుకూరుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని మద్దయ్యగారిపల్లె మలుపు వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రైతును 108 సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి తరలిస్తుండగా మల్లికార్జున మృతిచెందాడు. పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడిన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.