8 నుంచి జిల్లా అధికారులకు బయోమెట్రిక్
నెల్లూరు(పొగతోట):
కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌డే, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలకు హాజరయ్యే జిల్లా అధికారులకు ఈ నెల 8వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రీవెన్స్‌డేకు జిల్లా అధికారులు కొందరు హాజరుకాకుండా కింది స్థాయి ఉద్యోగులను గ్రీవెన్స్‌కు పంపుతున్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో సమస్యలపై జిల్లా కలెక్టర్ నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత వారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. దీంతో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా అ«ధికారుల కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. 150 మంది జిల్లా అధికారులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్ డేటా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలలోపు అధికారులు కలెక్టరేట్‌కు రావాల్సి ఉంది. డయల్ యవర్ కలెక్టర్ కార్యక్రమానికి సంబంధించి 1800 425 2499 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది.