కళాశాలల్లో బయోమెట్రిక్
- ఆధార్‌తో అనుసంధానం
- ఇంజనీరింగ్, వృత్తి విద్యాకాలేజీల్లో అమలు
- అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు వర్తింపు
కానూరు (పెనమలూరు): రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు వృత్తివిద్యా కోర్సులు ఉన్న కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు విద్యార్థులకు బమోమెట్రిక్‌తో హాజరు అమలు చేస్తామని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ బి. ఉదయలక్ష్మి అన్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం పీవీపీ సిద్ధార్థ, జేఎన్టీయు కాకినాడు సంయుక్తంగా ‘ఆధార్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్’ అనే అంశం పై సమావేశం జరిగింది. ఇందులో ఆమె మాట్లాడుతూ కాలేజీలో బయోమెట్రిక్ పద్ధతితో హాజరు తీస విధానాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నామన్నారు. దీంతో హాజరు వివరాలు కాలేజీ యాజమాన్యం, ప్రభుత్వానికి నేరుగా అందుతాయని వివరించారు. ప్రతి కాలేజీ పరిశ్రమలకు అనుసంధానంగా ఉండాలని, దీని వల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని తెలిపారు.
విదేశీ అధ్యాపకులతో బోధన
విదేశాల నుంచి వచ్చి అధ్యాపకులు ఇక్కడ పాఠాలు చెబుతారని, కేంద్ర ప్రభుత్వం నూతన పథకం అమలు చేస్తుందని ఉదయలక్ష్మి చెప్పారు. ప్రతి కాలేజీలో ఇంకుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి పరిశోధనలకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాలేజీల్లో ఇన్నవేటివ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్‌ఐఆర్‌ఎఫ్)తో ప్రతి కాలేజీకి ర్యాంకింగ్ ఇస్తారని, దీంతో విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ సమావేశంలో జేఎన్‌టీయు డైరెక్టర్ దక్షణమూర్తి, జెన్‌టీయు ప్రొఫెసర్‌లు ప్రభాకర్, జెవి.రమణ, చక్రవర్తి, ఎన్‌ఐసీ ప్రతినిధి సత్యసాయిబాబు తదితరులు పాల్గొన్నారు.