
సాక్షి, అమరావతి: ఇప్పటికైతే ‘తానొక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడిని’ అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని తాను అంగీకరిస్తున్నానని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడారు. రాజకీయాల్లో విఫలమయ్యానని తానేమీ బాధపడడం లేదన్నారు.
తాను కనీసం ప్రయత్నం చేశానని అనుకుంటానన్నారు. ఫెయిల్యూర్ కూడా సగం విజయంతో సమానమని భావిస్తున్నానని తెలిపారు. సినిమాల్లో హీరోగా నటించాలని తాను ఎప్పుడూ కోరుకోలేదన్నారు. తన మొదటి సినిమా ఫ్లాప్ అయిందని గుర్తుచేశారు. ఆ అపజయం తర్వాత కూడా తానెప్పుడూ నిరుత్సాహపడలేదన్నారు. తన విజయాల గ్రాఫ్ ఏడో సినిమా తర్వాత మాత్రమే పెరిగిందని తెలిపారు. ఆ తర్వాత కూడా ఆరేడేళ్లపాటు అపజయాలనే చవిచూశానన్నారు.
ఆ తర్వాతే ‘గబ్బర్ సింగ్’ సినిమా విజయం దక్కిందని వెల్లడించారు. జీవితంలో అపజయాలు, విజయాలు సర్వసాధారణమన్నారు. విజయం కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తతతో ఉంటూ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఏ విద్యార్థులకు సూచించారు. తాము ఊహించే ఉద్యోగం దొరక్కపోవచ్చని, దొరికిన ఉద్యోగంలోనే తమ విజయాన్ని వెతుక్కోవాలన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ‘అపజయం ఎదురైనా చింతించవద్దు.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు’ అని పవన్ సూచించారు.
చదవండి: ('నేనున్నాను'.. మీకేం కాదు)