బల్దియాలో బయోమెట్రిక్
-
ఉద్యోగుల వేలి ముద్రలు సేకరిస్తున్న అధికారులు
-
రెండు రోజుల్లో వినియోగంలోకి
కోల్‌సిటీ : రామగుండం బల్దియా బయోమెట్రిక్ అమలుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో ఉద్యోగులకు బయోమెట్రిక్ భయం పట్టుకుంది... సమయపాలన పాటించకుండా, విధులకు సక్రమంగా రాకండా తప్పించుకు తిరుగుతున్న వారి బండారం బయోమెట్రిక్‌తో బయటడనుంది.
– మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగులు, సిబ్బంది సమయపాలనకు థంబ్‌ఇంప్రేషన్ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ డి.జాన్‌శ్యాంసన్ తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికుల నుంచి గురువారం వేలిముద్రలు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు కిశోర్, పవన్ సేకరించారు. కార్యక్రమాన్ని కమిషనర్ స్వయంగా పరిశీలించారు. తాత్కాలిక కార్మికులతోపాటు పర్మినెంట్ కార్మికులు, ఉద్యోగులు, అధికారుల వేలి ముద్రలు సేకరిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తొలత పారిశుధ్య కార్మికులకు శుక్రవారం నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 364 మంది ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు, 56 మంది పీహెచ్ వర్కర్లకు కార్పొరేషన్ కార్యాలయం, గోదావరిఖని పోచమ్మగుడి ఆవరణ, ఎన్టీపీసీ, రామగుండం, ౖయెటింక్లయిన్‌కాలనీలలో ఐదుచోట్ల జోన్లవారీగా ఇక నుంచి బయోమెట్రిక్ యంత్రం ద్వారా హాజరు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సమయపాలన పాటించడంతోపాటు హాజరు రిజిస్టర్ అక్రమాలను అరికట్టడానికి దోహదపడుతుందని తెలిపారు. రెండ్రోజుల్లో మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక, శాశ్వతపు ఉద్యోగులు, అధికారులకు కూడా వేలి ముద్రలు సేకరించి త్వరలో చేయనున్నట్లు తెలిపారు.
రెండుసార్లు వేలిముద్రల సేకరణ...
ఇదే తరహాలో గతంలో కూడా అధికారులు బయోమెట్రిక్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పి పది బయోమెట్రికల్ యంత్రాలను కొనుగోలు చేశారు. శానిటేషన్ కార్మికుల నుంచి వేలిముద్రలు సేకరించారు. అయితే ఈ బయోమెట్రిక్ యంత్రాలు మోరాయించడంతో వాటిని నిలిపివేశారు. ఇప్పుడు మరోసారి కొత్త యంత్రాలను తెప్పించిన అధికారులు వేలిముద్రలను సేకరిస్తున్నారు. ఈసారైనా అధికారులు చిత్తశుద్ధితో వేలిముద్రల యంత్రాలను వినియోగంలోకి తీసుకొస్తారో లేదో వేచి చూడాలి.