బడిలోనూ బయోమెట్రిక్‌ | biometric in schools | Sakshi
Sakshi News home page

బడిలోనూ బయోమెట్రిక్‌

Published Thu, Dec 29 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

బడిలోనూ బయోమెట్రిక్‌

బడిలోనూ బయోమెట్రిక్‌

- తప్పుబడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
- తప్పదంటున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు

కదిరి : సర్కారు బడి అనగానే ఉపాధ్యాయులు ఎప్పుడైనా వస్తారు.. ఎప్పుడైనా వెళ్తారనే అపవాదు జనంలో నాటుకుపోయింది. బడికి ఆలస్యంగా వెళ్లేవారు కొందరైతే, రాజకీయ పలుకుబడితో అసలే వెళ్లని వారూ కొందరున్నారని, వారంలో మూడు రోజులు ఒకరు వెళ్తే, మిగతా మూడురోజులు మరొకరు వెళ్తున్నారని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. మరికొందరు ఉపాధ్యాయులు తమకు బదులుగా వారి స్థానంలో ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి సదరు ఎంఈఓలకు సైతం అంతోఇంతో ముట్టజెబుతున్నారన్న సమాచారాన్ని కూడా విద్యాశాఖ పసిగట్టింది. ఈ క్రమంలో అయ్యవార్లను బడికి పరిగెత్తించేందుకు బయోమెట్రిక్‌ విధానాన్ని తీసుకొస్తోంది.

త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు విద్యాశాఖ జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే చెప్పకనే చెప్పేశారు. మండల విద్యాశాఖ అధికారులతో పాటు ఉపాధ్యాయులకు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విషయం అర్థమయ్యేలా చెప్పారు. తొలుత ప్రాథమిక పాఠశాలలను మినహాయించి, మిగిలిన ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీలతో పాటు ఆదర్శ పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. 2017 జనవరి 2 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ ఇంకా జిల్లాలో చాలా పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్‌ ప్రక్రియ పూర్తి కాకపోవడం అడ్డంకిగా తయారైంది.

దీంతో సంక్రాంతిలోపు ఈ తంతు ముగించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆయా మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు సైతం బయోమెట్రిక్‌ అమల్లోకి రానుంది. ఆ రోజుకు ఆధార్‌ వంద శాతం పూర్తయిన ప్రా«థమిక పాఠశాలలను అప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుని వాటిలోనూ బయోమెట్రిక్‌ అమలు చేయనున్నారు. ఇప్పటికే సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల హాజరుపై బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం
జిల్లాలో 3,164 ప్రాథమిక పాఠశాలలు, 1,633 ప్రాథమికోన్నత, ఉన్నత, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రతి మండలంలోనూ ఒక కస్తూరిబా బాలికా విద్యాలయం ఉంది. వీటన్నింటిలో 14,402 మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో ప్రార్థనా సమయానికి ఎంతమంది ఉపాధ్యాయులు హాజరయ్యారు? ఆలస్యంగా ఎందరొచ్చారు? అసలు బడికే రానివారు ఎందరు? సెలవులో ఉన్నదెవరు? అన్న విషయాలు ఎప్పటికప్పుడు బయోమెట్రిక్‌ విధానం ద్వారా మండల, జిల్లాస్థాయి విద్యాశాఖాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. బడికి హాజరు కాకపోయినా హాజరు పట్టికలో సంతకం పెట్టడం లాంటివి ఇక కుదరవని కొం‍దరు ఉపాధ్యాయులే అంటున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసి తీరాలని నిర్ణయించిందని, అమలు చేయక తప్పదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement