కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం
♦ విద్యార్థులు,అధ్యాపకులకూ అమలు
♦ సీసీ కెమెరాల ఏర్పాటుకు విద్యాశాఖ చర్యలు
♦ డిసెంబర్ 31 గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర అన్ని వృత్తి విద్యాకాలేజీల్లో విద్యార్థులతోపాటు అధ్యాపకులకూ ఈ విధానం అమలు చేయాలన్న ఆలోచనకు వచ్చింది. అంతేకాదు అన్ని కాలేజీల్లో సీసీ కెమెరాలను కచ్చితంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ర్యాగింగ్‌కు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని భావిస్తోంది. వచ్చే డిసెంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అలాగే కాలేజీల్లో బోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడంలో భాగంగా పక్కా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల హాజరుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం పలు కాలేజీల్లో వివిధ కోర్సులకు సంబంధించి విద్యార్థుల హాజరు సరిగా లేకపోగా, అధ్యాపకులూ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రైవేటు కాలేజీలు కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రాలుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విద్యా బోధనను గాడిలో పెట్టడంతోపాటు కళాశాలలు సరిగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఇందుకోసం బయోమెట్రిక్ విధానమే సరైందనే భావనకు వచ్చింది. దీనిపై అన్ని కోణాల్లో చర్చించిన ఉన్నతాధికారులు చివరకు అన్ని కాలేజీల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కోర్సులను నిర్వహిస్తున్న కాలేజీలు 7,009 ఉండగా, వాటిల్లో 9 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. ఆయా కోర్సుల్లో వివిధ సంవత్సరాల్లో చదువుతున్న వారు 15 లక్షల మంది వరకు ఉన్నట్లు అంచనా.