బయోమెట్రిక్ ఒట్టిమాటే!
బయోమెట్రిక్ ఒట్టిమాటే!
Published Thu, Oct 6 2016 9:16 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
* రెండున్నరేళ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం
* జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలోనూ అమలుకు నోచుకోని వైనం
* ప్రైౖ వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అమలులో ఉన్న విధానం
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు పకడ్బందీగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ హాజరు నమోదు పేరుతో ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలుచేయడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నరేళ్ల వ్యవధిలో దీనిపై పదే, పదే ప్రకటనలు చేస్తూ వచ్చిన పాలకులు కనీసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడంలోనూ విఫలమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,586 ఉన్నాయి. వాటిలో 3,33,990 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రై వేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన ఫలితాలను సాధించే లక్ష్యంతో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్ హాజరు నమోదును తొలుత ఉపాధ్యాయులకు వర్తింప జేసి తదుపరి దశల్లో విద్యార్థులకు ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదంతా బాగానే ఉన్నా గత రెండేళ్లుగా బయో మెట్రిక్ హాజరు నమోదుకు సంబంధించి జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం ప్రయోగాత్మకంగానైనా ప్రవేశపెట్టలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇందుకు సంబంధించిన పరికరాలను సమకూర్చడంలోనూ విద్యాశాఖ దృష్టి సారించకపోవడం గమనార్హం. పాఠశాల విద్యారంగాన్ని ఆధునికీకరణ బాట పట్టించి పాఠశాలలకు సాంకేతిక సొబగులు అద్దుతామని పదే, పదే చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డిజిటల్ తరగతులు, స్మార్ట్ క్లాసులు అంటూ పదేపదే వల్లిస్తున్న ప్రభుత్వ పెద్ధలు వాటి కంటే ముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుపై దృష్టి సారించాల్సి ఉంది.
ప్రైౖ వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు..
జిల్లాలోని కొన్ని ప్రై వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు ఇప్పటికే అమలవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు వేళకు పాఠశాలకు వస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు బయో మెట్రిక్ వ్యవస్ధ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ దీనిని ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత, పాఠశాలకు సక్రమంగా వెళ్లాలనే స్పృహను విద్యార్థుల్లో రేకెత్తించవచ్చు.
Advertisement
Advertisement