వేలిముద్ర పడుతుందా?
► రేపటి నుంచి పాఠశాలల్లో బయోమెట్రిక్ అమలు
► 922 పాఠశాలకు యంత్రాలు పంపిణీ
► కొద్దిచోట్లే ప్రారంభమయ్యే అవకాశం
నెల్లూరు(టౌన్) : పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 922 ఉన్నత, ప్రాథమికోన్నత, మోడల్ పాఠశాలలకు యంత్రాలను ప్రభుత్వం సరఫరా చేసింది. అయితే దీనికి ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా 346 ఉన్నత, 231 ప్రాథమికోన్నత, 10 మోడల్ స్కూల్స్‌కు ఏప్రిల్ నెలలోనే బయోమెట్రిక్ యంత్రాలను సరఫరా చేశారు. మధ్యాహ్న భోజనంలో అక్రమాలు అరికట్టేందుకు ప్రధానంగా దీనికి శ్రీకారం చుట్టారు. అయితే కొన్ని పాఠశాలకు సరఫరా చేసిన యంత్రాలు బిగించకుండానే మరమ్మత్తులకు గురయ్యాయి. వాటిని రిపేరు చేయాలని పలుమార్లు రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. కొన్ని పాఠశాలల్లో వెబ్‌సైట్ పనిచేయకపోగా మరికొన్ని చోట్ల విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలు లేక బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటుకు అంతారాయం ఏర్పడింది. పదుల సంఖ్యలో పాఠశాలల్లో మాత్రమే యంత్రాలు పనిచేస్తున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ముద్ర పడాల్సిందే..
జూలై 1వ తేదీ నుంచి పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రను వేయాల్సి ఉంది. దీని ఆధారంగానే వారి హాజరును పరిగణలోకీ తీసుకోనున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో వేలిముద్రను తప్పనిసరిగా వేయాల్సి ఉంది. సాయంత్రం 4.45 గంటల సమయంలో బయోమెట్రిక్ యంత్రంకు రెడ్‌లైట్, ఐదుగంటల వరకు ఎల్లో లైటు వెలుగుతుంటుంది. ఐదుగంటల పైనే గ్రీన్ లైటు వెలుగుతుంది. ఈ సమయంలో వేలిముద్ర వేస్తేనే హాజరైనట్లు యంత్రంలో నమోదవుతుంది. ఈ హాజరును ఏ రోజుకారోజు జిల్లా డీఈఓ కార్యాలయానికి పంపుతారు. అయితే ప్రధానోపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరుతో పనిలేదని చెబుతున్నారు. కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే బయోమెట్రిక్ హజరును పరిగణలోకి తీసుకుంటుండంతో ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం హెచ్‌ఎంలకు కూడా హాజరు ఉంటుందని, త్వరలో సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తారంటున్నారు.
అన్ని పాఠశాలల్లో ఏర్పాటు
జిల్లాలోని 922 పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను బిగిస్తాం. ప్రస్తుతం కొన్ని యంత్రాలు మరమ్మతులకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇంటర్నెట్ పనిచేయడం లేదు. ఆ పాఠశాలల్లో కూడా సదుపాయాలు కల్పిస్తాం. – మువ్వారామలింగం, డీఈఓ