వరంగల్‌లో తెలంగాణ విమోచన వేడుకలు
-
బహిరంగ సభకు హాజరుకానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
-
రెండు లక్షల మంది తరలింపునకు ప్రణాళిక
-
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
భీమారం : తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఈనెల 17న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆధ్వర్యాన వరంగల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నారని రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ తెలిపారు. హన్మకొండలోని బాలాజీ గార్డెన్స్‌లో పార్టీ మండల, డివిజన్ల అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ అమిత్‌షా హాజరయ్యే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా తో పాటు కరీంనగర్ జిల్లాల నుంచి కార్యకర్తలను తరలిం చాలని సూచించారు. ఈ సందర్భంగా రెండు లక్షల మం దిని సభకు తరలించనున్నట్లు పార్టీ నాయకులు లక్ష్మణ్‌కు వెల్లడించారు.
అధికార పార్టీని నమ్మడం లేదు...
రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలు నమ్మకం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత ఉండగా.. కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు పూర్తిగా మరిచిపోయారని పేర్కొన్నారు. ఆనాడు సర్దార్ వల్లభాయి పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుంటే ఈరోజు హైదరాబాద్ ప్రత్యేక దేశంగా అవతరించి.. పాకిస్తాన్‌కు సహకారం అందించి ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, మందాడి సత్యనారాయణరెడ్డి, వన్నాల శ్రీరాములుతో పాటు నాయకులు ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, రావుల కిషన్, గురుమూర్తి శివకుమార్, పావుశెట్టి శ్రీధర్, గుండమీది శ్రీనివాస్, ఏనుగుల రాకేష్‌రెడ్డి, కీర్తిరెడ్డి, నరహరి వేణుగోపాల్, చాడా శ్రీనివాస్, రాంచంద్రారెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ వర్సెస్ రూరల్
బీజేపీలో వర్గ పోరు బయటపడింది. బాలాజీ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ రావడానికి ఇరవై నిముషాల ముందు కార్యక్రమం ప్రారంభించారు. ఈ మేరకు గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ మైక్ తీసుకుని అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. ఇదేక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కూ డా ఆహ్వానించినా ఆయన రాలేదు. ఇంతలోనే రూరల్ నాయకులు నిరసన తెలిపారు. సమావేశానికి రూరల్ అధ్యక్షుడు అధ్యక్షత వహించాల్సి ఉండగా గ్రేటర్ అధ్యక్షుడు ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన బయటకు వెళ్తుండగా రాష్ట్ర నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడం వివాదం సద్దుమణిగింది.