
పేదలకు, బడా బాబుల మధ్య ధర్మ యుద్ధం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హన్మకొండ: దేశంలో పేదలు, బడాబాబుల మధ్య ధర్మయుద్ధం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోవ లక్ష్మణ్ అన్నారు. పేదల వైపు ప్రధాని నరేంద్ర మోదీ, బడాబాబుల పక్షాన కాంగ్రెస్ ఉందన్నారు. శుక్రవారం రాత్రి హన్మకొండలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనం నిర్మూలనతో కాంగ్రెస్‌లో భయం పట్టుకుందన్నారు. పెద్దనోట్ల రద్దుతో బయట పడే నల్లధనాన్ని పేదల సంక్షేమానికి, వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేయడానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని, గరీబ్ కళ్యాణ్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు.
దేశంలోని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తుండడంతో పేదలు ఆయనకు అండగా నిలిచారన్నారు. పేదలను అవమానపరిచేలా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రూ.4 కోట్ల కారుపై ఏటీఎంకు వచ్చి రూ.4 వేలు తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు.