
కేసీఆర్ కు రైతుల గోడు పట్టదా?
♦ కరువు విలయతాండవం చేస్తున్నా పట్టింపులేదు
♦ 400 మండలాల్లో తాగునీరు లేక అల్లాడుతున్నారు
♦ రైతుల కోసం ప్రధాని మోదీ రూ.36వేల కోట్లు విడుదల చేశారు
♦ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
మహేశ్వరం: కరువుతో పంటలు పండక రైతులు అల్లాడుతుంటే వారి సంక్షేమాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం మహేశ్వరం మండలం నాగిరెడ్డిపల్లిలో బీజేపీ నిర్వహించిన కిసాన్ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 400 మండలాల్లో తాగు, సాగునీరు లేక జనం కరువుతో అలమటిస్తున్నారని అన్నారు. గ్రాసం లేక రైతులు పశువులను సాగలేక కబేళాలకు తరలిస్తున్నాని అన్నారు. ప్రభుత్వం వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతి ఇంటికీ దీపం పథకం కింద సబ్సిడీ గ్యాస్‌లను అందిస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతి రహిత పాలన చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తుందని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. అంతకుముందు గ్రామంలో ఇంకుడుగుంత నిర్మాణ పనులకు లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు డాక్టర్ లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. పలు సమస్యలపై గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, చింతా సాంబమూర్తి, జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సెన్సార్ బోర్డు సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, సర్పంచ్ మాధవచారి, ఉప సర్పంచ్ రాజు, నాయకులు పాపయ్య, కడారి జంగయ్య యాదవ్, శంకర్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్, మదన్‌మోహన్, విజయలక్ష్మి, సుదర్శన్ యాదవ్, సుదర్శన్‌రెడ్డి, కుండె వెంకటేష్ పాల్గొన్నారు.