'సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దుతున్నారు'
-ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యాన్ని ఒప్పుకోం
-బీజేపీ శాసనసభపక్ష నేత లక్ష్మణ్
జోగిపేట(మెదక్ జిల్లా) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ శాసనసభపక్ష నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నీలదీస్తామని ఆయన అన్నారు. బుధవారం అంథోలు గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు, పథకాలు ప్రవేశపెడుతూ వాటిని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. చౌక మద్యం పేరుతో సారాయిని ప్రవేశపెట్టడంపై తాము ఒప్పుకునేది లేదన్నారు. ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టే చీప్‌లిక్కర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు పరచలేదని, రాష్ట్రంలో ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.
తెలంగాణ ప్రజలు ఏదో ఆశించి అధికారాన్ని అప్పగిస్తే ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు అసంతప్తితో ఉన్నారన్నారు. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నా ఇప్పటి వరకూ ఒక్క ఇళ్లు కూడా కట్టించకపోగా, పాత ఇళ్ల బిల్లులను సైతం ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు రుణమాఫీ ప్రకటించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ప్రభుత్వం విడుదల చేసిన 25 శాతం డబ్బులు వడ్డీ క్రిందకే పోతున్నాయన్నారు. మొత్తం ఒకేసారి రైతులకు రుణమాఫీ డబ్బులను వారి ఖాతాల్లో వేయాలని ఆయన డిమాండ్ చేసారు. కొన్ని బ్యాంకుల్లో 25 శాతం కూడా చెల్లించలేదన్నారు.