ఓటుకు కోట్లు కేసుపై స్పందించిన హరిబాబు
చిత్తూరు : ఓటుకు కోట్లు కేసుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొనేవారు ఏం చేయాలో వారు అదే చేస్తున్నారని, చట్టం ఏం చేయాలో అదే చేస్తుందని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఈ రోజు వరకు బీజేపీ, టీడీపీలు కలిసే పనిచేస్తున్నాయని, హోదా ఇవ్వకుంటే టీడీపీ విడిపోతుందనే విషయం గురించి తనకు తెలియదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తుందని హరిబాబు అన్నారు. రాష్ట్రానికి హోదా బిల్లును ప్రవేశపెట్టడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. ఇప్పుడు ఏపీకి హోదా ఇస్తే బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తుందన్నారు. ఏపీకి హోదాకు మించిన ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సిద్దంగా ఉందన్నారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో రాజధాని నిర్మాణానికి రూ.2150 కోట్లు, క్రిష్ణా గోదావరి బేసిన్‌లో పెట్రోలియం నిల్వలు వెలికి తీయడానికి రూ.650 కోట్లు, రక్షణ రంగం, మౌలిక వసతులు, పోలవరం ప్రాజెక్టుల కోసం రూ.వేల కోట్లు విడుదల చేసిందన్నారు. ఇక పట్టణాల్లోని పేదలకు కేంద్రం నుంచి 1.19 లక్షల ఇళ్లు, వెనుకబడిన ఏడు జిల్లాల అభివృద్దికి రూ.700 కోట్లు కేటాయించిందన్నారు.
దీంతో పాటు ఎన్‌ఐటి కళాశాలల్లో 540 సీట్లు, ఎనిమిది కేంద్ర విద్యా సంస్థలు రాష్ట్రంలో స్థాపించిందన్నారు. రాజధాని నిర్మాణానికి నీతి ఆయోగ్య్ ఇచ్చే నివేదిక ఆధారంగా మరిన్ని నిధులు సైతం విడుదల చేస్తుందన్నారు. 2014-15 సంవత్సరంలో పది నెలలకు రూ.3,997 కోట్ల రెవెన్యూలోటుకు ఉందని, దీన్ని కూడా త్వరలోనే కేంద్రం పరిష్కరిస్తుందన్నారు.
కాగా ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరగాలని ఏసీబీ కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. తనపై కేసు కొట్టేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.