టీడీపీ అవినీతిని ఎండగట్టాల్సిందే
♦ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయం
♦ ఏపీ మరో బిహార్‌లా మారుతోందని నేతల ఆందోళన
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి చోటుచేసుకుంటోందని, ఆంధ్రప్రదేశ్ మరో బిహార్‌లా మారుతోందని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మచ్చతెచ్చేలా అధికార టీడీపీ వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం విజయవాడలో కోర్ కమిటీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు... ఈ సమావేశం వాడివేడిగా సాగింది. టీడీపీ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకరిద్దరు పూర్తిగా వత్తాసు పలకడంతో కోర్ కమిటీలోని మెజార్టీ నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎదగనీయకుండా అడ్డుకుంటోంది
మిత్రపక్షమైన టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని ఎదగనీయకుండా అడ్డుకోవడంతోపాటు ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోందని పలువురు నేతలు సిద్ధార్థనాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి కొమ్ముకాస్తూ బీజేపీని దెబ్బతీస్తున్న వారి విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ సభ్యులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్రభుత్వ అవినీతిపై ఎప్పటికప్పుడు ఆందోళనలు చేయాల్సిందేనని సిద్ధార్థనాథ్‌సింగ్ సూచించినట్లు తెలిసింది.
దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టాలి
కేంద్రంపై టీడీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని బీజేపీ కోర్ కమిటీ నిర్ణయానికి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పనులు, రాజధానికి కేంద్రం కేటాయించిన నిధుల వినియోగం, రాజధానిలో భూ దురాక్రమణ, రాష్ట్రవ్యాప్తంగా భూదందాలు, బాక్సైట్ దోపిడీ, సెజ్‌లు... ఇలా అన్నింటిపై దృష్టి సారించాలని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. ఒక నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి ప్రతి 15 రోజులకోసారి అన్ని అంశాలపై ప్రభుత్వంపై చర్చించాలని కోర్‌కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
జూన్ రెండో వారంలో అమిత్‌షా సభ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, జూన్ రెండో వారంలో వైఎస్సార్ జిల్లాలో భారీ సభ నిర్వహించాలని కోర్ కమిటీ నిర్ణయించింది. రాజమండ్రిలో నిర్వహించిన తరహాలోనే ఈ సభ జరపాలని ముఖ్య నాయకులు యోచిస్తున్నారు.