ప్రజలను మోసగించిన బీజేపీ, టీడీపీ
ప్రజలను మోసగించిన బీజేపీ, టీడీపీ
Published Thu, Sep 8 2016 11:15 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
– ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి
– పంచుకుతినడానికే ప్యాకేజీ
– వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ఆరోపణ
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేశాయని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ఆరోపించారు. గురువారం స్థానిక కష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తారని ప్రజలు ఎంతో ఆశించారని..అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా రూ.1.50 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారన్నారు. ఆ ప్యాకేజీలోనూ నిర్ధిష్టత కొరవడిందన్నారు. రక్తం ఉడికిపోతుందని చెప్పిన సీఎం చంద్రబాబు... కేంద్రం హోదా ఇవ్వకపోతే ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ నిరంతరం ఆందోళనలు చేపడుతూనే ఉందని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా తమ హక్కంటూ ఐదుకోట్ల ఆంధ్రులు అడుగుతున్నా చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేని సీఎం..వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ దోచుకుతినడానికి బాగా ఉపయోగపడుతుందని ఆరోపించారు.
ఓటుకు నోటు కేసుకు హోదా తాకట్టు
ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో తప్పు చేయకపోతే స్టే తీసుకురావాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ జరిగితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమాధానం చెప్పలేనని సీఎం భయపడ్డారన్నారు. స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను త్యాగం చేసి, ఐదు కోట్ల ఏపీ ప్రజలకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని, వేరే ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా తెస్తారన్నారు. విలేకరుల సమావేశంలో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకష్ణ, రాష్ట్ర నాయకులు రహ్మాన్, రఘు, సత్యం యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా నాయకులు టి.వి.రమణ, శౌరి విజయకుమారి, నగర నాయకులు బసవరాజు, మంగమ్మ, ప్రహ్లాదాచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement