ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
Published Mon, Aug 1 2016 12:26 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
– కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
– పార్టీలకతీతంగా పోరాడుదాం
– 2న జిల్లా బంద్‌కు సహకరించండి
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు
కర్నూలు (ఓల్డ్‌సిటీ):
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మాట ఇచ్చి రెండు రోజుల క్రితం రాజ్యసభలో తీర్మానాన్ని తోసిపుచ్చడం దారుణమన్నారు. ప్రత్యేక హోదాతో కార్మిక, పారిశ్రామిక, విద్యా, వైద్య, ఉపాధి రంగాలు అభివద్ధి చెందుతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిసార్లు ఉద్యమాలు చేపట్టినా టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోరుతున్నది రాజకీయ లబ్ధి కోసం కాదని, ప్రజా ప్రయోజనాల కోసమేనన్నారు. పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఆగస్టు 2వ తేదీన తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా బంద్ పాటిస్తున్నామని, అన్నిపార్టీలు, కుల సంఘాలు కలిసి పనిచేయాలని, వ్యాపార, విద్యా సంస్థలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కేంద్రాన్ని నిలదీయండి: గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
బీజేపీ ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై నోరు విప్పలేకపోతున్నారని విమర్శించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో టీడీపీ ఎంపీలు సీట్ల పెంపు అంశంపై మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు, గ్రాంట్లు వస్తాయన్నారు. ప్రజలు పార్టీలకు అతీతంగా బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు:
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ అన్నారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. టీడీపీ, బీజేపీలకు బుద్ధి వచ్చేలా బంద్ నిర్వహించాలని, ప్రజలు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని సూచించారు.
ప్రత్యేక ప్యాకేజ్ ఐస్‌గడ్డ:
ఏపీకీ ప్రత్యేక హోదా చాలా అవసరమని తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదట్నుంచీ చెబుతున్నారని పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అన్నారు. ఆ మేరకు పార్టీ ఉద్యమాలు చేస్తుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామనడం సమంజసం కాదని, అది ఐస్‌ముక్కలా కింది స్థాయికి చేరక మునుపే కరిగిపోతుందన్నారు.
కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర గొర్రెల పెంపకం దారుల సంఘం మాజీ ౖచైర్మన్ పి.జి.రాంపుల్లయ్య యాదవ్, పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సత్యం యాదవ్, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి రహ్మాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.జహీర్ అహ్మద్ ఖాన్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పిట్టం ప్రతాప్‌రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, యువజన విభాగం, మైనారిటీసెల్, ట్రేడ్ యూనియన్, జిల్లా అధ్యక్షులు పి.రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఫిరోజ్, టి.వి.రమణ, మహిళా విభాగం అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, కార్యదర్శి సలోమి, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement