తణుకు : ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీ నాయకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. శనివారం తణుకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారుమూరి మాట్లాడారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయన్నారు. రెండున్నరేళ్లు ప్రజలను మభ్య పెట్టి దోబూచులాడుతూ చివరికి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రం ప్రకటించడం దారుణమన్నారు. ఐదు కాదు పదేళ్లు కావాలని వెంకయ్యనాయుడు, పది కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు నేడు తమ స్వప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసులో తాను బయటపడేందుకు ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు. 22న ఏలూరులో యువభేరి నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ములగాల శ్రీనివాసు, గౌరవాధ్యక్షుడు ఎస్‌ఎస్ రెడ్డి, సమన్వయకర్త కలిశెట్టి శ్రీనివాసు, నాయకులు నార్గన సత్యనారాయణ, పెన్మత్స రామరాజు, కౌరు వెంకటేశ్వర్లు, బుద్ధరాతి భరణీప్రసాద్, హబీబుద్దీన్, దాసి రత్నరాజు, వి.సీతారామ్ పాల్గొన్నారు.