నల్లబెల్లం, పటిక స్వాధీనం
-
వాహనాల తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు
-
ఒంగోలు నుంచి కురవికి తరలిస్తున్న వైనం
కురవి : వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల నల్లబెల్లం, 6 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నామని కురవి ఎస్సై జె.రామకృష్ణ, మహబూబాబాద్ ఎక్సైజ్ ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి డీసీఎంలో 50కేజీల బరువు కలిగిన 130 బస్తాల నల్లబెల్లం, 6 క్వింటాళ్ల పటికను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం కురవి సీఐ శ్రీనివాస్‌నాయక్‌కు అందింది. దీంతో శనివారం రాత్రి కురవి లోని నేరడ క్రాస్ రోడ్డు (356 జాతీయ రహదారి)పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఒంగోలు నుంచి మరిపెడకు అక్కడి నుంచి కురవికి వస్తున్న డీసీఎంను తనిఖీ చేయగా 65 క్వింటాళ్ల నల్లబెల్లం, ఆరు క్వింటాళ్ల పటిక బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు డీసీఎంతోపాటు రూ.5లక్షల విలువైన బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లం, పటిక తెప్పిస్తున్న మానుకోట శివారు బాబునాయక్ తండాకు చెందన బానోత్ రవికుమార్, బేతోలుకు చెందిన గుగులోత్ శ్రీను పరారీ అయినట్లు వారు తెలిపారు. పరారైన ఇద్దరితోపాటు డ్రైవర్ మోహన్‌రావు, ఎస్కార్ట్‌గా ఉన్న ఆంగోత్ హతిరాంలపై కేసు నమోదు చేసినట్లు, డ్రైవర్ మోహన్‌రావు, హతీరాంను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ట్రైయిని ఎస్సై షేక్ తాహేర్‌బాబా, పోలీసులు సంపత్‌రెడ్డి, ప్రకాశ్ ఉన్నారు.