Vehicles checking
-
కారు డిక్కీలో కరెన్సీ కట్టలు..
సాక్షి, చేవెళ్ల: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారులు ఓ కారు డిక్కీలో తరలిస్తున్న రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ కారు డిక్కీలో రూ. 60 లక్షలు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. నగదు గురించి ఆరా తీయగా.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందినవిగా తెలిసింది. దీంతో పట్టుబడిన నగదును రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. అనంతరం నగదును సీజ్ చేసి వివరాలు అందించాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకీ గురిపెట్టి తనిఖీలు..
బదౌన్: బైక్ మీద వెళుతున్న ప్రయాణికులను పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపి, పాయింట్‌బ్లాంక్‌లో గన్ పెట్టి సోదా చేస్తే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో ద్విచక్ర వాహనదారులకు ఎదురైంది. బైక్‌ను ఆపి, దిగి చేతులు వెనక్కు పెట్టి కదలకుండా ఉండాల్సిందిగా ఆజ్ఞాపించారు. అనంతరం సోదాలు నిర్వహించారు. సోదా నిర్వహిస్తుండగా ఇద్దరు పోలీసులు గన్ గురిపెట్టి నిల్చున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇలా పౌరులను భయభ్రాంతులకు గురి చేయడం సరి కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి కేవలం పోలీసులు తమను తాము రక్షించుకోవడానికే అని జిల్లా సూపరింటెండెంట్ పోలీసు అశోక్ కుమార్ త్రిపాఠి సోమవారం వివరణ ఇచ్చారు. కొందరు నేరగాళ్లు తమ వెంట ఆయుధాలు తెచ్చుకొని పోలీసులపై దాడిచేసే అవకాశం ఉందని అందుకే ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. -
డబ్బులడిగితే కఠిన చర్యలు
108, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ అనంతపురం సిటీ: అత్యవసర సేవలకు డబ్బు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వైద్యాధికారి వెంకటరమణ స్పందించారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద 108 వాహనాలతో పాటు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల్లోని పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. డబ్బులు డిమాండ్ చేసిన వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. వాహనాల్లో మందులు, సిలెన్ బాటిళ్లు, వెంటిలేటర్లు తదితర పరికరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలన్నారు. సేవల్లో ఎలాంటి జాప్యం జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. విషజ్వరాల నియంత్రణకు కృషి చేయండి జిల్లావ్యాప్తంగా విష జ్వరాలు నియంత్రించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ తెలిపారు. స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి నుంచి నేటి దాకా జిల్లా వ్యాప్తంగా 60 డెంగీ కేసులు, 425 మలేరియా కేసులు నమోదయినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని అప్రమత్తం చేసి జ్వరాలు వ్యాపించకుండా చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో టీబీ ఆఫీసర్ డాక్టర్ సుధీర్‌బాబు, లక్ష్మన్న, ల్యాబ్ టెక్నీషియన్లు శ్రీధర్, బాలాజీ, శ్రీనివాసులు, గంగాధర్ పాల్గొన్నారు. -
నల్లబెల్లం, పటిక స్వాధీనం
వాహనాల తనిఖీల్లో పట్టుకున్న పోలీసులు ఒంగోలు నుంచి కురవికి తరలిస్తున్న వైనం కురవి : వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల నల్లబెల్లం, 6 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నామని కురవి ఎస్సై జె.రామకృష్ణ, మహబూబాబాద్ ఎక్సైజ్ ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం విలేకరులకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి డీసీఎంలో 50కేజీల బరువు కలిగిన 130 బస్తాల నల్లబెల్లం, 6 క్వింటాళ్ల పటికను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం కురవి సీఐ శ్రీనివాస్‌నాయక్‌కు అందింది. దీంతో శనివారం రాత్రి కురవి లోని నేరడ క్రాస్ రోడ్డు (356 జాతీయ రహదారి)పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఒంగోలు నుంచి మరిపెడకు అక్కడి నుంచి కురవికి వస్తున్న డీసీఎంను తనిఖీ చేయగా 65 క్వింటాళ్ల నల్లబెల్లం, ఆరు క్వింటాళ్ల పటిక బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు డీసీఎంతోపాటు రూ.5లక్షల విలువైన బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లం, పటిక తెప్పిస్తున్న మానుకోట శివారు బాబునాయక్ తండాకు చెందన బానోత్ రవికుమార్, బేతోలుకు చెందిన గుగులోత్ శ్రీను పరారీ అయినట్లు వారు తెలిపారు. పరారైన ఇద్దరితోపాటు డ్రైవర్ మోహన్‌రావు, ఎస్కార్ట్‌గా ఉన్న ఆంగోత్ హతిరాంలపై కేసు నమోదు చేసినట్లు, డ్రైవర్ మోహన్‌రావు, హతీరాంను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో ట్రైయిని ఎస్సై షేక్ తాహేర్‌బాబా, పోలీసులు సంపత్‌రెడ్డి, ప్రకాశ్ ఉన్నారు. -
420 కేజీల గంజాయి పట్టివేత
విశాఖపట్నం(చౌడవరం): విశాఖపట్నం జిల్లా చౌడవరంలో పోలీసుల చేపట్టిన వాహన తనిఖీల్లో 420 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం రావికమతం మండల శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 420 కేజీల గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు తుపాకులు, 32 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 42లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మారణాయుధాలు ధరించి గంజాయి తరలించడం ఇదే మొదటిసారని పోలీసులు అంటున్నారు. కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివీ..రావికమతం మండలం మర్రివలస గ్రామానికి చెందిన అమిరెడ్డి వెంకటరమణ, విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రావికమతం, కొత్తకోట, రోలుగుంట ఎస్ఐలు సురేష్‌కుమార్, ఉమామహేశ్వరరావు, శిరీష్‌కుమార్, వెంకటరావు సిబ్బందితో పలు దారుల్లో మాటువేశారు. రోలుగుంట మండలం బుచ్చెంపేట ఆర్చ్ వద్ద వ్యాన్‌లో 360 కిలోల గంజాయితో రమణ పట్టుబడ్డాడు. వడ్డాది సమీపంలో వెంకటేశ్వరరావు కారులో 60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. రమణ వద్ద పిస్తోలుతోపాటు 9 బుల్లెట్లు, వెంకటేశ్వరరావు వద్ద పిస్తోలు 19 బుల్లెట్లు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనలో నర్సీపట్నానికి చెందిన మహరాజా హోటల్ నిర్వాహకుడు, రమణ బంధువు పరారీలో ఉన్నాడు. ఉజ్జయినీలో పిస్తోళ్ల కొనుగోలు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ సమీపంలోని రేవ్ అనే గ్రామంలో తాము పిస్తోళ్లు కొనుగోలు చేసినట్లు పట్టుబడిన వెంకటరమణ, వెంకటేశ్వరరావు వెల్లడించారు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ఒక్కింటి శ్రీనివాసచౌదరి (బాబా)తో వ్యాపార గొడవలున్నాయని, తమ వ్యాపారాన్ని తరచూ అడ్డుకుంటుండటంతో అతనిని నిలువరించాలన్న ఉద్దేశంతో పిస్తోళ్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.