విశాఖపట్నం(చౌడవరం): విశాఖపట్నం జిల్లా చౌడవరంలో పోలీసుల చేపట్టిన వాహన తనిఖీల్లో 420 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం రావికమతం మండల శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 420 కేజీల గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు తుపాకులు, 32 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 42లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మారణాయుధాలు ధరించి గంజాయి తరలించడం ఇదే మొదటిసారని పోలీసులు అంటున్నారు.
కొత్తకోట సీఐ మల్లేశ్వరరావు తెలిపిన వివరాలివీ..రావికమతం మండలం మర్రివలస గ్రామానికి చెందిన అమిరెడ్డి వెంకటరమణ, విశాఖకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రావికమతం, కొత్తకోట, రోలుగుంట ఎస్‌ఐలు సురేష్‌కుమార్, ఉమామహేశ్వరరావు, శిరీష్‌కుమార్, వెంకటరావు సిబ్బందితో పలు దారుల్లో మాటువేశారు. రోలుగుంట మండలం బుచ్చెంపేట ఆర్చ్ వద్ద వ్యాన్‌లో 360 కిలోల గంజాయితో రమణ పట్టుబడ్డాడు. వడ్డాది సమీపంలో వెంకటేశ్వరరావు కారులో 60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. రమణ వద్ద పిస్తోలుతోపాటు 9 బుల్లెట్లు, వెంకటేశ్వరరావు వద్ద పిస్తోలు 19 బుల్లెట్లు ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటనలో నర్సీపట్నానికి చెందిన మహరాజా హోటల్ నిర్వాహకుడు, రమణ బంధువు పరారీలో ఉన్నాడు. ఉజ్జయినీలో పిస్తోళ్ల కొనుగోలు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినీ సమీపంలోని రేవ్ అనే గ్రామంలో తాము పిస్తోళ్లు కొనుగోలు చేసినట్లు పట్టుబడిన వెంకటరమణ, వెంకటేశ్వరరావు వెల్లడించారు. విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన ఒక్కింటి శ్రీనివాసచౌదరి (బాబా)తో వ్యాపార గొడవలున్నాయని, తమ వ్యాపారాన్ని తరచూ అడ్డుకుంటుండటంతో అతనిని నిలువరించాలన్న ఉద్దేశంతో పిస్తోళ్లు కొనుగోలు చేసినట్టు తెలిపారు.