ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: గంజాయి స్మగ్లింగ్ ముఠాలను నడిపించే డాన్‌ల ఆటకట్టించే కార్యాచరణకు ఏపీ పోలీస్ శాఖ రంగంలోకి దిగుతోంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల(ఏవోబీ)ను అడ్డాగా చేసుకుని దేశవ్యాప్తంగా గంజాయి దందా సాగిస్తున్న కేరళ, మహారాష్ట్ర ముఠా నేతలే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌కు సిద్ధపడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో గంజాయి రవాణా చేసే మధ్యవర్తులు, చిన్న నేరస్తులను పట్టుకుని హడావుడి చేసి.. ఆపై మౌనంగా ఉండిపోవడం అలవాటుగా మారిపోయింది.
అందుకు పూర్తిభిన్నంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పోలీసులను ఫుల్ యాక్షన్‌లోకి దింపుతోంది. గంజాయి స్మగ్లింగ్ ముఠాలను నడిపించే బాస్‌లకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగును రూపుమాపేందుకు ఇప్పటికే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) ‘ఆపరేషన్ పరివర్తన్’ చేపట్టింది. గంజాయి సాగుకు వ్యతిరేకంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడం, గంజాయి పంటను ధ్వంసం చేసే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి కీలక కొనసాగింపుగా గంజాయి స్మగ్లింగ్ వెనుక ఉండే అసలు సూత్రధారులకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది.
కేరళ, మహారాష్ట్ర ముఠాలే అసలు సూత్రధారులు
ఏవోబీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ పూర్తిగా రాష్ట్రేతర ముఠాల కనుసన్నల్లోనే దశాబ్దాలుగా సాగుతోంది. ఈ దందా నిర్వహిస్తున్న సూత్రధారులంతా కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందినవారే. వారే విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మారుపేర్లతో ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. అక్కడి నుంచి ఏజంట్ల ద్వారా మన్యంలో గంజాయి సాగుకు నిధులు సమకూరుస్తారు.
పంట పండిన తరువాత వేలంలో కొనుగోలు చేసి పోలీసుల కళ్లుగప్పి కేరళ, మహారాష్ట్ర, హైదరాబాద్‌లకు తరలిస్తున్నారు. కేరళ ముఠాలు ఏకంగా ప్రత్యేక నైపుణ్యం గల వారిని ఏవోబీలోకి పంపించి గంజాయి ఆకుల నుంచి ద్రవ రూప గంజాయి (లిక్విడ్ గంజా)ని తయారు చేస్తూ అక్రమ రవాణా చేస్తున్నాయి. ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా వేళ్లూనుకుపోయింది.
యాక్షన్‌లోకి పోలీస్ టీమ్‌లు
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గంజాయి సాగును నిర్దేశిస్తూ, స్మగ్లింగ్ చేస్తున్న ముఠా నాయకుల్లో కొందరిని పోలీస్ శాఖ ఇప్పటికే గుర్తించింది. కేరళ, మహారాష్ట్రలకు చెందిన డాన్‌ల పేర్లు, చిరునామాలు, ఏపీలో వారి మారు పేర్లు, ఇతర వివరాలతో జాబితాలు రూపొందించినట్టు సమాచారం. ఇప్పటికే ఐజీ, ఎస్పీ స్థాయి అధికారులతో యాక్షన్ ప్లాన్‌ను ఖరారు చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ)తోనూ రాష్ట్ర పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికే ఏవోబీలో చేపడుతున్న ఆపరేషన్ పరివర్తన్‌ను ఎన్‌సీబీకి చెందిన కొందరు అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది. ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసే విషయంలో సహకరిస్తోంది. గంజాయి డాన్‌లను లక్ష్యంగా చేసుకుని ఏపీ పోలీసులు ఆపరేషన్‌కు సిద్ధపడటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. త్వరలోనే సత్ఫలితాలు సాధిస్తామని పోలీస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment