పెళ్లి విషయంలో కులం గురించి ఆధునికతరం అంతగా పట్టించుకోవడం లేదా? క్యాస్ట్ కంటే క్యారెక్టర్కే పాధాన్యత ఇస్తున్నారా? కులం కంటే సామాజిక భద్రతకే పెద్దపీట వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి సర్కారీ గణాంకాలు. దేశంలో నానాటికీ పెరుగుతున్న కులాంతర వివాహాలే ఇందుకు రుజువని చెబుతున్నాయి. ముఖ్యంగా నిమ్న కులాలకు చెందిన వారిని జీవిత భాగస్వాములుగా స్వీకరించేందుకు ముందుకు వస్తున్న యువతీయువకుల సంఖ్య పెరుగుతుండడం విశేషం.
సంఘసంస్కర్తలు ఆశించిన కులవివక్ష నిర్మూలన మన సమాజంలో స్పీడుగా కాకపోయినా నెమ్మదిగా మాత్రం లేవని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే ముందుంది. ఒక్క మహారాష్ట్రలోనే గతేడాది ఇవి నాలుగురెట్లు పెరిగాయి. ఇవన్నీ దళిత కులాలతో సంబంధమున్న పెళ్లిళ్లే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో కేరళలో కులాంతర కళ్యాణాలు ఎక్కువగా జరిగాయి.
నిమ్నకులాల వారిని లైఫ్ పార్టనర్స్ చేసుకునేవారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. 2012లో 9,623 కులాంతర వివాహాలు జరిగాయని కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. 2011లో ఈ సంఖ్య 7,148గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2012లో 3,040 పెళ్లిళ్లు జరిగాయి. 2011లో 1,805 వివాహాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,296 కులాంతర పెళ్లిళ్లు జరిగాయి. 2011లో కేవలం 563 వివాహాలే నమోదయ్యాయి. కేరళలో 2,454 మంది కులాంతర వివాహాలు చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తమిళనాడులోనూ పెరుగుదల కనిపించడం ఆసక్తికర విషయం. అయితే కులాంతర వివాహాలు చేసుకున్న వారందరూ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనా ధోరణిలో మార్పు రావడం కులాంతర వివాహాలు పెరగడానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా ఈ ట్రెండ్ను ప్రోత్సహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.50 వేలు ప్రోత్సహకమిస్తోంది. కులవివక్ష నిర్మూలనకు కులాంతర వివాహాలు దోహదపడతాయని సంఘ సంస్కర్తలు గట్టిగా నమ్మారు. ఈ దిశగా ఆధునిక తరం వడివడిగా అడుగులు వేస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.
కులాంతర పెళ్లిళ్లు పెరిగాయ్!
Published Fri, Sep 20 2013 2:58 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement