
రావికమతం : గిరిజన గ్రామం రొచ్చుపణుకు నుంచి తరలించేందుకు బొలేరో వాహనంలో సరకు వేస్తుండగా కొత్తకోట పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి రూ.17లక్షల విలువైన 560 కేజీల గంజాయిని ఆదివారం రాత్రి పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారయ్యారు. కొత్తకోట సీఐ లక్ష్మణమూర్తి అందించిన వివరాలివి. రొచ్చుపణుకు గ్రామం నుంచి పెద్ద ఎత్తున గంజాయి తరలించేందుకు సిద్ధమైనట్టు తమకు సమాచారం అందడంతో ఎస్‌ఐ అప్పలనాయుడు, సిబ్బందితో ఆదివారం రాత్రి దాడి చేశామన్నారు.
ఈ దాడిలో బొలేరో వాహనంలో నిల్వ చేసిన 24 బస్తాలు గల 560 కేజీల గంజాయి లభ్యమైందన్నారు. అక్కడ వ్యవహారం చేసిన ఇద్దరు వ్యక్తులు మాకవరపాలెం సీతన్న అగ్రహారానికి చెందిన చొప్పా రాజిబాబు,జి.కోడూరుకు చెందిన నమ్మి రాంబాబులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. మరొకరు పరారయ్యారన్నారు. అతని గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment