బ్లాక్‘మెయిల్స్’తో హడల్
బ్లాక్‘మెయిల్స్’తో హడల్
Published Tue, Aug 30 2016 9:55 PM | Last Updated on Wed, Apr 3 2019 4:10 PM
* వైద్య, ఆరోగ్యశాఖలో బ్లాక్ ‘మెయిల్’ రాజకీయాలు
* అధికారులను బెంబేలెత్తిస్తున్న ఆ నలుగురు..
* అధికారిక సమాచారం చేరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైద్యుడు
* అర్బన్ ఎస్పీ, కలెక్టర్‌లకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు
సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖలో ఆ నలుగురి దెబ్బకు ఉద్యోగులు, అధికారులు సైతం హడలిపోతున్నారు. జిల్లాస్థాయి అధికారులు మొదలుకొని రీజనల్ అధికారుల వరకూ అందరిపై ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. వీరికి అనుకూలంగా వ్యవహరించకపోతే బ్లాక్ ‘మెయిల్’ చేస్తూ బెదిరిస్తారు. నిత్యం 548 మంది అధికారులకు మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేస్తుంటారు. వైద్య, ఆరోగ్యశాఖ రీజనల్, జిల్లా కార్యాలయాల్లో ప్రధానమైన పోస్టుల్లో ఏడుగురు మహిళా అధికారులు ఉన్నారు. బ్లాక్ మెయిలర్స్ బెదిరింపులకు వారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా ఇదే తంతు...
వైద్య ఆరోగ్యశాఖలో సుమారు నాలుగేళ్లుగా ఆ నలుగురు ఉద్యోగులు నిత్యం జిల్లా, జోనల్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో సమాచారం కావాలంటూ దరఖాస్తు చేస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం అడగకుండా ఇతర ఉద్యోగుల వివరాలన్నీ కోరుతున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందక సమాచారాన్ని దాస్తున్నారని అధికారులపై సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. రోజుకు 548 మంది మెయిల్‌కు ఫిర్యాదులు చేస్తుండడంతో ఏదో తప్పు చేయకపోతే మీపై ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ఆ నలుగురిలో ఇద్దరు వైద్యులు
బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఆ నలుగురిలో ఇద్దరు వైద్యులు సైతం ఉండడం గమనార్హం. నలుగురు ఉద్యోగులు ఓ ప్రైవేట్ వ్యక్తి మెయిల్‌కు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని అందజేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు జిల్లా అధికారుల వద్ద ఆ నలుగురి బెదిరింపుల గురించి మొరపెట్టుకుంటున్నారు. జిల్లా అధికారులు జోనల్ అధికారుల వద్ద, జోనల్ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద మొరపెట్టుకోవడమే తప్ప వారిపై చర్యలను తీసుకునే సాహసం ఎవరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వెళ్లిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పద్మజారాణితో పాటు పలువురు జోనల్, జిల్లాస్థాయి అధికారులు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లకు సైతం వీరు బ్లాక్ మెయిలర్స్‌పై ఫిర్యాదులు చేశారు.
వ్యక్తిగత విషయాలపై ఆరా...
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత విషయాలను బయటపెట్టి బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతున్నట్లు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో జిల్లా అధికారులు పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలు బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో పలువురు అధికారులు వారికి ఎంతో కొంత డబ్బులను ముట్టజెప్పి మిన్నకుండిపోతున్నారు. వ్యక్తిగత విషయాలను చెప్పకుండా ఉండేందుకు అధిక మొత్తంలోనే డబ్బులను డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు తెలిసింది. కార్యాలయం పనులు పక్కనబెట్టి వారు అడిగిన సమాచారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని వాపోతున్నారు.
బ్లాక్ మెయిలర్స్‌పై విచారణ..
వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించినట్టు తెలిసింది. అధికారులను ఫోన్‌లలో బెదిరించిన ఫోన్ రికార్డులు సైతం పోలీసులు సేకరించినట్టు సమాచారం. వైద్య, ఆరోగ్యశాఖ సైట్ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల మెయిల్స్‌కు సమాచారం అందిస్తూ ఓ వైద్యుడు ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాలుగేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖను కుదిపేస్తున్న బ్లాక్ మెయిలర్స్‌కు పోలీసులు చెక్ పెట్టనుండడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
Advertisement
Advertisement