ప్రజల మనిషి బీఎన్‌ఆర్
అనంతపురం : దానశీలి, మానవతావాది, ప్రజల మనిషి బి.నారాయణరెడ్డి (బీఎన్‌ఆర్) అని వక్తలు కొనియాడారు. నగరంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆవరణలో ఆదివారం బీఎన్‌ఆర్ ఆత్మీయ సంస్మరణ సభ జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బి.నారాయణరెడ్డి ఫొటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి బీఎన్‌ఆర్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. వైఎస్ మరణానంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కుటుంబం అండగా నిలిచిందన్నారు. బీఎన్‌ఆర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం బీఎన్‌ఆర్ అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ 1989 తర్వాత కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతి రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి బీఎన్‌ఆర్ అండగా నిలిచారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ అనంతపురం నగర ప్రజలకు తాగునీటి సమస్య తీర్చాలని పదేపదే తనతో చెప్పేవారన్నారు. ఈరోజు పీఏఆర్‌బీఆర్ నుంచి తాగునీరు లభిస్తోందంటే అందులో బీఎన్‌ఆర్ కృషి కూడా మరవలేనిదన్నారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ లింగారెడ్డి మాట్లాడుతూ మంచి గుణాలు, సేవాభావం కల్గిన వ్యక్తి బీఎన్‌ఆర్ అన్నారు.
ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘అనంత’ మనసులు చూరగొన్న మంచి మనిషి బీఎన్‌ఆర్ అని అన్నారు. నగర అభివృద్ధిలో ఆయన కృషి మరవలేనిది అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ బీఎన్‌ఆర్ భౌతికంగా దూరమైనా ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటారన్నారు. ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నారాయణరెడ్డి అందర్నీ ఆప్యాయంగా పలుకరించేవారని గుర్తు చేశారు. ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాయతీకి ప్రతిరూపం బీఎన్‌ఆర్ అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ బీఎన్‌ఆర్ ఇంటికి ఎప్పుడెళ్లినా ముందుగా యోగక్షేమాలు అడిగి తర్వాత వచ్చిన పని గురించే అడిగేవారన్నారు. నేటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తులుండడం చాలా అరుదన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ బి.నారాయనరెడ్డి గొప్ప మానవతావాది అని, విశ్వసనీయతకు మారుపేరు అని కొనియాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలతోనే బీఎన్‌ఆర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. దానగుణంలో ఆయన ముందుండేవారన్నారు. సీపీఐ (ఎంఎల్) నాయకులు పెద్దన్న మాట్లాడుతూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు ఆందోళనలు నిర్వహించినా శాంతియుతంగా నచ్చజెప్పి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారని గుర్తు చేశారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ తాను రాజకీయంగా ఈరోజు ఈస్థాయిలో ఉన్నానంటే అది బీఎన్‌ఆర్ చలువేనన్నారు. వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీంఅహ్మద్ మాట్లాడుతూ మంచికి మారుపేరు బీఎన్‌ఆర్ అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
స్మారక చిహ్నం ఏర్పాటు
అనంతపురం పట్టణాభివృద్ధికి విశేష కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్మారక చిహ్నం ఏర్పాటు చేసేందుకు సభలో తీర్మానించారు. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధం లేకుండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చిహ్నం నిర్మాణానికి తనవంతుగా రూ. లక్ష ఇస్తానని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించగా, పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి రూ. లక్షా 16 వేలు ప్రకటించారు. కార్యక్రమంలో బీఎన్‌ఆర్ కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, బి.రెడ్డప్పరెడ్డి, మాజీమంత్రి నర్సేగౌడ్, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, తిప్పేస్వామి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, తాడిపత్రి రమేష్‌రెడ్డి, మడకశిర వైటీ ప్రభాకర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కోటా సత్యం, మాజీ మునిసిపల్ చైర్మన్ నూర్ మహమ్మద్, కలీఖుల్లాఖాన్, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధనుంజయయాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బుర్రా సురేష్‌గౌడ్, గౌస్‌బేగ్, నగర అధ్యక్షులు రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.