మృత్యువులోనూ వీడని బంధం
- ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
- అన్నదమ్ముల మృతి
- ఇద్దరూ అక్కాచెల్లెలును వివాహం చేసుకున్న వైనం
-అత్తారింటికి వెళ్తుండగా ఘటన
ఎమ్మిగనూరు రూరల్ : వారిద్దరూ అన్నదమ్ములు. కలసిమెలసి ఉండేవారు. కష్టనష్టాల్లో ఒకరికొకరు సాయపడుకుంటూ అనుబంధాన్ని కొనసాగించేవారు. పైగా ఇద్దరూ ఒకే ఇంట్లో.. అది కూడా అక్కాచెల్లెలును వివాహం చేసుకున్నారు. సోమవారం అత్తారింటికి కూడా కలిసి వెళ్తుండగా.. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు వారిని కబళించింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామానికి చెందిన టెంకాయల గొల్ల బసప్ప, పద్మమ్మ దంపతులకు రఘు(38), బలరాముడు(36) అనే ఇద్దరు కుమారులు. రఘు ఆటోడ్రైవర్‌గానూ, బలరాముడు ఆటో డ్రైవింగ్‌తో పాటు ఇతరత్రా పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. వీరు గోనెగండ్ల మండలం కులమాల గ్రామంలో అక్కాచెల్లెలు సుజాత, లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు.
రఘు భార్య సుజాత 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో అతను సోమవారం సాయంత్రం అత్తారింటికి వెళ్లొస్తానని తల్లి పద్మమ్మకు చెప్పి ఖర్చులకు డబ్బు ఇప్పించుకున్నాడు. తాను తిరిగొచ్చే సమయానికి దుస్తులు ఉతికిపెట్టాలని తల్లికి చెప్పాడు. తనతో పాటు తమ్ముడు బలరాముడిని కూడా పిలుచుకుని ఆటోలో బయలుదేరారు. ఎర్రకోట ఇంజినీరింగ్ కళాశాల ఎదుట కర్నూలు నుంచి అనంతపురం జిల్లా రాయదుర్గం వెళ్తున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 02జెడ్ 0160) ఆటోను ఎదురుగా ఢీకొట్టింది. ఆటో నుజునుజ్జు అయ్యింది.
డ్రైవింగ్ చేస్తున్న రఘు అందులోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. బలరాముడికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న వారు వెంటనే 108కు సమాచారం అందించారు. ఆ అంబులెన్స్‌లో తీవ్రంగా గాయపడిన బలరాముడిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయమై.. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని కె.నాగలాపురం వద్ద బలరాముడు మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రఘుకు భార్య సుజాతతో పాటు కుమారుడు చంద్ర(4), బలరాముడికి భార్య లక్ష్మీతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారుల మృతి విషయాన్ని తెలుసుకున్న తల్లి పద్మమ్మ ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని గుండెలవిసెలా రోదించారు. ఆమె రోదిస్తున్న తీరు చూసి అక్కడి వారు చలించిపోయారు. సంఘటన స్థలాన్ని సీఐ ప్రసాద్, రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ తెలిపారు.